మాఫీ పేరుతో ముంచిన బాబు
రైతు భరోసాయాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేకప్రతినిధి: ‘అధికారం కోసం అబద్ధాలు చెప్పి తప్పుడు హామీలతో గద్దెనెక్కిన సీఎం చంద్రబాబు.. తీరా వాటి అమలు విషయానికి వచ్చేసరికి తప్పించుకునేందుకు రకరకాల పద్ధతులు అవలంభిస్తున్నారు. రైతులకు రుణమాఫీ అంతంత మాత్రమే చేశారు. డ్వాక్రా రుణాల మాఫీ అంతకన్నా లేదు. పింఛన్ల పెంపు పేరిట అర్హులైన వారి పేర్లను సైతం తొలగించేశారు. దీంతో ఆ పండుటాకులకు ఆసరా లేకుండా పోయింది. మీ మాటలు నమ్మిన రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబాలను ఆదుకోవాల్సింది పోయి.. పరిహారం ఇవ్వకుండా తప్పించుకోడానికి అడ్డమైన దారులు వెదుకుతున్నారు. పోస్టుమార్టంలో రైతులది ఆత్మహత్యేనని మీరే ధ్రువీకరిస్తున్నారు.
అదే వ్యక్తికి ఎంతో కొంత రుణమాఫీ వర్తించిందంటే రైతు అని మీరు ఒప్పకున్నట్లే కదా. కానీ పరిహారం మాత్రం ఇవ్వరు’ అని ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎండగట్టారు. పరిహారం ఇస్తున్న కొద్దిపాటి రైతులకు కూడా ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టమొచ్చినట్లు ఇస్తోంది. ఇదేం పద్ధతి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మాఫీ పేరిట బాబు రైతులను ముంచేశారని విమర్శించారు. అనంతపురం జిల్లాలో ఆదివారం 6వ రోజు జగన్ ‘రైతు భరోసాయాత్ర’ మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం దేవరహట్టి, ఎస్‌ఎస్ గుండ్లు గ్రామాల్లో జరిగింది. దేవరహట్టి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు రంగప్ప, ఎస్‌ఎస్ గుండ్లులో రైతు గిడ్డీరప్ప కుటుంబసభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.