పట్టురైతుల సమస్యలపై పోరాడతాం
దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో పట్టు రైతులకు ప్రయోజనం చేకూరిందని, చంద్రబాబు ప్రభుత్వంలో వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని వైఎస్ జగన్ అన్నారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రలో భాగంగా మడకశిర-కదిరేపల్లి దారిలో వెళుతూ పక్కనే ఉన్న లక్ష్మీనరసప్ప అనే పట్టురైతు పొలంలోకి ఆయన వెళ్లారు. పట్టురైతులంతా అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా పట్టురైతుల సమస్యలపై ఆయన ఆరా తీశారు. వారి సమస్యలు విన్నాక మాట్లాడుతూ.. ‘వైఎస్ హయాంలో పట్టుగూళ్ల ధర కిలో రూ.400-450 ఉండేది. ఇది కాకుండా పవర్‌లూమ్స్ ప్రభావాన్ని తగ్గించి, పట్టు రైతులు, కార్మికులకు మేలు చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చైనా సిల్క్ దిగుమతులపై సుంకాన్ని 31 శాతానికి పెంచారు. ఇప్పుడు పట్టుగూళ్ల ధర 120 రూపాయలకు తగ్గిపోయింది.
దిగుమతి సుంకాన్ని కేంద్రం 5 శాతానికి తగ్గించింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎకరాకు రూ.25-28 వేలు ఖర్చు వస్తోంది. కానీ రైతులకు పెట్టుబడి కూడా రావడం లేదు. వైఎస్ హయాంలో పవర్‌లూమ్స్‌లో పాలిస్టర్, జరీ వాడకుండా తనిఖీలు చేసేవారు. దీంతో స్వచ్ఛమైన జరీదారంతోనే హ్యాం డ్లూమ్స్ నడిచేవి. ఇప్పుడు తనిఖీలు కూడా లేవు. పట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నా చంద్రబాబుకు కనపడడం లేదు’’ అని విమర్శించారు. అన్ని సమస్యలూ సావధానంగా విన్న జగన్‌మోహన్‌రెడ్డి.. దిగుమతి సుంకం అంశంతోపాటు ఇతర సమస్యలనూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌లో లేవనెత్తుతారని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కూడా చంద్రబాబుకు బుద్ధివచ్చేలా ఒత్తిడి తెచ్చి పట్టురైతులకు న్యాయం జరిగేలా పోరాడతామని ధైర్యం చెప్పారు.