సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల సమర భేరి మోగించేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సన్నద్ధమైంది. ఈ నెల 27న ఖమ్మంలో పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా ఆదివారం ఖమ్మం జిల్లాలో పాల్గొనే బహిరంగ సభకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. సీఎం కేసీఆర్ చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇవ్వడంతోపాటు.. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని తెలుస్తోంది.
ఇదీ అమిత్ షా పర్యటనలో మార్పులు
కేంద్రమంత్రి అమిత్‌షా తెలంగాణలో పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. కొనఇన అనివార్య కారణాల వల్ల రేపు భద్రాచలం కార్యక్రమం రద్దు అయ్యింది. దీంతో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఆదివారం మధ్యాహ్నం గన్నవరంలో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా ఖమ్మంకు కేంద్రమంత్రి రానున్నారు. 3.45 నిమిషాలకు సభ వేదిక వద్దకు చేరుకోనున్నారు.
కాగా ముందస్తు షెడ్యూల్ ప్రకారం..రేపు మధ్యాహ్నం హెలికాప్టర్‌లో భద్రాచలం చేరుకోవాల్సి ఉండేది. అక్కడ ఆలయంలో సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత హెలికాప్టర్‌లో ఖమ్మంకు చేరుకుని బహిరంగసభలో పాల్గొనేవారు.
బహిరంగ సభ పూర్తి అయిన అనంతరం 4. 40 గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన పార్టీ కోర్ కమిటీ మీటింగ్‌లో పాల్గొననున్నారు. 5. 30 గంటల వరకు కోర్ కమిటీ మీటింగ్ కొనసాగునుంది. 5. 40 గంటలకు ఖమ్మం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరి వెళ్లనున్నారు. 6.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు.కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో కేంద్ర మంత్రి హోదాలో పార్టీ అగ్రనాయకత్వం ఖమ్మం సభకు రావడం ఇదే తొలిసారి.
అమిత్ షా సభకు భారీ ఏర్పాట్లు..
అమిత్ షా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి లక్ష మందిని తరలించేలా బీజేపీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. రైతులకు భరోసా ఇచ్చేలా అమిత్ షా సభ ఉంటుందని నేతలు చెబుతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల కోసం అమలు చేయనున్న పథకాలను అమిత్ షా ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఇతర పార్టీల నుంచి నేతల చేరికలు కూడా అమిత్ షా సభలో ఉండే అవకాశం ఉంది.
చదవండి: నన్ను ఇబ్బందిపెడితే ఊరుకోను.. మైనంపల్లి షాకింగ్ కామెంట్స్
గత నెలలోనే జరగాల్సి ఉన్నా..
వాస్తవానికి అమిత్‌షా గతనెలలోనే రాష్ట్రంలో పర్యటించాల్సింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రద్దు అయింది. పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో అమిత్‌షా సభ నిర్వహించేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 27న ఖమ్మంలో ఆ సభ నిర్వహించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా అమిత్‌షా ప్రసంగం ఎలా ఉండబోతున్నదన్న దానిపై రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. మరీ ముఖ్యంగా బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనని, ఈ రెండింటి మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందంటూ సాగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా కేసీఆర్ ప్రభుత్వంపై పదునైన విమర్శలు సంధిస్తారని చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌పై సాగించబోయే పోరాటం గురించి కొంతకాలంగా పార్టీలో ఏర్పడిన స్తబ్దతను బద్దలుకొట్టడంతోపాటు.. అధికార బీఆర్‌ఎస్ విషయంలో బీజేపీ అనుసరించబోయే కఠిన వైఖరి గురించి, స్పష్టతనిస్తారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment