కాంగ్రెస్‌కు మరో కీలక నేత గుడ్‌బై!
యువరాజు రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపడతారని వినవస్తున్న తరుణంలో.. కాంగ్రెస్‌కు మరో గట్టి దెబ్బ తగులుతోంది. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కాంగ్రెస్‌కు గుడ్ నైట్ చెప్పి, సొంత పార్టీ పెట్టుకోడానికి సిద్ధమయ్యారు. ఇంతకుముందు అసోం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ నాయకత్వం.. ముఖ్యంగా రాహుల్ గాంధీ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి చెంది ఇద్దరు పెద్ద నాయకులు పార్టీని వీడి వెళ్లిపోయారు. వారలో హిమాంత బిశ్వ శర్మ అసోంలో బీజేపీ విజయం వెనుక కీలకంగా మారగా, ఉత్తరాఖండ్‌లో మాజీ సీఎం విజయ్ బహుగుణ అయితే రావత్ ప్రభుత్వాన్ని దించేశారు.
ఛత్తీస్‌గఢ్ పీసీసీ చీఫ్ భూపేష్ బఘెల్ మీద తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోను గానీ, వాళ్లకు 'గుడ్ నైట్' మాత్రం చెబుతానని జోగి ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. జోగి వెళ్లిపోతే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం తప్పదని అంటున్నారు. 'గేదెల ముందు వేణువు ఊదడం' ఎందుకంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ అధిష్ఠానాన్ని ఉద్దేశించివనేనని, వీటిని రాష్ట్ర పార్టీ గమనిస్తోందని పార్టీ అధికార ప్రతినిధి శైలేష్ నితిన్ త్రివేదీ చెప్పారు. ఈనెల ఆరో తేదీన తన మద్దతుదారులతో సమావేశమై తదుపరి కార్యాచరణను నిర్ణయించుకుంటానని అజిత్ జోగి చెబుతున్నారు. పెద్దల సలహాతో తన కొత్త పార్టీ పేరు, గుర్తు, ఇతర వ్యవహారాలపై నిర్ణయించుకుంటానన్నారు. సీనియర్ నేతలు బాఘెల్, టీఎస్ సింగ్‌దేవ్ లాంటి వాళ్లకు సొంత ప్రయోజనాలు ఉన్నాయని, భూముల వ్యవహారంలో తమపై కేసులు రాకూడదనే బీజేపీ సర్కారుపై వాళ్లు పోరాటం చేయలేకపోతున్నారని జోగి మండిపడ్డారు. ఒకప్పుడు నెహ్రూ, ఇందిర, రాజీవ్, సోనియా గాంధీల నేతృత్వంలో నడిచిన పార్టీకి, ఇప్పటి పార్టీకి చాలా తేడా ఉందని అన్నారు.