ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎలా సాధ్యం? | Amit Shah Comments on Early Election in Telangana: Vanam Jwala Narasimha Rao Opinion | Sakshi
Sakshi News home page

ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎలా సాధ్యం?

May 20 2022 1:12 PM | Updated on May 20 2022 4:24 PM

Amit Shah Comments on Early Election in Telangana: Vanam Jwala Narasimha Rao Opinion - Sakshi

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని అమిత్‌ షా అంటున్నారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని అమిత్‌ షా అంటున్నారు. హైదరాబాద్‌ సమీపంలోని తుక్కు గూడలో ఇటీవల జరిగిన బీజేపీ  బహిరంగ సభలో తన స్వప్నం సాకారమవుతుందన్న రీతిలో కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా, సీఎం కేసీఆర్‌ను ‘రేపే’ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించాలని సవాలు చేశారు. 

రాష్ట్రానికి సంబంధించినంతవరకూ ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ జాతీయ నాయకుడు డిమాండ్‌ చేసిన వెంటనే ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉండదని ఆయనకు తెలియదా? రాష్ట్ర శాసనసభలో మెజారిటీ ఉన్నప్పుడు ఎప్పుడు ఎన్నికలకు పోవాలా వద్దా అన్న విషయం, ముందస్తుగా శాసనసభను రద్దు చేయాలా వద్దా అన్న విషయం, శాసనసభాపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి ఇష్టానిష్టాల మీద ఆధారపడి ఉంటుందనేది జగమెరిగిన సత్యం. తెలంగాణలో అధికార పార్టీ పూర్తి మెజారిటీని కలిగి ఉన్నప్పుడు అలా ముందస్తుకు ఎందుకు మొగ్గు చూపుతారు? చూపాల్సిన అవసరం ఉన్నదా? అసెంబ్లీ రద్దయిన మరుసటి రోజే ఎన్నికల నిర్వహణ అసాధ్యం కదా? ఎందుకంటే ఎన్నికల నిర్వహణకు ఒక సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. కాబట్టి, అసెంబ్లీ రద్దయిన మర్నాడే ఎన్నికలు నిర్వహించడమనేది కల్ల. ఇది గారడీ మాటగా భావించాల్సి ఉంటుంది. 

అమిత్‌ షా ఎప్పుడు తెలంగాణలో పర్యటించినా విచిత్రంగా మాట్లాడుతుంటారు. 2018లో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు అదెంతో ఖర్చుతో కూడుకున్న పని అంటూ విమర్శించిన ఇదే అమిత్‌ షా ఇప్పుడు ఆయనంతట ఆయనే రేపే ఎన్నికలు నిర్వహించాలని కోరడం వింతగా ఉంది. 2014, 2018లో నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ దక్కించుకున్న స్థానాలు అతి స్వల్పం. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఆయన వ్యాఖ్య ఎంతవరకు సమంజసమో ఆ దేవుడికే తెలియాలి. 

గతంలో కేసీఆర్‌ ఎందుకు ముందస్తుగా ఎన్నికలకు పోయారన్న ప్రశ్న తలెత్తవచ్చు. రాజ్యాంగ సభలను రద్దు చేసే అంశంలో రాజ్యాంగం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. అప్పటి రాజకీయ పరిస్థితులకు చెక్‌ పెట్టడానికీ, ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడానికీ ఆయన ముందస్తు ఎన్నికల నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్‌ గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ముమ్మాటికీ సహేతుకం, రాజ్యాంగబద్ధం, చట్టబద్ధం, న్యాయం. ఆ సందర్భంలో కేసీఆర్‌ నిర్ణయాన్ని షా తప్పు పట్టారు. అసెంబ్లీని రద్దుచేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించిన మొట్టమొదటి సీఎం కేసీఆర్‌ మాత్రమేననీ, ఈ ఎన్నికల వల్ల ఎంతో ప్రజాధనం ఖర్చు వుతుందనీ విమర్శించారు. అప్పటి ఆయన మాటలు వింటే దేశంలో ఎప్పుడూ ముందస్తు ఎన్నికలు జరగనట్లే ఉంది. నడుస్తున్న చరిత్రను అమిత్‌ షా లాంటి స్థాయి వ్యక్తి విస్మరించి ఎలా మాట్లాడగలరు? 

రాష్ట్రం ఎన్నికలకు ఎప్పుడు వెళ్ళాలో నిర్ణయించాల్సింది అమిత్‌ షా కాదు. ప్రత్యేకించి అధికారంలో ఉన్న పార్టీ పూర్తి మెజారిటీని అనుభవిస్తున్నప్పుడు ఇలా డిమాండ్‌ చేయడం అస్సలు సరికాదు. రేపే ఎన్నికలు పెడితే అధికారంలోకి వచ్చే పార్టీ మరో ఏడాదిన్నర ఆగవచ్చు కదా! ఆయనకు అంత ఉబలాటంగా ఉంటే వెంటనే ప్రధానిని కలిసి, బీజేపీ పూర్తి మెజారిటీని అనుభవిస్తున్న లోక్‌సభను రద్దు చేసి, ఎన్నికలు నిర్వహించాలని కోరాలి. గడువు పూర్తయిన తరవాత లేదా గడువుకు ముందే అసెంబ్లీ లేదా పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలు జరపాలని రాష్ట్ర గవర్నర్‌ లేదా రాష్ట్రపతిని కోరడం కొత్త అంశమేమీ కాదు. ఐదేళ్ళ పాటు పార్లమెంటు, అసెంబ్లీలు కొనసాగడానికి అనుమతిస్తున్న రాజ్యాంగం ఆర్టికల్‌ 85, 174 ద్వారా రాష్ట్రపతి లేదా గవర్నర్‌లకు ప్రభుత్వాధినేతల సిఫార్సులపై వాటిని ముందస్తుగా రద్దుచేసే అధికారాన్నీ కట్టబెట్టింది. అది కేవలం ప్రభుత్వాధినేతల హక్కు మాత్రమే. అలాంటప్పుడు, కేసీఆర్‌ను ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని అమిత్‌ షా ఎలా బలవంతం చేయగలరు? దేశంలోని ప్రతిపక్షాలన్నీ పార్లమెంటును ముందే రద్దుచేసి, ఎన్నికలు నిర్వహిం చాలని కోరితే అమిత్‌ షాకు మింగుడుపడుతుందా?

2018 ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కేసీఆర్‌ నెరవేర్చలేదంటూ అమిత్‌ షా ఆరోపించారు. వారసత్వ రాజకీయాలను కేసీఆర్‌ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. 57 ఏళ్ల జీవితంలో ఇంత అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని కూడా అన్నారు. అరగంట సేపు సాగిన షా ప్రసంగంలోని విమర్శలు గతంలో మాదిరిగానే ఫక్తు అబద్ధాలు. 2014 టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళికలో లేని పథకాలను, ఇవ్వని హామీలను కూడా ప్రభుత్వం అమలు చేసింది. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 200 శాతం ఎన్నికల హామీలను నెరవేర్చినట్ల య్యింది. తాను చేసిన వ్యాఖ్యలకు అమిత్‌ షా భేషజాన్ని విడిచి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. (చదవండి: అబార్షన్లపై అమెరికాలో మళ్లీ రచ్చ)

అమిత్‌ షా వ్యాఖ్యలను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. అమిత్‌ షాను అబద్ధాల బాద్షాగా అభివర్ణించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డు కోవడానికి షా ఈ రకంగా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వినూత్న, సృజనాత్మక కార్యక్రమాలకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల, కేంద్ర మంత్రులతో పాటు ప్రధానమంత్రి, నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుని నుంచి ప్రశంసలు అందుకున్న విషయాన్ని అమిత్‌ షా గుర్తుచేసుకోవాలి. యూఎన్‌డీపీ, నీతి ఆయోగ్‌ సంస్థలు మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులను ప్రశం సించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్‌ను గురించిన చర్చ జరుగుతున్నది కదా! తెలంగాణ ప్రభుత్వం కేవలం రాష్ట్రాలతో, కేంద్రంతోనే కాదు... ప్రపంచంలోని ఇతర దేశాలతో కూడా పోటీపడుతోంది!


- వనం జ్వాలా నరసింహారావు 
 తెలంగాణ ముఖ్యమంత్రి సీపీఆర్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement