పటిష్ఠ సహకార సమాఖ్యను రూపొందించే అసలు సిసలైన జాతీయ ప్రత్యామ్నాయ ప్రణాళి కను రూపొందించేందుకు తెలం గాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నడుం బిగిం చారు. అందులో భాగంగానే ప్రాంతీయ రాజకీయ పార్టీల ఏకీకరణకు అడుగు ముందుకు వేశారు. రాష్ట్రాల అధికారాలను పునర్నిర్వచించాలనీ, అన్ని రంగాల్లో సంస్కరణలు అమలు చేయాలనీ కూడా కేసీఆర్ పిలుపునిచ్చారు. ఫెడరల్ వ్యవస్థ మీద కేంద్ర ప్రభుత్వాల వ్యూహాత్మక దాడిని పలు సందర్భాలలో ఆయన దుయ్యబట్టారు.
స్పష్టమైన జాతీయ ప్రత్యామ్నాయ అజెండాను రూపొందించడంలో కేసీఆర్ నిమగ్నమైనట్లు ఆయన పర్యటనలు రుజువు చేస్తున్నాయి. ఇటీవలి ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల పర్యటనలోనూ, ఢిల్లీలో ఉన్న సందర్భంలో ఆయన కలిసిన కొందరు ప్రముఖులతో జరిపిన చర్చ ల్లోనూ ఇది సూచనప్రాయంగా వెల్లడైంది. జాతీయ రాజకీయాల్లో త్వరలోనే సంచలనం చోటుచేసు కోనున్నదని కేసీఆర్ స్పష్టంగా చెబుతున్నారు. కొత్త విధానాలను అమలు చేసేటప్పుడు రాష్ట్రాలను కేంద్రం సంప్రదించాల్సిన అవసరాన్ని కేసీఆర్ నొక్కి చెప్పారు.
పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించే వెసులు బాటును రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి కల్పించింది. అంతమాత్రాన ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలగాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కారణాలు ఏమైనప్పటికీ కేంద్రం ఉదాత్తమైన సహకార సమాఖ్య వైపు కాకుండా... ఏకపక్ష విధానాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్య మంత్రిగా ఉండగా భారతదేశానికి కావలసింది నిర్బంధ సమాఖ్య కాదు, సహకార సమాఖ్య అనేది తన నినా దంగా మలుచుకున్నారు. ప్రధాన మంత్రి అయిన తరవాత తన వైఖరిని మార్చుకున్నారు.
బ్రిటిష్ ప్రభుత్వం సైతం ఈస్ట్ ఇండియా వ్యవహా రాలను నియంత్రించేదే తప్ప, దాని అధికారాల్లో ఎన్నడూ జోక్యం చేసుకోలేదు. ‘భారత ప్రభుత్వ చట్టం–1919’ కూడా ద్వంద్వ ప్రభుత్వాలకే మొగ్గు చూపింది. సహకార సమాఖ్య అనే లక్ష్యంతోనే స్వాతంత్య్రానంతరం అప్పటి ప్రభుత్వం భారత యూనియన్‌ను ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన కీలకమైన వ్యవహారాలలో కేంద్ర ప్రభుత్వం విపరీతంగా జోక్యం చేసుకుంటూనే ఉంది. కేంద్రం కేవలం విదేశీ వ్యవహారాలు, రక్షణ, జాతీయ రహదారుల నిర్వహణ వంటి అంశాలకే పరిమితం కావాలి.
విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధి, స్థానిక సంస్థలు, తదితర అంశాల బాధ్యతలను రాష్ట్రా లకే విడిచిపెట్టాలి. స్థానిక సంస్థలకు నిధులను నేరుగా బదిలీ చేస్తూ, రాష్ట్రాలను నమ్మకుండా వ్యవహరిస్తూ వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వాలు. ఇది సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన చర్య అంటూ కేసీఆర్ విమర్శిం చారు. ‘జవహర్ రోజ్‌గార్ యోజన’, ‘పీఎం గ్రామ్ సడక్ యోజన’, ‘ఎన్‌ఆర్‌ఈజీఏ’ (ఉపాధి హామీ) వంటి పథకాలకు ఢిల్లీ నుంచి నేరుగా స్థానిక సంస్థలకు నిధు లను బదలాయించడం రాష్ట్ర ప్రభుత్వాలను పక్కన పెట్టడమే అని అన్నారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ తాను ఒక ప్రత్యామ్నాయ జాతీయ ప్రణాళికతో ప్రజల ముందుకొస్తానని ప్రకటించారు. దేశవ్యాప్తంగా భావ సారూప్యం కలిగిన రాజకీయ శక్తులను ఏకం చేయ డానికీ, దేశాన్ని అభివృద్ధి బాట పట్టించడానికీ వీలుగా ఈ అజెండా ఉంటుందనేది ఆయన ప్రకటన సారాంశం. రాజకీయ పార్టీలు, ఆర్థికవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, రైతులు... ఇలా అన్ని రంగాల వారి సహకారమూ ఈ అజెండా రూపకల్పనలో తీసుకుంటారు. స్థానిక అవస రాలు, రిజర్వేషన్లు వంటి రంగాలలో విధానపరమైన నిర్ణయాలు రాష్ట్రాల పరిధిలోనే ఉండేలా అజెండా ఉంటుందనేది నిస్సందేహం.
కేంద్రం నుంచి ఎక్కువ అధికారాలు రాష్ట్రాలకు బదిలీ కావాలనేది కేసీఆర్ నిశ్చిత అభిప్రాయం. ఈ మేరకు రాజ్యాంగంలో మార్పులు చేయాలి. తెలం గాణలో అమలవుతున్న ‘రైతు బంధును’ జాతీయ స్థాయిలో చేపట్టి 40 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చవచ్చు. ‘రైతు బీమా’, ‘దళిత బంధు’ను కూడా దేశవ్యాప్తంగా అమలుచేయవచ్చు. నల్లధనాన్ని వెలికి తేవడానికి మార్గాలను అన్వేషించాలి. పన్నుల విధా నంలో మరిన్ని ప్రోత్సాహకాలుండాలి. ప్రకటిత ఆదా యాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు లేదా మౌలిక వసతుల రంగాలలో పెట్టుబడి పెట్టేలా ఒక సులభసాధ్యమైన వ్యవస్థ ఉండాలి. దీనివల్ల ప్రభుత్వ రంగాలకు పెట్టు బడులు వెల్లువలా వచ్చే అవకాశం ఉంటుంది. ‘అంతా బాగుంది’ అనే విధానమే దేశాన్ని సమస్యల కూపంలోకి నెట్టేస్తోందనే వాస్తవాన్ని గుర్తించాలి.
సమర్థుడైన పరిపాలకునిగా కేసీఆర్ ప్రతిభను కనబరిచారు. ఆయన ప్రస్తుతం సూచిస్తున్న ‘ప్రత్యా మ్నాయ ప్రణాళిక’ దేశంలో సహకార సమాఖ్యను బలోపేతం చేస్తుందనడంలో సందేహం లేదు. భావ సారూప్యం కలిగిన రాజకీయ పార్టీలు కేసీఆర్ ఆలో చనలను సమర్థించాల్సిన సమయమిదే.
ఈ నేపథ్యంలో బహుశా దేశవ్యాప్తంగా పెరుగు తున్న ఒత్తిడి కారణంగా దేశంలో సహకార సమాఖ్యను బలోపేతం చేసేందుకు ‘అంతర్రాష్ట్ర మండలి’ని పునర్వ్య వస్థీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం గమ నార్హం. ప్రధాని చైర్మన్‌గా వ్యవహరించే ఈ మండలిలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఆరుగురు కేంద్ర మంత్రులు సభ్యులుగానూ, మరో పదిమంది శాశ్వత ఆహ్వానితులుగానూ ఉంటారని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఇదెలా పనిచేస్తుందో కాలమే నిర్ణయిస్తుంది!
వ్యాసకర్త:
వనం జ్వాలా నరసింహారావు, తెలంగాణ ముఖ్యమంత్రి సీపీఆర్‌ఓ, మొబైల్: 80081 37012
Comments
Please login to add a commentAdd a comment