ajith jogi
-
అజిత్ జోగి కన్నుమూత
రాయ్‌పూర్/న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ అజిత్ జోగి(74) రాయ్‌పూర్‌లోని శ్రీనారాయణ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 20 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి కోమాలోనే ఉన్నారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు. అజిత్ జోగి భార్య రేణు ప్రస్తుతం కోట నియోజకవర్గ ఎమ్మెల్యే. అజిత్ జోగి మరణం నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజులు సంతాప దినాలు పాటించనున్నట్లు ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ప్రకటించారు. జోగి అంత్యక్రియలను ఆయన స్వస్థలం మర్వాహీ జిల్లాలోని గౌరెలాలో ఆదివారం నిర్వహించనున్నట్లు తెలిపారు. విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ అజిత్ జోగి మృతి చెందడం పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఆయన ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ప్రధానంగా గిరిజనుల జీవితాలను మార్చేందుకు ఎంతగానో కృషి చేశారన్నారు. పేదల ‘కలెక్టర్ సాబ్’ ఛత్తీస్‌గఢ్ ప్రజలు ‘కలెక్టర్ సాహెబ్’అని ముద్దుగా పిలుచుకునే అజిత్ జోగి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి తొట్టతొలి ముఖ్యమంత్రి. 2000 నవంబర్ నుంచి డిసెంబర్ 2003 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. విద్యావంతుడు, రచయిత, రాజకీయవేత్త అయిన అజిత్ జోగి పూర్తి పేరు అజిత్ ప్రమోద్ కుమార్ జోగి. ఆదివాసీ సమాజంలో పుట్టి ఉన్నత చదువులు చదివి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిన నేత. 1946 ఏప్రిల్ 29వ తేదీన అప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్రం భిలాస్పూర్ జిల్లాలోని జోగిసర్‌లో జన్మించారు. ఆయన తండ్రి కాశీ ప్రసాద్ జోగి, తల్లి కాంతిమణి. విద్యార్థి నాయకుడి నుంచి.. అత్యధికంగా పన్నెండేళ్లపాటు నాలుగు జిల్లాలకు కలెక్టరుగా వ్యవహరించిన జాతీయ రికార్డు అజిత్ జోగి సొంతం. విద్యార్థి జీవితం నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారు. భోపాల్‌లోని మౌలానా ఆజాద్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీకి 1967లో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో లా చదివారు. 1967లో రాయ్‌పూర్‌లోని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా కూడా పనిచేశారు. రాజకీయ రంగ ప్రవేశం చేసి, అంచెలంచెలుగా జాతీయస్థాయి నేతగా ఎదిగారు. అజిత్ శాసనసభతోపాటు లోక్‌సభ, రాజ్యసభలకు ఎన్నికయ్యారు. 2016లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కాంగ్రెస్ అజిత్ జోగిని పార్టీ నుంచి బహిష్కరించింది. అదే ఏడాది అజిత్ జోగి ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ పేరుతో పార్టీని ప్రారంభించారు. అజిత్ జోగి రాజకీయవేత్త మాత్రమే కాదు రచయితగా కూడా సుపరిచితులు. ‘‘ద రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్’’, ‘‘అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పెరిఫెరల్ ఏరియాస్’’అనే పుస్తకాలు రాశారు. 2004లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అజిత్ జోగి వీల్‌ఛైర్‌కు పరిమితమయ్యారు. అయినప్పటికీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. జోగి భార్య రేణు, కొడుకు అమిత్ రాజకీయాల్లో ఉన్నారు. ప్రభుత్వ అధికారిగా... 1968లో సివిల్ సర్వీసెస్ ద్వారా ఐఏఎస్‌కి ఎంపికయ్యారు. కలెక్టర్‌గా పనిచేసిన నాలుగు జిల్లాల్లోనూ అధికార దర్పాన్ని పక్కనపెట్టి పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. ఆయన ఇంట్లోకి సైతం ప్రజలకు నేరుగా ప్రవేశించే స్వేచ్ఛనిచ్చిన అరుదైన కలెక్టర్ సాహెబ్ అజిత్ జోగి. కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన అనంతరం జాతీయ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. -
మాజీ సీఎం కుమారుడి అరెస్ట్
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగిని అరెస్ట్ చేశారు. తాను ఎస్టీనని పేర్కొంటూ తప్పుడు అధికారిక పత్రాలను ప్రకటించినందుకు ఆయన అరెస్ట్ అయ్యారు.2013లో చత్తీస్‌గఢ్‌లోని మార్వాహి అసెంబ్లీ స్ధానం నుంచి తనపై పోటీచేసిన బీజేపీ నేత సమీర పైక్రా ఫిర్యాదుపై అమిత్ జోగి అరెస్ట్ అయ్యారు. మార్వాహి రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి తప్పుడు పత్రాలతో ఎస్టీగా పేర్కొంటూ అమిత్ జోగి పోటీ చేశారని ఆయన ప్రత్యర్ధి ఫిర్యాదు చేశారు. కాగా, అమిత్ జోగిని బిలాస్‌పూర్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. పుట్టిన ప్రదేశం గురించి కూడా ఎన్నికల అఫిడవిట్లో తప్పుగా పేర్కొన్నారనే ఆరోపణలున్నాయి. -
అజిత్ జోగి ఎస్టీ కాదు: తేల్చిచెప్పిన కమిటీ
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ అధ్యక్షుడు అజిత్ జోగి ఎస్టీ కాదంటూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తేల్చి చెప్పింది. అజిత్ జోగి వద్దనున్న కుల ధ్రువీకరణ పత్రాలు, ఎస్టీ హోదాతో లభించిన ప్రయోజనాలను వెనక్కి తీసుకొని ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బిలాస్పూర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. కేసు పూర్వాపరాలు : 2001లో బీజేపీ సీనియర్ నాయకుడు, జాతీయ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ నందకుమార్ సాయి, సంత్ కుమార్ నేతంలు కలిసి అజిత్ జోగి ఎస్టీ కాదంటూ హైకోర్టులో కేసు వేశారు. కానీ ఒక వ్యక్తి కులాన్ని ధృవీకరించడానికి జాతీయ కమిషన్‌కు ఎలాంటి హక్కు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. తీర్పును సంత్‌కుమార్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీంతో సుప్రీం కోర్టు, ఒక హైపవర్ కమిటీ వేసి విచారించాలని చత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని 2011లో ఆదేశించింది. ప్రభుత్వం నియమించిన కమిటీ 2017లో అజిత్ జోగి ఎస్టీ కాదంటూ నివేదిక ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ అజిత్‌జోగి 2018లో హైకోర్టుకు వెళ్లగా, కోర్టు కమిటీ సభ్యులను మార్చింది. కొత్తగా ఏర్పాటైన కమిటీ కూడా మునుపటి నివేదికనే ఇవ్వడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అజిత్‌జోగి ప్రస్తుతం రిజర్వుడ్ అసెంబ్లీ స్థానం మార్వాహి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ వ్యవహారంపై అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగి స్పందిస్తూ.. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానే జరుగుతుందన్నారు. కమిటీ ఎలాంటి ప్రాథమిక న్యాయ సూత్రాలను పాటించకుండా ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకు ఆయన కోరుకున్న విధంగానే నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. నా తండ్రి కలెక్టర్‌గా సెలెక్ట్ అయినపుడు రాని సమస్య ఇప్పుడు ఎలా వచ్చిందని మండిపడ్డారు. ఈ విషయంపై మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. -
యూపీలో కీలక సర్వే.. బీజేపీకి కష్టమే!
న్యూఢిల్లీ: 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అధికారం రావడంలో కీలకపాత్ర పోషించిన యూపీలో విపక్ష మహా కూటమి ప్రభావం స్పష్టంగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రజల్లో మోదీ పాలనపై సానుకూలత ఉన్నప్పటికీ.. ఎస్పీ–బీఎస్పీ కలిసి పోటీచేస్తే బీజేపీకి చిక్కులు తప్పవని స్పష్టమైంది. 47% మంది ప్రాంతీయ పార్టీలు ఏకమైతే బీజేపీ ఇప్పుడున్న స్థానాల్లో కొన్నింటిని కోల్పోవాల్సి వస్తుందని అభిప్రాయపడగా.. 32% మంది కూటమి ప్రభావం ఉండదని.. 21% మంది చెప్పలేమని పేర్కొన్నారు. ఇండియాటుడే సంస్థ సెప్టెంబర్ 15–19 మధ్యలో 30,400 మంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం యూపీలో 48% మంది మళ్లీ మోదీనే ప్రధానిగా కావాలని కోరుకోగా.. 22% మంది రాహుల్ గాంధీ వైపు మొగ్గుచూపారు. 9% మంది మాయావతి ప్రధాని కావాలని అభిప్రాయపడగా.. అఖిలేశ్‌కు 7% మంది ఓకే చెప్పారు. 80 ఎంపీ స్థానాలున్న యూపీలో 2014 ఎన్నికల్లో బీజేపీ 71 స్థానాల్లో విజయ దుందుభి మోగించి కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. ప్రధానిగా మోదీ భేష్ : వారణాసి ఎంపీగా ఉన్న నరేంద్ర మోదీ పాలనపై 53% మంది సంతృప్తి వ్యక్తం చేయగా.. 16%మంది పర్వాలేదన్నారు. 28% మాత్రం కేంద్రం పాలన బాగాలేదని అభిప్రాయపడ్డారు. ఎస్సీల్లో 39% మోదీకే జై కొట్టగా.. మాయావతికి 24%, రాహుల్‌కు 20%, అఖిలేశ్‌కు 4%మంది మద్దతు తెలిపారు. రాఫెల్ ఒప్పందం విషయంలో కేంద్రంపై విపక్షాలు చేస్తున్న విమర్శల ప్రభావం యూపీలో పెద్దగా కనిపించలేదు. 79% మంది తమకు రాఫెల్ వివాదం గురించి తెలియదని వెల్లడించారు. సీఎంగా యోగి ఓకే! ఉత్తరప్రదేశ్ తదుపరి సీఎంగా యోగికి 43% మంది మద్దతు తెలుపగా.. అఖిలేశ్‌కు 29%, మాయావతికి 18% మంది ఓటేశారు. సీఎంగా యోగి పాలనపై 41% సంతృప్తి చెందుతుండగా.. 20%మంది పర్వాలేదన్నారు. 37% మందిలో మాత్రం అసంతృప్తి వ్యక్తమైంది. అఖిలేశ్, మాయావతిలతో పోలిస్తే.. ఓబీసీలు, బ్రాహ్మణులు, ఎస్టీల్లో ఎక్కువ మంది యోగికే మద్దతు తెలిపారు. ముస్లింలు అఖిలేశ్‌కు (71%), ఎస్సీలు మాయావతికి (49%) మద్దతు ప్రకటించారు. పీఎం ఓకే.. కానీ ముఖ్యమంత్రే? ఉత్తరాఖండ్‌లో బీజేపీకి భిన్నమైన పరిస్థితి ఎదురవుతోంది. ప్రధానిగా మోదీ పనితీరుపై సంతృప్తిగానే ఉన్నా.. సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌పై స్వల్ప వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొత్తంగా ప్రధానిగా మోదీకి 57% మంది, రాహుల్‌కు 32%మంది మద్దతు తెలిపారు. మోదీ పాలనపై 45% సంతృప్తి వ్యక్తం చేయగా.. 23% పర్వాలేదని, 24% బాగాలేదని అభిప్రాయపడ్డారు. అయితే సీఎంగా రావత్ పనితీరుపై 35% మంది అసంతృప్తిని వ్యక్తం చేయగా.. 30% బాగుందని, 29% పర్వాలేదని పేర్కొన్నారు. యూపీలో బీఎస్పీ–ఎస్పీ జోడీ ప్రభావం బీజేపీపై ఉంటుందా? అన్నప్రశ్నకు అవును అని 47% మంది, చెప్పలేమని 21% మంది, ప్రభావం ఉండదని 32%మంది అభిప్రాయపడ్డారు. -
ఛత్తీస్‌గఢ్‌లో అజిత్ జోగీతో బీఎస్పీ జట్టు
లక్నో: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) కాంగ్రెస్‌కు షాకిచ్చింది. ఈ ఎన్నికల్లో అజిత్ జోగీ నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్(జేసీసీ)తో కలిసి పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ విషయమై బీఎస్పీ అధినేత్రి మాయావతి లక్నోలో మాట్లాడుతూ.. ‘జేసీసీతో పొత్తు కుదుర్చుకోవాలని మేం నిర్ణయించుకున్నాం. అజిత్ జోగీ మా కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారు. మొత్తం సీట్లలో జేసీసీ 55 చోట్ల, బీఎస్పీ 35 సీట్లలో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది. గౌరవప్రదమైన సీట్లు ఇచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు మాకు అభ్యంతరం లేదు’ అని తెలిపారు. తమ కూటమి బీజేపీని గద్దె దించగలదని ఆమె వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్‌కు బెహన్ భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమితో ప్రధాని నరేంద్ర మోదీని నిలువరించాలని సన్నాహాలు చేస్తున్న కాంగ్రెస్‌కు బీఎస్పీ అధినేత్రి మాయావతి గట్టి షాక్ ఇచ్చారు. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ తిరుగుబాటు నేత అజిత్ జోగితో ఎన్నికల పోరుకు బెహన్ మాయావతి ఒప్పందం కుదుర్చుకుని కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లారు. 90 స్ధానాలున్న చత్తీస్‌గఢ్‌లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 35 సీట్లు, అజిత్ జోగి సారథ్యంలోని చత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ 55 స్ధానాల్లో పోటీ చేసేలా అవగాహన కుదరడంతో షాక్ తినడం కాంగ్రెస్ వంతైంది. పదిహేనేళ్ల బీజేపీ సర్కార్‌పై ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలన్న కాంగ్రెస్ ఆశలకు మాయావతి గండికొట్టారు. దళిత ఓటుబ్యాంకును కొల్లగొట్టేందుకు మాయావతితో పొత్తుకు బీజేపీ తహతహలాడినా ఆచరణలో వెనకబడటంతో సమయానుకూలంగా వ్యవహరించిన జోగి లాభపడ్డారు. ఇక రాజస్ధాన్, మధ్యప్రదేశ్‌ల్లో గౌరవప్రదమైన సీట్లు ఇస్తేనే యూపీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామని మాయావతి కాంగ్రెస్ ముందు భారీ డిమాండ్లను ఉంచారు. మోదీ హవాకు చెక్‌పెట్టి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలకు అధిక సీట్లను కట్టబెట్టేందుకు సిద్ధమైనా మాయావతి కోరినన్ని సీట్లు ఇస్తే కాంగ్రెస్‌కు భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కాంగ్రెస్‌కు మరో కీలక నేత గుడ్‌బై!
యువరాజు రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపడతారని వినవస్తున్న తరుణంలో.. కాంగ్రెస్‌కు మరో గట్టి దెబ్బ తగులుతోంది. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కాంగ్రెస్‌కు గుడ్ నైట్ చెప్పి, సొంత పార్టీ పెట్టుకోడానికి సిద్ధమయ్యారు. ఇంతకుముందు అసోం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ నాయకత్వం.. ముఖ్యంగా రాహుల్ గాంధీ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి చెంది ఇద్దరు పెద్ద నాయకులు పార్టీని వీడి వెళ్లిపోయారు. వారలో హిమాంత బిశ్వ శర్మ అసోంలో బీజేపీ విజయం వెనుక కీలకంగా మారగా, ఉత్తరాఖండ్‌లో మాజీ సీఎం విజయ్ బహుగుణ అయితే రావత్ ప్రభుత్వాన్ని దించేశారు. ఛత్తీస్‌గఢ్ పీసీసీ చీఫ్ భూపేష్ బఘెల్ మీద తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోను గానీ, వాళ్లకు 'గుడ్ నైట్' మాత్రం చెబుతానని జోగి ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. జోగి వెళ్లిపోతే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం తప్పదని అంటున్నారు. 'గేదెల ముందు వేణువు ఊదడం' ఎందుకంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ అధిష్ఠానాన్ని ఉద్దేశించివనేనని, వీటిని రాష్ట్ర పార్టీ గమనిస్తోందని పార్టీ అధికార ప్రతినిధి శైలేష్ నితిన్ త్రివేదీ చెప్పారు. ఈనెల ఆరో తేదీన తన మద్దతుదారులతో సమావేశమై తదుపరి కార్యాచరణను నిర్ణయించుకుంటానని అజిత్ జోగి చెబుతున్నారు. పెద్దల సలహాతో తన కొత్త పార్టీ పేరు, గుర్తు, ఇతర వ్యవహారాలపై నిర్ణయించుకుంటానన్నారు. సీనియర్ నేతలు బాఘెల్, టీఎస్ సింగ్‌దేవ్ లాంటి వాళ్లకు సొంత ప్రయోజనాలు ఉన్నాయని, భూముల వ్యవహారంలో తమపై కేసులు రాకూడదనే బీజేపీ సర్కారుపై వాళ్లు పోరాటం చేయలేకపోతున్నారని జోగి మండిపడ్డారు. ఒకప్పుడు నెహ్రూ, ఇందిర, రాజీవ్, సోనియా గాంధీల నేతృత్వంలో నడిచిన పార్టీకి, ఇప్పటి పార్టీకి చాలా తేడా ఉందని అన్నారు.