raithu bharosa yathra
-
రైతులకోసం RBK సేవలు
-
మాఫీ పేరుతో ముంచిన బాబు
రైతు భరోసాయాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేకప్రతినిధి: ‘అధికారం కోసం అబద్ధాలు చెప్పి తప్పుడు హామీలతో గద్దెనెక్కిన సీఎం చంద్రబాబు.. తీరా వాటి అమలు విషయానికి వచ్చేసరికి తప్పించుకునేందుకు రకరకాల పద్ధతులు అవలంభిస్తున్నారు. రైతులకు రుణమాఫీ అంతంత మాత్రమే చేశారు. డ్వాక్రా రుణాల మాఫీ అంతకన్నా లేదు. పింఛన్ల పెంపు పేరిట అర్హులైన వారి పేర్లను సైతం తొలగించేశారు. దీంతో ఆ పండుటాకులకు ఆసరా లేకుండా పోయింది. మీ మాటలు నమ్మిన రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబాలను ఆదుకోవాల్సింది పోయి.. పరిహారం ఇవ్వకుండా తప్పించుకోడానికి అడ్డమైన దారులు వెదుకుతున్నారు. పోస్టుమార్టంలో రైతులది ఆత్మహత్యేనని మీరే ధ్రువీకరిస్తున్నారు. అదే వ్యక్తికి ఎంతో కొంత రుణమాఫీ వర్తించిందంటే రైతు అని మీరు ఒప్పకున్నట్లే కదా. కానీ పరిహారం మాత్రం ఇవ్వరు’ అని ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. పరిహారం ఇస్తున్న కొద్దిపాటి రైతులకు కూడా ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టమొచ్చినట్లు ఇస్తోంది. ఇదేం పద్ధతి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మాఫీ పేరిట బాబు రైతులను ముంచేశారని విమర్శించారు. అనంతపురం జిల్లాలో ఆదివారం 6వ రోజు జగన్ ‘రైతు భరోసాయాత్ర’ మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం దేవరహట్టి, ఎస్ఎస్ గుండ్లు గ్రామాల్లో జరిగింది. దేవరహట్టి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు రంగప్ప, ఎస్ఎస్ గుండ్లులో రైతు గిడ్డీరప్ప కుటుంబసభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. -
పట్టురైతుల సమస్యలపై పోరాడతాం
దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో పట్టు రైతులకు ప్రయోజనం చేకూరిందని, చంద్రబాబు ప్రభుత్వంలో వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని వైఎస్ జగన్ అన్నారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రలో భాగంగా మడకశిర-కదిరేపల్లి దారిలో వెళుతూ పక్కనే ఉన్న లక్ష్మీనరసప్ప అనే పట్టురైతు పొలంలోకి ఆయన వెళ్లారు. పట్టురైతులంతా అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా పట్టురైతుల సమస్యలపై ఆయన ఆరా తీశారు. వారి సమస్యలు విన్నాక మాట్లాడుతూ.. ‘వైఎస్ హయాంలో పట్టుగూళ్ల ధర కిలో రూ.400-450 ఉండేది. ఇది కాకుండా పవర్‌లూమ్స్ ప్రభావాన్ని తగ్గించి, పట్టు రైతులు, కార్మికులకు మేలు చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చైనా సిల్క్ దిగుమతులపై సుంకాన్ని 31 శాతానికి పెంచారు. ఇప్పుడు పట్టుగూళ్ల ధర 120 రూపాయలకు తగ్గిపోయింది. దిగుమతి సుంకాన్ని కేంద్రం 5 శాతానికి తగ్గించింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎకరాకు రూ.25-28 వేలు ఖర్చు వస్తోంది. కానీ రైతులకు పెట్టుబడి కూడా రావడం లేదు. వైఎస్ హయాంలో పవర్‌లూమ్స్‌లో పాలిస్టర్, జరీ వాడకుండా తనిఖీలు చేసేవారు. దీంతో స్వచ్ఛమైన జరీదారంతోనే హ్యాం డ్లూమ్స్ నడిచేవి. ఇప్పుడు తనిఖీలు కూడా లేవు. పట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నా చంద్రబాబుకు కనపడడం లేదు’’ అని విమర్శించారు. అన్ని సమస్యలూ సావధానంగా విన్న జగన్మోహన్రెడ్డి.. దిగుమతి సుంకం అంశంతోపాటు ఇతర సమస్యలనూ వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తుతారని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కూడా చంద్రబాబుకు బుద్ధివచ్చేలా ఒత్తిడి తెచ్చి పట్టురైతులకు న్యాయం జరిగేలా పోరాడతామని ధైర్యం చెప్పారు. -
కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటాం
మున్సిపల్ కార్మిక నేతలకు విపక్ష నేత వైఎస్ జగన్ భరోసా అనంతపురం: మున్సిపల్ కార్మికులకు వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ పోరాటం చేస్తుందని పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు నాలుగు రోజుల్లోగా పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిస్తామంటూ విపక్ష నేత ఇచ్చిన అల్టిమేటమ్ అనంతరం కార్మికుల సమ్మెకు ప్రభుత్వం తలొగ్గిన నేపథ్యంలో కార్మిక జేఏసీ నేతలు ఆదివారం వైఎస్ జగన్‌ని కలసి ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం జిల్లా గుడిబండ మండలంలో రైతు భరోసా యాత్ర చేస్తున్న జగన్‌ను కలసి మిఠాయిలు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. మున్సిపల్ ఉద్యోగులు న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని రెండు వారాలుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని, ప్రతిపక్ష నేతగా వారి పక్షాన నిలబడి అల్టిమేటం జారీ చేయడంతోనే ప్రభుత్వం దిగివచ్చిందంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నపుడు కూడా ప్రభుత్వం స్పందించకపోతే.. ‘అనంత’లో మీరు చేసిన హెచ్చరికలతో వారి సమస్యలపై ప్రభుత్వం దిగివచ్చింది. ఇప్పుడు మున్సిపల్ కార్మికుల సమస్యలపై కూడా ‘అనంత’లో జారీ చేసిన అల్టిమేటంతోనే పరిష్కారమయ్యాయి. ‘రాష్ట్రవ్యాప్త కార్మికులు మీ మేలును మర్చిపోరు’ అని అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లు రెగ్యులరైజ్ చేయాలని విన్నవించారు. తప్పకుండా పరిశీలిస్తామని, కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు. ఆస్పత్రి ఏర్పాటుకు చొరవ చూపండి ‘అనంత’లో ఈఎస్ఐ క్లీనిక్ మాత్రమే ఉందని, అంతకుమించి ఏర్పాట్లు లేకపోవడంతో చిన్న జబ్బు వచ్చినా రూ.2-3 వేలు ఖర్చవుతోందని కార్మికులు జగన్మోహన్రెడ్డికి వివరించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అన్ని సౌకర్యాలతో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్మించేలా చొరవ తీసుకోవాలని విన్నవించారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైఎస్ అందరికీ నాణ్యమైన వైద్యం అందించారని, ఇప్పుడు ఏ సాకు చూపించి రేషన్‌కార్డు తీసేస్తారో...ఆరోగ్యశ్రీ ఎక్కడ వర్తించదో అనే ఆందోళన కార్మికుల్లో ఉందని, కాబట్టి ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు చొరవ చూపించాలని విన్నవించారు. -
వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తాం!
-
రూ. 5 లక్షల పరిహారం అందేవరకు పోరాడతాం
⇒రైతు ఆత్మహత్యలపై విపక్షనేత జగన్మోహన్రెడ్డి ⇒మా ప్రభుత్వం వచ్చాక తొలి సంతకం పరిహారం ఫైల్‌పైనే చేస్తా ⇒రైతు భరోసాయాత్రలోరైతు కుటుంబాలకు హామీ ⇒ఐదోరోజు మూడు రైతు కుటుంబాలకు పరామర్శ (రైతు భరోసా యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేకప్రతినిధి): అప్పుల బాధ తాళలేక రైతన్న ఆత్మహత్య చేసుకుంటే.. పోస్టుమార్టం రిపోర్టు ఆత్మహత్యేనని చెబుతుంటే.. ప్రభుత్వం కొర్రీలు పెడుతూ రూ.5 లక్షల పరిహారం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.ఐదు లక్షలు పరిహారం అందేవరకూ పోరాడతామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే తమ ప్రభుత్వం వచ్చాక ఎక్స్‌గ్రేషియాకు సంబంధించిన ఫైల్‌పైనే తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. ఐదోరోజు రైతు భరోసాయాత్ర పెనుగొండ, మడకశిర నియోజకవర్గాల్లో శనివారం కొనసాగింది. పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని పి.కొత్తపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు లక్ష్మన్న, మడకశిర మండలంలోని టి.డి. పల్లి గ్రామంలో ఆనందప్ప, హెచ్ఆర్ పాళ్యం గ్రామంలో ఓబన్న కుటుంబాలను జగన్ పరామర్శించారు. -
వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తాం!
• మా ప్రభుత్వం వచ్చిన వెంటనే తీర్మానం చేస్తాం • ఏపీలో ఐదోరోజు రైతు భరోసా యాత్రలో వైఎస్ జగన్ అనంతపురం: ‘‘కర్ణాటకలో వాల్మీకులు(బోయ)లు ఎస్టీలు. ఇక్కడ బీసీలుగా చూస్తున్నారు. పిల్లలకు మంచి చదువులు, ఉద్యోగాలు రావాలంటే ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకులు అడుగుతున్నారు. ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే వాల్మీకులను ఎస్టీల్లో చేర్చేలా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఏపీలోని అనంతపురం జిల్లాలో మూడో విడత రైతు భరోసాయాత్రలో ఐదోరోజు శనివారం జగన్ పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో పర్యటించారు. మడకశిరలో వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి ప్రసంగించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. హంద్రీ-నీవా ప్రాజెక్టు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉందని అందరికీ తెలుసు. ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ రోజు ప్రాజెక్టు 85 శాతం పూర్తయిందంటే అది దివంగత సీఎం వైఎస్సార్ చలువే! చంద్రబాబు మాత్రం ‘అనంత’కు వచ్చినప్పుడల్లా తానే నీళ్లు ఇచ్చానని చెప్పుకుంటున్నారు. ఆయన సీఎం అయి ఏడాది దాటింది. కేవలం రూ.200 కోట్ల నిధులు కేటాయించారు. ఇవి కరెంటు బకాయిలకు కూడా సరిపోవు. వైఎస్ చిత్తశుద్ధితో ప్రాజెక్టును నిర్మించారు కాబట్టే 85% పూర్తయింది. ఈరోజు చంద్రబాబు కుళాయి తిప్పి నీళ్లు వదులుతున్నారు. ప్రాజెక్టు తక్కిన పనులు బాబు పూర్తి చేయలేరు. అధికారంలోకి రాగానే దాన్ని కూడా పూర్తి చేసి ‘అనంత’లోని ప్రతీ ఎకరాకు సాగునీరు ఇస్తాం. బాబుది మోసపూరిత పాలన: బాబు గురించి నాలుగు మాటల్లో చెప్పొచ్చు... రుణమాఫీ చేస్తానని రైతుల్ని, డ్వాక్రా మహిళల్ని మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగులను... ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2వేల భృతి ఇస్తామని నిరుద్యోగులనూ మోసం చేశారు. గుడిసెలు లేకుండా పక్కా ఇళ్లను నిర్మిస్తామని ప్రజల్ని మోసం చేశారు. రేషన్‌కార్డులు ఇచ్చేవారు లేరు. ఉన్నవి కూడా తీసేస్తున్నారు. రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు మోసం చేశారు. ఈ మోసాన్ని వదిలేది లేదు. అందరం ఒక్కటి కావాలి. ప్రభుత్వంపై పోరాడాలి. రాహుల్ గురించి మాట్లాడాల్సిన పని లేదు రాహుల్ ఎప్పుడు ఇండియాలో ఉంటారో, ఎప్పుడు విదేశాల్లో ఉం టారో తెలీదు. ఏపీలో ఎప్పుడు, ఎక్కడ, ఏం జరిగినా తక్షణం స్పందించేది వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే! ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. రాహుల్‌గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. లక్ష్మన్నది ఎందుకు రైతు ఆత్మహత్య కాదు? రొద్దం మండలం పి.కొత్తపల్లికి చెందిన లక్ష్మన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటిదాకా ఎవ్వరూ ఈ కుటుంబ స్థితిగతులు తెలుసుకోలేదు. దమ్మిడీ సాయం చేయలేదు. లక్ష్మన్నకు బ్యాంకులో రూ.1,90 లక్షలు అప్పుంది. తీసుకున్న అప్పుకు రూ.20 వేలు వడ్డీ అయింది. రూ.19 వేలు మాఫీ అయింది. వడ్డీకి కూడా సరిపోని విధంగా బాబు రుణమాఫీ అమలు చేశారు. వడ్డీలేని రుణాలు తీసుకునే రైతులు 14 శాతం అపరాధవడ్డీ చెల్లిస్తున్నారు. తాకట్టుపెట్టిన బంగారం బ్యాంకుల్లోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉసురు తీసుకున్న లక్ష్మన్నది ఎందుకు రైతు ఆత్మహత్య కాదు. రూ.5 లక్షల పరిహారం ఎందుకు ఇవ్వరు? పబ్లిసిటీ వచ్చే చోట మాత్రమే పరిహారం ఇస్తారా? ‘అనంత’ రైతులు బతకలేక బెంగళూరుకు వలసెళ్లుతున్నారు. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. అయినా చంద్రబాబు మాత్రం రైతులు సుఖసంతోషాలతో ఉన్నారని అంటున్నారు. -
అధికారులు బెదిరిస్తున్నారయ్యా..
రుణమాఫీ కాక మా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అయినా ఆయనది రైతు ఆత్మహత్య కాదంటున్నారు విచారణ పేరుతో డీఎస్పీ, ఆర్డీవో బెదిరిస్తున్నారు ఏపీ విపక్షనేత వైఎస్ జగన్‌తో చెప్పుకొని బోరుమన్న రామాంజనమ్మ రైతు ఆత్మహత్యలను ప్రభుత్వం గుర్తించడం లేదని మండిపడ్డ ఏపీ విపక్ష నేత పోస్టుమార్టం, రుణమాఫీ రిపోర్టులతో కేసు వేస్తాం ఆత్మహత్యలు గుర్తించి పరిహారం అందించేలా పోరాడతాం ధైర్యంగా ఉండండి... పిల్లలను బాగా చదివించుకోండి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జగన్ భరోసా మూడోవిడత రైతు భరోసాయాత్రలో రెండోరోజు 3 కుటుంబాలకు పరామర్శ (రైతు భరోసా యాత్ర నుంచి సాక్షిప్రతినిధి): ‘‘మాకు అన్యాయం జరిగిందయ్యా. రుణమాఫీ కాక అప్పులబాధతో మా ఆయన ఆత్మహత్య చేసుకుంటే అది రైతు ఆత్మహత్య కాదని ఆఫీసర్లు బెదిరిస్తున్నారు. డీఎస్పీ, ఆర్డీవో విచారణకు మా ఇంటికి వచ్చారు. ఇది రైతు ఆత్మహత్యకాదని, ఇతర కారణాలవల్ల ఆత్మహత్య చేసుకున్నారని మమ్మల్ని బెదిరించినట్లు మాట్లాడతాండారు’’ అని అనంతపురం జిల్లా వర్లి గ్రామానికి చెందిన రామాంజనమ్మ వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో చెప్పుకొని బోరుమన్నారు. జగన్ ఆమెను సముదాయించి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ‘‘గంగన్న కుటుంబానికి 4.60 ఎకరాల పొలం ఉంది. బ్యాంకులో రూ. 53 వేలు అప్పుంది. ఇందులో రూ.10,711 మాఫీ అయింది. అంటే ఆయన రైతని ప్రభుత్వం ఒప్పుకున్నట్లే కదా! పైగా అప్పుల బాధతో చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. పోస్టుమార్టం చేశారు. రికార్డు లున్నాయి. అలాంటప్పుడు అది ఎందుకు రైతు ఆత్మహత్య కాదు. నిజమైన రైతుల ఆత్మహత్యలను కూడా ప్రభుత్వం గుర్తించడం లేదు. ఇలాంటివాటి వివరాలు సేకరించి కోర్టులో కేసువేస్తాం. ఇలాంటి వాటిపై గట్టిగా పోరాడి, పరిహారం వచ్చేలా చూస్తాం’’ అని జగన్ భరోసానిచ్చారు. వివరాలు సేకరించాలని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డికి సూచించారు. గంగన్న సోదరుడు తిమ్మప్ప వర్లి గ్రామానికి పదేళ్లపాటు సర్పంచ్‌గా కొనసాగారని, అలాం టి వ్యక్తి తమ్ముడికి ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులు కల్పించడం దారుణమన్నారు. గంగన్న కుమారుడు వరప్రసాద్ సెంట్రింగ్ పనిలో శిక్షణ తీసుకుంటే ఏదైనా కంపెనీలో ఉద్యోగం ఇప్పించేలా చూస్తామని చెప్పారు. మూడో విడత రైతు భరోసాయాత్రలో భాగంగా రెండోరోజు బుధవారం జగన్ మూడు కుటుంబాలను పరామర్శించారు. బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లిలో రెండురోజుల కిందట ఆత్మహత్య చేసుకున్న ఈరన్న అనే రైతు కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత కళ్యాణదుర్గం మండలం ముదిగల్లులో నారాయణప్ప కుటుంబాన్ని, వర్లిలో గంగన్న కుటుంబాన్ని పరామర్శించారు. ఏ అధికారీ మా ఇంటికి రాలేదు.. బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లిలో ఈ నెల 20న ఈరన్న అనే రైతు ఉరి వేసుకుని చనిపోయాడు. జగన్ వారి ఇంట్లోకి వెళ్లగానే ఈరన్న భార్య మారెక్క, పిల్లలు ప్రహ్లాద, ప్రవీణ్‌లు బోరున విలపించారు. ‘‘సార్! మా నాన్న చనిపోయి రెండు రోజులైంది. ఏ అధికారీ మా ఇంటికి రాలేదు. ఆత్మహత్యను విచారించలేదు. మీరే మొదటగా మా ఇంటికి వచ్చారు’’ అని ఈరన్న పెద్దకుమారుడు ప్రహ్లాద చెప్పాడు. పొలం సాగు, బ్యాంకు అప్పు, సబ్సిడీ వివరాలను జగన్ ఆరా తీశారు. తన భర్త, మరిది కలిసి సొంతపొలం ఏడెకరాలు, కౌలుపొలం 12 ఎకరాలు సాగు చేశారని మారెక్క చెప్పారు. బోర్లు పడక, నీళ్లురాక రూ. 5 లక్షల అప్పయిందని, ప్రభుత్వం నుంచి ఏ సాయం అందలేదని తెలిపారు. తండ్రి అప్పులు తీర్చేందుకు ప్రవీణ్ ఐటీఐ చదువు మధ్యలో ఆపివేసి బెంగళూరుకు కూలిపనికి వెళుతున్నాడని తెలిసి జగన్ చలించిపోయారు. వెంటనే కాలేజీకి వెళ్లి చదుకోవాలని సూచించారు. చదువుకు తాము భరోసాగా ఉంటామని, నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ చూసుకుంటారని చెప్పారు. పోలీసులతో ఎఫ్ఐఆర్ చేయించి ఈ కుటుంబానికి ప్రభుత్వ సాయం అందేలా చూడాలని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డికి సూచించారు. పూర్తి పరిహారం ఇవ్వలేదు కళ్యాణదుర్గం మండలం ముదిగల్లులో ఆత్మహత్య చేసుకున్న నారాయణప్ప కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. ‘‘సార్... నా భర్త చనిపోయి పది నెలలవుతోంది. రైతు ఆత్మహత్యగా ప్రభుత్వం గుర్తించింది. రూ.ఐదు లక్షల పరిహారం ఇస్తామన్నారు. రూ.మూడు లక్షలు ఇచ్చామని చెబుతాండారు. అందులో రూ.1.50 లక్షలు ఊళ్లో పెద్దమనుషుల ద్వారా ప్రైవేటు అప్పులు చెల్లించారు. మరో రూ.1.50 లక్షలు బ్యాంకులో వేశారంట. కానీ మాకైతే ఏం తెలీదుసార్! ఏడాదికి రూ.50 వేలు ఇస్తామంటున్నారు సార్’’ అని నారాయణప్ప భార్య చంద్రమ్మ తెలిపారు. కచ్చితంగా పరిహారం మొత్తం అందేలా ప్రభుత్వంతో పోరాడతామని జగన్ ఆమెకు భరోసానిచ్చారు. పిల్లల చదువు బాధ్యత నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్‌కు అప్పగించారు. అనంతరం జగన్ కళ్యాణదుర్గంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి ఫాంహౌస్‌లో బస చేశారు. అంతకుముందు పట్టణంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. వాల్మీకి విగ్రహానికి పూలమాల వేశారు. రెండోరోజు యాత్రలో ఎంపీ మిథున్‌రెడ్డి, పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.