వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తాం!
• మా ప్రభుత్వం వచ్చిన వెంటనే తీర్మానం చేస్తాం
• ఏపీలో ఐదోరోజు రైతు భరోసా యాత్రలో వైఎస్ జగన్
అనంతపురం: ‘‘కర్ణాటకలో వాల్మీకులు(బోయ)లు ఎస్టీలు. ఇక్కడ బీసీలుగా చూస్తున్నారు. పిల్లలకు మంచి చదువులు, ఉద్యోగాలు రావాలంటే ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకులు అడుగుతున్నారు. ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే వాల్మీకులను ఎస్టీల్లో చేర్చేలా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఏపీలోని అనంతపురం జిల్లాలో మూడో విడత రైతు భరోసాయాత్రలో ఐదోరోజు శనివారం జగన్ పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో పర్యటించారు. మడకశిరలో వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి ప్రసంగించారు.
ప్రసంగం ఆయన మాటల్లోనే..
హంద్రీ-నీవా ప్రాజెక్టు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉందని అందరికీ తెలుసు. ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ రోజు ప్రాజెక్టు 85 శాతం పూర్తయిందంటే అది దివంగత సీఎం వైఎస్సార్ చలువే! చంద్రబాబు మాత్రం ‘అనంత’కు వచ్చినప్పుడల్లా తానే నీళ్లు ఇచ్చానని చెప్పుకుంటున్నారు. ఆయన సీఎం అయి ఏడాది దాటింది. కేవలం రూ.200 కోట్ల నిధులు కేటాయించారు. ఇవి కరెంటు బకాయిలకు కూడా సరిపోవు. వైఎస్ చిత్తశుద్ధితో ప్రాజెక్టును నిర్మించారు కాబట్టే 85% పూర్తయింది. ఈరోజు చంద్రబాబు కుళాయి తిప్పి నీళ్లు వదులుతున్నారు. ప్రాజెక్టు తక్కిన పనులు బాబు పూర్తి చేయలేరు. అధికారంలోకి రాగానే దాన్ని కూడా పూర్తి చేసి ‘అనంత’లోని ప్రతీ ఎకరాకు సాగునీరు ఇస్తాం.
బాబుది మోసపూరిత పాలన: బాబు గురించి నాలుగు మాటల్లో చెప్పొచ్చు... రుణమాఫీ చేస్తానని రైతుల్ని, డ్వాక్రా మహిళల్ని మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగులను... ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2వేల భృతి ఇస్తామని నిరుద్యోగులనూ మోసం చేశారు. గుడిసెలు లేకుండా పక్కా ఇళ్లను నిర్మిస్తామని ప్రజల్ని మోసం చేశారు. రేషన్‌కార్డులు ఇచ్చేవారు లేరు. ఉన్నవి కూడా తీసేస్తున్నారు. రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు మోసం చేశారు. ఈ మోసాన్ని వదిలేది లేదు. అందరం ఒక్కటి కావాలి. ప్రభుత్వంపై పోరాడాలి.
రాహుల్ గురించి మాట్లాడాల్సిన పని లేదు
రాహుల్ ఎప్పుడు ఇండియాలో ఉంటారో, ఎప్పుడు విదేశాల్లో ఉం టారో తెలీదు. ఏపీలో ఎప్పుడు, ఎక్కడ, ఏం జరిగినా తక్షణం స్పందించేది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే! ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. రాహుల్‌గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.
లక్ష్మన్నది ఎందుకు రైతు ఆత్మహత్య కాదు?
రొద్దం మండలం పి.కొత్తపల్లికి చెందిన లక్ష్మన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటిదాకా ఎవ్వరూ ఈ కుటుంబ స్థితిగతులు తెలుసుకోలేదు. దమ్మిడీ సాయం చేయలేదు. లక్ష్మన్నకు బ్యాంకులో రూ.1,90 లక్షలు అప్పుంది. తీసుకున్న అప్పుకు రూ.20 వేలు వడ్డీ అయింది. రూ.19 వేలు మాఫీ అయింది. వడ్డీకి కూడా సరిపోని విధంగా బాబు రుణమాఫీ అమలు చేశారు. వడ్డీలేని రుణాలు తీసుకునే రైతులు 14 శాతం అపరాధవడ్డీ చెల్లిస్తున్నారు. తాకట్టుపెట్టిన బంగారం బ్యాంకుల్లోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉసురు తీసుకున్న లక్ష్మన్నది ఎందుకు రైతు ఆత్మహత్య కాదు. రూ.5 లక్షల పరిహారం ఎందుకు ఇవ్వరు? పబ్లిసిటీ వచ్చే చోట మాత్రమే పరిహారం ఇస్తారా? ‘అనంత’ రైతులు బతకలేక బెంగళూరుకు వలసెళ్లుతున్నారు. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. అయినా చంద్రబాబు మాత్రం రైతులు సుఖసంతోషాలతో ఉన్నారని అంటున్నారు.