అధికారులు బెదిరిస్తున్నారయ్యా..
రుణమాఫీ కాక మా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు
అయినా ఆయనది రైతు ఆత్మహత్య కాదంటున్నారు
విచారణ పేరుతో డీఎస్పీ, ఆర్డీవో బెదిరిస్తున్నారు
ఏపీ విపక్షనేత వైఎస్ జగన్‌తో చెప్పుకొని బోరుమన్న రామాంజనమ్మ
రైతు ఆత్మహత్యలను ప్రభుత్వం గుర్తించడం లేదని మండిపడ్డ ఏపీ విపక్ష నేత
పోస్టుమార్టం, రుణమాఫీ రిపోర్టులతో కేసు వేస్తాం
ఆత్మహత్యలు గుర్తించి పరిహారం అందించేలా పోరాడతాం
ధైర్యంగా ఉండండి... పిల్లలను బాగా చదివించుకోండి
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జగన్ భరోసా
మూడోవిడత రైతు భరోసాయాత్రలో రెండోరోజు 3 కుటుంబాలకు పరామర్శ
(రైతు భరోసా యాత్ర నుంచి సాక్షిప్రతినిధి): ‘‘మాకు అన్యాయం జరిగిందయ్యా. రుణమాఫీ కాక అప్పులబాధతో మా ఆయన ఆత్మహత్య చేసుకుంటే అది రైతు ఆత్మహత్య కాదని ఆఫీసర్లు బెదిరిస్తున్నారు. డీఎస్పీ, ఆర్డీవో విచారణకు మా ఇంటికి వచ్చారు. ఇది రైతు ఆత్మహత్యకాదని, ఇతర కారణాలవల్ల ఆత్మహత్య చేసుకున్నారని మమ్మల్ని బెదిరించినట్లు మాట్లాడతాండారు’’ అని అనంతపురం జిల్లా వర్లి గ్రామానికి చెందిన రామాంజనమ్మ వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో చెప్పుకొని బోరుమన్నారు. జగన్ ఆమెను సముదాయించి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ‘‘గంగన్న కుటుంబానికి 4.60 ఎకరాల పొలం ఉంది. బ్యాంకులో రూ. 53 వేలు అప్పుంది. ఇందులో రూ.10,711 మాఫీ అయింది. అంటే ఆయన రైతని ప్రభుత్వం ఒప్పుకున్నట్లే కదా! పైగా అప్పుల బాధతో చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. పోస్టుమార్టం చేశారు. రికార్డు లున్నాయి. అలాంటప్పుడు అది ఎందుకు రైతు ఆత్మహత్య కాదు. నిజమైన రైతుల ఆత్మహత్యలను కూడా ప్రభుత్వం గుర్తించడం లేదు.
ఇలాంటివాటి వివరాలు సేకరించి కోర్టులో కేసువేస్తాం. ఇలాంటి వాటిపై గట్టిగా పోరాడి, పరిహారం వచ్చేలా చూస్తాం’’ అని జగన్ భరోసానిచ్చారు. వివరాలు సేకరించాలని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డికి సూచించారు. గంగన్న సోదరుడు తిమ్మప్ప వర్లి గ్రామానికి పదేళ్లపాటు సర్పంచ్‌గా కొనసాగారని, అలాం టి వ్యక్తి తమ్ముడికి ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులు కల్పించడం దారుణమన్నారు. గంగన్న కుమారుడు వరప్రసాద్ సెంట్రింగ్ పనిలో శిక్షణ తీసుకుంటే ఏదైనా కంపెనీలో ఉద్యోగం ఇప్పించేలా చూస్తామని చెప్పారు. మూడో విడత రైతు భరోసాయాత్రలో భాగంగా రెండోరోజు బుధవారం జగన్ మూడు కుటుంబాలను పరామర్శించారు. బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లిలో రెండురోజుల కిందట ఆత్మహత్య చేసుకున్న ఈరన్న అనే రైతు కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత కళ్యాణదుర్గం మండలం ముదిగల్లులో నారాయణప్ప కుటుంబాన్ని, వర్లిలో గంగన్న కుటుంబాన్ని పరామర్శించారు.
ఏ అధికారీ మా ఇంటికి రాలేదు..
బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లిలో ఈ నెల 20న ఈరన్న అనే రైతు ఉరి వేసుకుని చనిపోయాడు. జగన్ వారి ఇంట్లోకి వెళ్లగానే ఈరన్న భార్య మారెక్క, పిల్లలు ప్రహ్లాద, ప్రవీణ్‌లు బోరున విలపించారు. ‘‘సార్! మా నాన్న చనిపోయి రెండు రోజులైంది. ఏ అధికారీ మా ఇంటికి రాలేదు. ఆత్మహత్యను విచారించలేదు. మీరే మొదటగా మా ఇంటికి వచ్చారు’’ అని ఈరన్న పెద్దకుమారుడు ప్రహ్లాద చెప్పాడు. పొలం సాగు, బ్యాంకు అప్పు, సబ్సిడీ వివరాలను జగన్ ఆరా తీశారు.
తన భర్త, మరిది కలిసి సొంతపొలం ఏడెకరాలు, కౌలుపొలం 12 ఎకరాలు సాగు చేశారని మారెక్క చెప్పారు. బోర్లు పడక, నీళ్లురాక రూ. 5 లక్షల అప్పయిందని, ప్రభుత్వం నుంచి ఏ సాయం అందలేదని తెలిపారు. తండ్రి అప్పులు తీర్చేందుకు ప్రవీణ్ ఐటీఐ చదువు మధ్యలో ఆపివేసి బెంగళూరుకు కూలిపనికి వెళుతున్నాడని తెలిసి జగన్ చలించిపోయారు. వెంటనే కాలేజీకి వెళ్లి చదుకోవాలని సూచించారు. చదువుకు తాము భరోసాగా ఉంటామని, నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ చూసుకుంటారని చెప్పారు. పోలీసులతో ఎఫ్‌ఐఆర్ చేయించి ఈ కుటుంబానికి ప్రభుత్వ సాయం అందేలా చూడాలని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డికి సూచించారు.
పూర్తి పరిహారం ఇవ్వలేదు
కళ్యాణదుర్గం మండలం ముదిగల్లులో ఆత్మహత్య చేసుకున్న నారాయణప్ప కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. ‘‘సార్... నా భర్త చనిపోయి పది నెలలవుతోంది. రైతు ఆత్మహత్యగా ప్రభుత్వం గుర్తించింది. రూ.ఐదు లక్షల పరిహారం ఇస్తామన్నారు. రూ.మూడు లక్షలు ఇచ్చామని చెబుతాండారు. అందులో రూ.1.50 లక్షలు ఊళ్లో పెద్దమనుషుల ద్వారా ప్రైవేటు అప్పులు చెల్లించారు. మరో రూ.1.50 లక్షలు బ్యాంకులో వేశారంట. కానీ మాకైతే ఏం తెలీదుసార్! ఏడాదికి రూ.50 వేలు ఇస్తామంటున్నారు సార్’’ అని నారాయణప్ప భార్య చంద్రమ్మ తెలిపారు.
కచ్చితంగా పరిహారం మొత్తం అందేలా ప్రభుత్వంతో పోరాడతామని జగన్ ఆమెకు భరోసానిచ్చారు. పిల్లల చదువు బాధ్యత నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్‌కు అప్పగించారు. అనంతరం జగన్ కళ్యాణదుర్గంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి ఫాంహౌస్‌లో బస చేశారు. అంతకుముందు పట్టణంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. వాల్మీకి విగ్రహానికి పూలమాల వేశారు. రెండోరోజు యాత్రలో ఎంపీ మిథున్‌రెడ్డి, పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.