సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చేందుకు సోనియాగాంధీ పట్టుబట్టి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని.. కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కారు అన్ని వర్గాల ప్రజలను విస్మరించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ గత తొమ్మిదేళ్లలో అవినీతి, నియంతృత్వ పాలనతో ప్రజలను కష్టాలకు గురి చేశారని.. ప్రజలు ఈ తొమ్మిదేళ్లు పడిన కష్టాలను తాము అధికారంలోకి వచ్చి తొలగిస్తామని పేర్కొన్నారు. ఇకపై కేసీఆర్ ఆటలు సాగనివ్వబోమని.. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో ముందుకు వచ్చిందని చెప్పారు.
నాడు కరీంనగర్ గడ్డ వేదికగా సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని గ్యారంటీ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తామంటూ మరోసారి తెలంగాణ గడ్డపై సోనియా కాలుపెట్టారని.. ఈ మాట కూడా నిలబెట్టుకుంటారని రేవంత్ చెప్పారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి కేసీఆర్ ప్రభుత్వంలో వణుకు మొదలైందన్నారు. విజయభేరి సభ పెట్టుకుంటామని తాము అనుమతి కోరితే కేసీఆర్ ప్రభుత్వం ఎన్నోరకాల అడ్డంకులు సృష్టించిందని మండిపడ్డారు. మొదట్లో పరేడ్‌గ్రౌండ్స్‌లో సభ పెట్టుకుంటామంటే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి కుట్ర చేసి అక్కడ అనుమతులు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
తర్వాత గచ్చిబౌలి స్టేడియంలో సభ కోసం అనుమతి కోరితే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందని.. మహేశ్వరం సమీపంలో సభ జరుపుకొంటామంటే దేవుడి మాన్యం భూముల్లో కుదరదంటూ తిరస్కరించారని చెప్పారు. చివరికి తుక్కుగూడలో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్థలం ఇవ్వడంతో సభ నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ పాలనపై విశ్వాసం కోల్పోయారని.. అందుకే కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తాన్నరని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment