ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ సారథ్యంలో అప్రతిహతంగా పురోగమిస్తున్న భారత్ కీర్తి బావుటా విశ్వ వినీలాకాశంలో ఇప్పుడు మరింత పైఎత్తున ఎగురుతోంది. మొట్ట మొదటి సారిగా జీ–20 అధ్యక్ష హోదా చేపట్టి విశ్వవేదికపై తన సత్తాను భారత్ మరో మారు చాటి చెప్పింది. ఐరోపా యూనియన్ సహా 19 దేశాలు సభ్యులుగా ఉన్న గొప్ప వేదిక ఇది. ప్రపంచ జీడీపీలో 90 శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 80 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు జీ–20 దేశాలవే. ప్రపంచ ఆర్థిక వ్యవహారాల్లో జీ–20 పాత్ర ఏమిటో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
ఇతర దేశాల తలరాతను శాసిస్తూ లాభార్జనే ధ్యేయమైన రెండు ఆర్థిక నమూనాలు ఇప్పుడు ప్రపంచంలో కొనసాగుతున్నాయి. ఆధిపత్యం చలాయిస్తూనే తమ ఉత్పత్తులతో విదేశా లను ముంచెత్తే పాశ్చాత్య నమూనా ఒక వైపు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాలకు అప్పుల వలవేసి దివాలా తీయించే చైనా నయా వలసవాద నమూనా మరొక వైపు ఉన్నాయి. దీనికి పూర్తి భిన్నంగా విశ్వ మానవ సౌభ్రాతృత్వ స్ఫూర్తితో భారత్ ముందుకు సాగుతోంది. కోవిడ్ కష్ట కాలంలో ప్రపంచాన్ని భారత్ ఆదుకున్న తీరే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇటువంటి భారత్ జీ–20కి నాయకత్వ స్థానంలో ఉండి చేయగలిగింది ఎంతో ఉంది.
డిసెంబర్ ఒకటో తేదీన జీ–20 అధ్యక్ష హోదా స్వీకరించిన భారత్, వచ్చే 12 నెలల కాలంలో దేశవ్యాప్తంగా 200 పైగా సమావేశాలు నిర్వ హించాలని నిశ్చయించింది. అందుకోసం రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు డిసెంబర్ 5న ఒక సన్నాహక సమావేశానికి కేంద్రం ఆహ్వానం పలికింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్ సహా దాదాపు అన్ని పార్టీల అధ్యక్షులు హాజరైన ఆ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం డుమ్మా కొట్టారు. దేశాన్ని ఉద్ధరిస్తానని ‘భారాసా’గా పేరు మార్చుకున్న తెరాస అధ్యక్షుడు యావత్ దేశానికి గర్వకారణమైన ఒక కీలక సమావేశాన్ని బహిష్కరించి దేశం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు.
జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాల విషయంలో ఆ పార్టీ నిబద్ధత ఏ పాటిదో ఆదిలోనే అర్థమయ్యింది. దేశ హితం కన్నా కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనానికే పెద్దపీట వేయడం ఇందుకు కారణం. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జీ–20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి వ్యూహాలపై చర్చలు జరిపేందుకు, సూచనలు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరుకాని కేసీఆర్, అందుకు కారణాలేమిటో చెప్పగలరా? సొంత లాభాపేక్షే తప్ప తెలంగాణ ప్రజానీకం బాగోగుల గురించి ఆయనకు ఏమాత్రం పట్టింపులేదని దీనివల్ల స్పష్టంగా తెలియడం లేదా? కేంద్ర ప్రభుత్వం ఆయనను ఆహ్వానించినప్పటికీ, సమావేశానికి కావాలనే హాజరు కాకపోవడం... జాతీయ రాజకీయాల్లో కీలక, క్రియాశీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్‌కు ఎంత మాత్రం తగని పని. జాతీయ రాజకీయాల్లో రాణించడానికి కావలసిన కలుపుగోలుతనం ఇదేనా? చారిత్రక అవకాశాలను ఇలా చేజేతులా వదిలేసుకోవడం కేసీఆర్‌కు అలవాటైన పనే.
జీ–20 సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వాల ముందు అనేక అవకాశాల తలుపులు తెరవబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి తమ రాష్ట్రాల్లో తాజా పెట్టుబడులకు బాటలు వేయడానికి మంచి అవకాశం లభిస్తోంది. తెలంగాణకు చెందిన అనేకమంది సౌదీ అరేబియాలో ప్రవాసం ఉంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లో దౌత్య కార్యాలయం ఏర్పాటు చేయాల్సిందిగా సౌదీ అరేబియాను తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించింది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి సౌదీ అరేబియా రాజకీయ నాయకత్వంతో చర్చలు జరిపి సానుకూల ఫలితం రాట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ వేదికను ఉపయోగించుకునే అవకాశం ఉంది. జీ –20 అధ్యక్ష హోదా భారత్‌కు దక్కడంతో ఎంతో స్ఫూర్తి పొందిన సిరిసిల్ల పట్టణానికి చెందిన హరిప్రసాద్, స్వయంగా జీ–20 లోగో నేసి ప్రధానమంత్రికి పంపించారు. హరిప్రసాద్ వంటి వారి నుంచి స్ఫూర్తి పొంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ హితం కోసం కాకపోయినా.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానైనా కేంద్రంతో కలిసి ముందడుగు వేస్తారా? (క్లిక్ చేయండి: సందేహాలు తీరకుండా చర్యలెలా?)
- కిశోర్ పోరెడ్డి
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment