ప్రాజెక్టులకు ఇక రాచబాట | Vanam jwala narasimha rao on new land pooling act | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులకు ఇక రాచబాట

Published Thu, May 18 2017 3:53 AM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM

ప్రాజెక్టులకు ఇక రాచబాట

ప్రాజెక్టులకు ఇక రాచబాట

విశ్లేషణ
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ భూసేకరణ, పునరావాసం, పునఃపరిష్కారంలో న్యాయ పరిహారం, పారదర్శకమైన హక్కు బిల్లుకు శాసనసభ పునః పరిశీలన తరువాత రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బుధవారమే గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా జారీచేసింది. చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకోగా, రెవెన్యూ ఉన్నతాధికా  రులు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ కీలక పాత్ర పోషించారు. కొత్త చట్టం రావడంతో, రాష్ట్రంలో భూసేకరణకు ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయి, వివిధ రకాలైన ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతమౌతాయి. ఈ నేపథ్యంలో భూసేకరణ చట్టం పూర్వాపరాలు ఒక్కసారి అవలోకనం చేసుకుంటే బాగుంటుందేమో.

భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 298 ప్రకారం భూసేకరణ ద్వారా భూమిని కొనుగోలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది. జీవో నంబర్లు 123, 190, 191 ద్వారా తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. కాకపోతే కొన్ని రాజ కీయ పక్షాలు ఈ జీవోల విషయంలో, వాటి అమలు విషయంలో కొన్ని సందేహాలు లేవనెత్తాయి. అవి ప్రజల్లో అపోహకు తావు ఇచ్చాయి. వాటిని నివృత్తి చేయడానికీ, భూసేకరణ విధానానికి ఒక చట్ట రూపాన్ని తేవడానికీ డిసెంబర్‌ 28, 2016న భూసేకరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 2013 చట్టానికి మూడు పర్యాయాలు ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి, తరువాత చట్ట రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. మొదటి ఆర్డినెన్స్‌ డిసెంబర్‌ 31, 2014 న, రెండవది ఏప్రిల్‌ 3, 2015 న, మూడవసారి మే 30, 2015న తీసుకొచ్చింది కేంద్రం. కాకపోతే రాజకీయ కారణాల వల్ల ఈ ఆర్డినెన్సులు రాజ్యసభ ఆమోదం పొందలేదు.

ఆ చట్టాలకు సవరణలు కొత్తకాదు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆర్డినెన్సుల ప్రస్తావన తెచ్చి, వారి వారి రాష్ట్రాలలో, రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా సొంత చట్టాలను రూపొందించుకోవాలని ముఖ్యమంత్రులకు సూచించారు. వాస్తవానికి రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగా అలాంటి అధికారం ఉంది. కాకపోతే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాలు తమ సొంత చట్టాలను రూపొందించుకున్నాయి.  ఇదేం కొత్త విషయం కాదు. గతంలో కూడా భూసేకరణ చట్టాలకు అనేక సవరణలు, రాష్ట్రపతి ఆమోదముద్ర మనం తీసుకున్నాం. ఉదాహరణలు చెప్పుకోవాలంటే: నాగార్జున సాగర్‌ భూసేకరణ 1956, భూసేకరణ 1959, వైజాగ్‌ స్టీల్‌ ప్రాజెక్ట్‌ చట్టం 1972, భూసేకరణ చట్టం 1976, భూసేకరణ చట్టం 1983 అలాంటివే.

మనది కొత్త రాష్ట్రం. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు కూడా కొత్తవే. తెలంగాణ ఉద్యమమే ‘నీళ్లు’, ‘నిధులు’, ‘నియామకాలు’ నినాదాల ప్రాతి పదికగా జరిగింది. ఏ నీళ్లకైతే తెలంగాణ ఉద్యమించిందో, ఆ నీళ్లకు నీటిపారుదల ప్రాజెక్టులు కావాలి. వాటికి భూసేకరణ జరగాలి. మరీ వివరంగా చెప్పాలంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి ప«థంలో నడిపించడానికి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి.

శాసనసభలో బిల్లును ప్రవేశ పెట్టిన సందర్భంగా చాలా విషయాలను ప్రభుత్వం స్పష్టంగా విశదీకరించింది. భూమి సొంతదారుడు స్వఛ్చందంగా తన భూమిని భూసేకరణ కోసం ఇవ్వడానికి అంగీకరిస్తాడో, దానిని అమలు చేయడానికి 123, 190, 191 జీవోలున్నాయి. ఎక్కడైతే అలా కాకుండా 2013 చట్టం ప్రకారం కావాలని రైతులు కోరుకుంటారో అది కూడా అమలు చేసే వెసులుబాటు కలిగించింది ప్రభుత్వం. ఇంతకీ 2013 చట్టానికి సవరణ తేవాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. ఏ విధంగా చూసినా కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఆ చట్టం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటల్లో చెప్పాలంటే  ‘తాడూ, బొంగరం లేని వారు కూర్చుని చేశారు’.

వాస్తవాలు తెలియాలి
భూసేకరణ చట్టం వాస్తవికతను ప్రశ్నించేవారికి కొన్ని విషయాలు స్పష్టంగా తెలియడం మంచిది. భూసేకరణ జరగకుండా ప్రాజెక్టుల నిర్మాణం జరగదనేది వాస్తవం. భూసేకరణ చేయబట్టే నాగార్జునసాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు కట్టుకున్నాం. ప్రపంచంలోనే అతి పెద్ద పునరావాసం జరిగిన ప్రాజెక్టుగా రికార్డుల్లోకి ఎక్కిన చైనా వారి ‘త్రీ గార్జెస్‌ డ్యాం’ మూలాన పన్నెండు లక్షల కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. అదెందుకు జరిగిందంటే...ప్రజల ప్రయోజనాల కోసమే. తరతరాలకు ఉపయోగపడే పథకాలతో, మానవాళికి బహుళ ప్రయోజనాలు సమకూర్చే పథకాలతో తప్పకుండా కొందరికి నష్టం, కష్టం జరుగుతుంది. అలా జరుగుతుంది కదా అని ప్రాజెక్టులే వద్దు, భూసేకరణే తగదు అనడం తొందరపాటు.

అసలీ చట్టం తేవాలన్న ఆలోచనకు మూలం మల్లన్న సాగర్‌ లాంటి ప్రాజెక్టుల కోసం జరుగుతున్న భూసేకరణను కొందరు రాజకీయం చేయడమే. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు కోసం 75% మంది రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. మిగిలినవారి విషయానికొచ్చేసరికి రాజకీయాలు మొదలయ్యాయి. ప్రాజెక్టు పూర్తికాకూడదనీ, లిటిగేషన్‌ ఉండాలనీ ఆలోచన మొదలైంది.

గౌరవప్రదమైన పరిహారం
వాస్తవానికి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో, ఏ ప్రాజెక్టుకూ చెల్లించనంత పరిహారం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఉదాహరణకు మల్లన్న సాగర్‌ ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో వున్న తపాస్‌ పల్లి రిజర్వాయర్‌ కింద భూమి కోల్పోయిన రైతులకు ఉమ్మడి రాష్ట్రంలో ముట్టిన పరిహారం ఎకరాకు ఎనభై వేలు! మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు కింద తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పరిహారం ఆరున్నర లక్షలు. అయినా ఆందోళనే! ఎందుకిలా చేయాలి? ప్రాజెక్టులు కట్టినప్పుడు కొన్ని చోట్ల భూములు పూర్తిగా, కొన్ని చోట్ల పాక్షికంగా మునిగిపోతాయి. గ్రామం కూడా పూర్తిగానో, పాక్షికంగానో మునిగిపోవచ్చు. గ్రామమంతా మునగకుండా, కొంత శివారు మిగిలివుంటే, అక్కడే పునరావాస కాలనీ కట్టించే చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంది. అయినా విమర్శలే!

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇందిరా ఆవాస్‌ యోజన కింద ఇంటికి ఇచ్చే పరిహారం లక్ష రూపాయలు. అలాగే వారిచ్చే 200 గజాల జాగా ఖరీదు గ్రామాలలో రూ. 20,000 మించదు. మొత్తం కలిపి రూ. 1,20,000 ఉంటుంది. అలాగే రిజిస్ట్రేషన్‌ విలువ ఎంతవుంటే అంతకు మూడు రెట్లు పెంచి పరిహారం ఇవ్వాలని ఆ చట్టంలో ఉంది.

వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం, మూడు రెట్లకు బదులుగా, పదిరెట్లు పైగా పెంచి ఇచ్చింది. చాలామంది రైతులు అలా లాభపడ్డారు కూడా. సీఎం ఈ విషయాన్ని శాసనసభలో  ప్రకటించారు. రూ. 60,000 రిజిస్ట్రేషన్‌ విలువ ఉంటే రు. 6, 50,000 ఇచ్చింది ప్రభుత్వం. నిజానికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం రూ.1,20,000 ఇచ్చి చేతులు దులుపుకోవచ్చు. దీనికి అదనంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో జరుగుతున్నందున, వారికి నచ్చిన చోట ఆ తరహా ఇళ్లు కట్టుకునే వెçసులుబాటును కూడా కలిగించింది ప్రభుత్వం. నిర్వాసితులకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో ఇంటి కోసం మరో రూ. 5.04 లక్షలిచ్చింది ప్రభుత్వం. ఇవన్నీ 123 జీవో ప్రకారం ఇచ్చినవే!

కేంద్రం సలహా మేరకే చట్టం
123 జీవో అమలుపై కొందరు న్యాయస్థానాలకు వెళ్లారు. హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో స్పష్టంగా ఈ విషయాలన్నీ పేర్కొనడం జరిగింది. భూమిలేని నిర్వాసితులకు వన్‌ టైం పరిహారం కింద 2013 భూసేకరణ చట్టంలో ఉన్నదానికంటే మరో లక్ష రూపాయలు అదనంగా ఇస్తున్నట్లు కూడా అఫిడవిట్‌లో పేర్కొంది ప్రభుత్వం. ఇదంతా ప్రజల మేలుకోరి చేసిందే. ప్రజలకు నష్టం కలిగించే  ఆలోచన ప్రభుత్వానికి లేదనే వాస్తవం బోధపడుతోంది. ఇంత చేసినా రాజకీయాలు చేయడం ఆగలేదు. కొన్ని రాజ కీయ పార్టీల వైఖరిలో మార్పు రాలేదు. ప్రాజెక్టుల నిర్మాణం ఎలా ఆపుచేయాలా అన్న నిరంతర ఆలోచన కొనసాగిస్తున్నారు. అడుగడుగునా అడ్డుపడుతున్నారు. కోర్టులకు పోవడమో, లేదా గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టే తెచ్చుకుని ఆనందించడమో చేశారు. ఇది ప్రతిపక్షాలు చేసే పని కాదు.

చివరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించింది. 2013 భూసేకరణ చట్టం చాలా బాధ్యతారహితంగా చేసిన చట్టం అని కేంద్రం కూడా చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీని కూడా సీఎం చంద్రశేఖరరావు సంప్రదించారు. ఆయన సలహా తీసుకున్నారు. రాజ్యాంగబద్ధంగా రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు లాంటి ఐదారు రాష్ట్రాలు 2013 భూసేకరణ చట్టానికి సవరణ చేసుకున్న విషయం వారిద్దరిమధ్య ప్రస్తావనకొచ్చినట్లు సీఎం శాసనసభలో చెప్పారు. భూసంబంధమైన అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నం దున, ఆ రాష్ట్రాల నమూనాలో, తెలంగాణ కూడా  రాష్ట్రావసరాలకు అనుగుణంగా చట్టానికి సవరణలు చేస్తే రాష్ట్రపతి ఆమోదముద్ర వేయించుకోవచ్చని తేలింది.

అంటే, కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు, సూచన మేరకు, చట్టానికి సవరణ తీసుకురావడం జరిగింది. చట్టానికి సవరణలు రూపొందించే పూర్వరంగంలో, ఏదో ఆషామాషీగా చేయకుండా, సుదీర్ఘ ప్రక్రియ ద్వారా దాన్ని తయారుచేసి సభముందుకు తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంబంధిత శాఖాధికారులు, ఢిల్లీ వెళ్లి, కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖ, ల్యాండ్‌ రికార్డుల శాఖ వారికి చూపించి, వారు అంగీకరించిన తరువాతే, తదనుగుణంగానే కేంద్ర ఆమోదం లభిస్తుందన్న హామీ లభించిన తరువాతే, బిల్లును డ్రాఫ్ట్‌ చేసి శాసనసభ ముందుకు తెచ్చింది ప్రభుత్వం, డిసెంబర్‌ నెలలో.

ప్రాజెక్టులన్నీ పూర్తికావడం తథ్యం
బిల్లు ఉభయ సభల ఆమోదం పొందిన తరువాత కేంద్రం ఆమోదం కోసం పంపించడం, వారి సూచనల మేరకు కొన్ని మార్పులు చేసి మళ్లీ ఏప్రిల్‌ 30, 2017న మరోమారు ఉభయ సభల ఆమోదం పొందడం జరిగింది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం దాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. దానికి రాజముద్ర పడింది. ఇక వందకు వంద శాతం ప్రాజెక్టులు పూర్తికావడం త«థ్యం. తెలంగాణాలో కోటి ఎకరాలకు సాగునీరు అందడం కూడా తథ్యం.

వ్యాసకర్త: వనం జ్వాలా నరసింహారావు
తెలంగాణ సీఎం ప్రధాన పౌర సంబంధాల అధికారి మొబైల్‌ : 80081 37012
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement