రూ. 5 లక్షల పరిహారం అందేవరకు పోరాడతాం
⇒రైతు ఆత్మహత్యలపై విపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి
⇒మా ప్రభుత్వం వచ్చాక తొలి సంతకం పరిహారం ఫైల్‌పైనే చేస్తా
⇒రైతు భరోసాయాత్రలోరైతు కుటుంబాలకు హామీ
⇒ఐదోరోజు మూడు రైతు కుటుంబాలకు పరామర్శ
(రైతు భరోసా యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేకప్రతినిధి): అప్పుల బాధ తాళలేక రైతన్న ఆత్మహత్య చేసుకుంటే.. పోస్టుమార్టం రిపోర్టు ఆత్మహత్యేనని చెబుతుంటే.. ప్రభుత్వం కొర్రీలు పెడుతూ రూ.5 లక్షల పరిహారం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.ఐదు లక్షలు పరిహారం అందేవరకూ పోరాడతామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే తమ ప్రభుత్వం వచ్చాక ఎక్స్‌గ్రేషియాకు సంబంధించిన ఫైల్‌పైనే తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. ఐదోరోజు రైతు భరోసాయాత్ర పెనుగొండ, మడకశిర నియోజకవర్గాల్లో శనివారం కొనసాగింది. పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని పి.కొత్తపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు లక్ష్మన్న, మడకశిర మండలంలోని టి.డి. పల్లి గ్రామంలో ఆనందప్ప, హెచ్‌ఆర్ పాళ్యం గ్రామంలో ఓబన్న కుటుంబాలను జగన్ పరామర్శించారు.