మానవ జీవనం అనుక్షణమూ రాజకీయాలతో ముడిపడి ఉంటుంది. రాత్రుళ్లు నిద్ర చెడగొట్టే అతి భీకర శబ్దాలతో వీధులలో తీసే ఊరేగింపుల దగ్గర నుంచి, ఢిల్లీ అధికారిక కేంద్రంలో రహస్యంగానో, నలుగురి మధ్యలోనో తీసుకునే లిఖిత, అలిఖిత నిర్ణయాలు మన జీవితాలపై ప్రభావం చూపుతుంటాయి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న రాజకీయం ఒక ‘కెరీర్’గా, అత్యంత పకడ్బందీగా, పాఠ్యాంశంగా బోధించవలసిన అవసరం ఉన్నది. టీఎన్ శేషన్ స్థాపిం చిన పూణేలోని ఎంఐటీ ‘స్కూల్ ఆఫ్ గవర్నమెంట్’, హైదరాబాద్‌లోని ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ లాంటివి మనదగ్గరా; ఇంగ్లండ్‌లోని ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనా మిక్స్’ లాంటివి రాజకీయాలు సహా, పబ్లిక్ పాలసీ లాంటి కోర్సులు నడుపుతున్నాయి. ఈ దిశగా మరిన్ని సంస్థలు రావాల్సిన అవసరం ఉంది. వృత్తివిద్యా కోర్సులు చదివే వారికి క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ఉన్నట్టే, ఈ రాజకీయ/ ఆర్థిక పాఠశాల నుంచి వచ్చే వారిని కూడా సోషల్ రీసెర్చ్, రాజకీయాలు సహా అనేక ఇతర రంగాల వారు రిక్రూట్ చేసుకునే స్థితిని ఒకసారి ఊహించండి. ఊహలూ, కలలే నిజాలు అవుతాయి కదా?
ఇదంతా ఎందుకంటే, భారతదేశం ఒకవైపు బలమైన ఆర్థిక శక్తిగా రూపు దిద్దుకుంటూ వుంటే... మరోవైపు పేద ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయి. ప్రభు త్వాలు వారికి సంక్షేమ పథకాలు నిరంతరం అమలు చేయాల్సిన పరిస్థితులు పదిలంగా ఉంటున్నాయి. మళ్ళీ వీటిని ‘ఉచితాలు’ అంటూ కొందరు అగ్రనాయకులు హుంకరిస్తూ ఉంటారు. ఎక్కడో సమతుల్యత లోపిస్తున్నది కదా? దీనిని సరిదిద్దాలంటే సీరియస్ రాజకీయ, ఆర్థిక అవగాహన, విధానాల రూపకల్పన, కార్యాచరణ అవ సరం. మతం, కులం పరిధుల్ని దాటి ఆలోచించాల్సిన అగత్యమూ ఉన్నది. వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్య్రం ప్రాముఖ్యం అర్థం అయితే అసలైన రాజకీయాలు అర్థం అవుతాయి. వ్యవస్థలు దాచిపెట్టే విషయాలను బ్లాక్ అండ్ వైట్‌లో చూడగలగడం అలవడుతుంది. ప్రభుత్వాలు తీసుకువచ్చే చట్టాలు, పథకాలు ఏం సాధించడానికి అని విశ్లేషిస్తే... ఆ నిర్ణయాల వెనక రాజకీయాలు అర్థం అవు తాయి. అయితే పార్టీలపై, నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం, ప్రసార సాధనాలకు ఉండే అవసరాలు నిజా లను కప్పి పెడతాయి.
దేశంలో గత కొన్ని సంవత్సరాల పరిణామాలను మనం జాగ్రత్తగా గమనిస్తే స్వాతంత్య్ర పోరాట వీరులను, మహనీయులను ఒక వ్యూహం ప్రకారం పాఠ్యపుస్తకాల నుంచే కాక, దేశ ప్రజల మస్తిష్కాల నుంచి కూడా చెరిపివేసే ప్రక్రియ సాగుతూ ఉన్నది. గాంధీ, నెహ్రూల... త్యాగాలనూ, దార్శనికతనూ, నాయకత్వాలను ప్రశ్నించే వాతావరణం అలముకున్నది. అదే సమయంలో స్వాత్యంత్య్ర పోరాటం సహా దేశ దశ దిశను మార్చిన ఏ పోరాటంలోనూ పాత్రలేని వ్యక్తుల ప్రాభవం పెంచే పని జరుగుతున్నది. ఏక స్వామ్యం, ఏక భాష, ఏకరూపం అంటూ ఈ దేశ బహుళత్వాన్ని విలువ లేనిదిగా నిలబెడు తున్నారు. దీనికి కారణం ఏమంటే పాలక బీజేపీ పార్టీ కానీ, వారి సైద్ధాంతిక పాఠశాల ఆర్‌ఎస్‌ఎస్ కానీ దశా బ్దాల ఈ దేశ సాంస్కృతిక భిన్నత్వాన్ని ఆమోదించ లేకపోవడమే. స్వాతంత్య్రానంతరం దేశంలోని వివిధ ప్రభుత్వాలు తమ దార్శనికతతో దేశనిర్మాణం గావిం చాయి. ఐఐటీలు, íసీసీఎంబీ, శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థలు, న్యాయ యూనివర్సిటీలు ఒకవైపు; బహుళార్ధ సాధక ప్రాజెక్టులు మరోవైపు, ఈ దేశ శ్రామికుల సంక్షేమం కోసం పథకాలు తెచ్చినాయి. తత్ఫలితంగా భారత్ ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్ని అయినా తట్టుకుని నిలబడ గలిగేంత పటిష్టంగా తయారయింది.
స్వాతంత్య్రం వచ్చిన మరు సంవత్సరమే మత రాజ్యంగా ప్రకటించుకున్న పాకిస్తాన్‌లాగా కాకుండా లౌకిక రాజ్యంగా మనం నిలబడగలిగామంటే దానికి కారణం తొలితరం నాయకుల విశాల దృష్టి మాత్రమే. ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశాన్ని చూసినా వారి అభివృద్ధికి కారణం వ్యవస్థల స్వతంత్రత, పటిష్టత అన్నది అర్థమవుతుంది. మన దేశంలో అన్ని వ్యవస్థలను రాజ కీయం కబ్జా చేయడంవల్ల ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోతమేమోనన్న భయం కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీ సీబీఐని దుర్వినియోగం చేసింది, తనకు నచ్చని ప్రభుత్వాల కూల్చివేతకు గవర్నర్ల వ్యవస్థను ఉపయోగించుకుందన్నది మన ఎరుకలోనిదే. అయితే, ప్రస్తుత బీజేపీ తన విపరీత రాజకీయ కక్ష సాధింపుతో కాంగ్రెస్‌ను తనకంటే మంచి పార్టీగా నిలుపుతున్నది. కేవలం సీబీఐ, గవర్నర్ వ్యవస్థను మాత్రమే కాక ఎన్నికల సంఘం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, విజిలెన్స్ కార్పొ రేషన్, మీడియా, చివరకు కోర్టులను కూడా ప్రభావితం చేస్తున్నది. ఇది ఆందోళన కలిగించే పరిణామం. పబ్లిక్ పాలసీ సంస్థలను కూడా వదిలిపెట్టడం లేదు కేంద్రం. ‘సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ’ సంస్థపై దాడులు ఇందుకు మంచి ఉదాహరణ.
పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోకుండా కీలక మైన నిర్ణయాలను ఆర్డినెన్స్ రూపంలో తీసుకోవడం, ఇచ్ఛ వచ్చిన రీతిలో విధానాల రూపకల్పన ఫాసిస్టు రాజ్యం చేసే పని. ఈ ధోరణికి కారణం ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకపోవడం మాత్రమే కాదు, వారి విశ్వాసాలు కూడా. సాధారణంగా అవినీతి అంటే అక్రమార్జన అనే అర్థంలోనే మనం చూస్తాం. కానీ అవినీతి అంటే నీతి లేకపోవడం, ఎలాంటి విలువలూ లేకపోవడం, హృదయ వైశాల్యం లేక పోవడం. అక్రమార్జన లెక్కలకు అందేది. అనైతికత కనప డనిది. దాని ఫలితాలు ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసినపుడు మాత్రమే, అది కూడా, లోతైన దృష్టి ఉంటే తప్ప తెలియవు.
జాగరూకులైన ఆలోచనాపరులు మాత్రమే ఇపుడు ప్రజాస్వామ్యాన్నీ, అంతిమంగా దేశాన్నీ నిలబెట్టగలరు. భిన్నత్వాన్ని ఆస్వాదిస్తూనే ఏకంగా ఉండగలదు భారత్. ఆ పని మన చేతుల్లోనే ఉంది. ఇపుడు మేధావులు, బుద్ధి జీవులు, ప్రగతిశీల శక్తులు సహా రాజకీయ నాయకులు కూడా మేల్కొని ఒక కొత్త బంగారు లోకాన్ని సృష్టించాలి.
– శ్రీశైల్ రెడ్డి పంజుగుల, టీఆర్‌ఎస్ నాయకుడు
– డా‘‘ పి. సతీష్ చంద్ర, ఎమ్‌ఎస్, ఎఫ్‌ఆర్సీఎస్(యూకే)
Comments
Please login to add a commentAdd a comment