అజిత్ జోగి (ఫైల్ ఫోటో)
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ అధ్యక్షుడు అజిత్ జోగి ఎస్టీ కాదంటూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తేల్చి చెప్పింది. అజిత్ జోగి వద్దనున్న కుల ధ్రువీకరణ పత్రాలు, ఎస్టీ హోదాతో లభించిన ప్రయోజనాలను వెనక్కి తీసుకొని ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బిలాస్‌పూర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
కేసు పూర్వాపరాలు : 2001లో బీజేపీ సీనియర్ నాయకుడు, జాతీయ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ నందకుమార్ సాయి, సంత్ కుమార్ నేతంలు కలిసి అజిత్ జోగి ఎస్టీ కాదంటూ హైకోర్టులో కేసు వేశారు. కానీ ఒక వ్యక్తి కులాన్ని ధృవీకరించడానికి జాతీయ కమిషన్‌కు ఎలాంటి హక్కు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. తీర్పును సంత్‌కుమార్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీంతో సుప్రీం కోర్టు, ఒక హైపవర్ కమిటీ వేసి విచారించాలని చత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని 2011లో ఆదేశించింది. ప్రభుత్వం నియమించిన కమిటీ 2017లో అజిత్ జోగి ఎస్టీ కాదంటూ నివేదిక ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ అజిత్‌జోగి 2018లో హైకోర్టుకు వెళ్లగా, కోర్టు కమిటీ సభ్యులను మార్చింది. కొత్తగా ఏర్పాటైన కమిటీ కూడా మునుపటి నివేదికనే ఇవ్వడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అజిత్‌జోగి ప్రస్తుతం రిజర్వుడ్ అసెంబ్లీ స్థానం మార్వాహి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఈ వ్యవహారంపై అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగి స్పందిస్తూ.. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానే జరుగుతుందన్నారు. కమిటీ ఎలాంటి ప్రాథమిక న్యాయ సూత్రాలను పాటించకుండా ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకు ఆయన కోరుకున్న విధంగానే నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. నా తండ్రి కలెక్టర్‌గా సెలెక్ట్ అయినపుడు రాని సమస్య ఇప్పుడు ఎలా వచ్చిందని మండిపడ్డారు. ఈ విషయంపై మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment