సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల కదనరంగానికి కమలదళం సమాయత్తమైంది. ఒకవైపు పార్టీ సంస్థాగత పటిష్టత, పార్టీ గెలుపుకోసం అంకితభావంతో పనిచేసే నేతల ఎంపిక, వివిధ స్థాయిల్లో పార్టీ కమిటీల నియామకం.. మరోవైపు కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు, ప్రజాసమస్యలపై ఉద్యమ కార్యాచరణ.. ఇంకోవైపు నెలాఖరులో విజయ సంకల్ప యాత్రల పేరిట రథయాత్రల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర బీజేపీలో గత సంప్రదాయానికి భిన్నంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే 30–35 మంది అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధం చేస్తోంది.
గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల్లో నియోజకవర్గాల వారీగా పార్టీకి ఉన్న బలాబలాలను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించి.. బలహీనంగా ఉన్న సీ, డీ స్థానాల్లో ముందుగా అభ్యర్థులను ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. తద్వారా క్షేత్రస్థాయి నుంచి పట్టుపెంచుకోవడానికి, గెలిచే అవకాశాలు ఎక్కువగా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు అవకాశం ఏర్పడిందని పార్టీనేతలు చెప్తున్నారు. అదే తరహా వ్యూహాన్ని ఇక్కడా అమలు చేసే యోచన ఉన్నట్టు వివరిస్తున్నారు.
నేడు రాష్ట్రానికి 119 మంది బీజేపీ ఎమ్మెల్యేలు
తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీకున్న 1,200 మంది ఎమ్మెల్యేల్లో 560 మందిని ఎంపికచేశారు. వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన 119 మంది వారంపాటు తెలంగాణలో ఒక్కో నియోజకవర్గంలో ఒకరు చొప్పున పర్యటించి పార్టీ బలాబలాలు, స్థానిక పరిస్థితులను పరిశీలించి జాతీయ పార్టీకి నివేదిక ఇస్తారు.
వారి పర్యటన ముగియగానే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి పోరు యాత్రలను చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. అలంపూర్ జోగులాంబ ఆలయం, భద్రాచలంలోని సీతారామ ఆలయం, బాసరలోని సరస్వతి ఆలయం నుంచి వీటిని ప్రారంభించే అవకాశముంది. ఓవైపు ఈ యాత్రలను కొనసాగిస్తూనే.. పార్టీపరంగా ఎన్నికల వ్యూహాలను, కార్యాచరణను సిద్ధం చేయడం, అమలు కోసం మేనిఫెస్టో, ప్రచార, ఇతర కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.
కీలకంగా అమిత్‌షా పర్యటన
ఈ నెల 27న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఖమ్మం పర్యటనను పార్టీ నాయకత్వం సవాల్‌గా తీసుకుంది. ఈ పర్యటన సందర్భంగా కోర్‌కమిటీ, ముఖ్య నేతలతో అమిత్‌షా భేటీ అయి ఎన్నికల వ్యూహాలు, కార్యాచరణకు తుదిరూపు ఇస్తారని.. రాష్ట్ర పార్టీకి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అమిత్‌షా రాష్ట్ర పర్యటన తర్వాత పార్టీపరంగా కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయని అంటున్నాయి.
23 నుంచి మళ్లీ ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా ప్రజా సమస్యలపై ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టిన బీజేపీ.. తిరిగి ఈ నెల 23, 24, 25 తేదీల్లో తదుపరి దశ పోరాటాలను కొనసాగించాలని నిర్ణయించింది. ఎక్కడికక్కడ ప్రజా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకులు వినతిపత్రాలు సమర్పించనున్నారు.
తర్వాత జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఈ ఉద్యమాన్ని చేపడతారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. తొలిదశలో ఆందోళనలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన ఫలితాలపై చర్చించారు. 20న మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణను ఖరారు చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment