జైలు వైభవం | Gollapudi writes jeevana column on Prison life | Sakshi
Sakshi News home page

జైలు వైభవం

Published Thu, Jul 27 2017 1:32 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM

జైలు వైభవం

జైలు వైభవం

విశ్లేషణ
ఆవిడ ఆనందంగా ఉన్నందుకు కాదు, 2 కోట్లు ఇచ్చినందుకు కాదు, ఇచ్చిందని చెప్పిన పోలీసు డిప్యూటీ ఇనస్పెక్టర్‌ జనరల్‌ డి. రూపని కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగారు బదిలీ చేశారు. ఇది కాంగ్రెసు ఘనత.

జైళ్లు మనకు దేవాలయాలు. మన దేవుడు జైల్లో పుట్టాడు. ఆనాటి మహానుభావులంతా జైళ్లలో ఉన్నారు. ఒక్క పూనా యెరవాడ జైలులోనే మహాత్మా గాంధీ, నెహ్రూ, తిలక్, సుభాశ్‌చంద్ర బోస్, సావర్కర్‌ ప్రభృతులు ఉన్నారు. ఇప్పుడూ ఆ వైభవం కొనసాగుతోంది. ప్రస్తుతం ఓం ప్రకాశ్‌చౌతాలా గారు, పండిత్‌ సుఖ్‌రాంగారు జైల్లో ఉన్నారు. మొన్నటిదాకా లాలూగారు, అంతకు ముందు కనిమొళిగారు, ఏ. రాజా గారు ఉండి వచ్చారు. అది నిజంగా శిక్షా? లేక విశ్రాంతా? లేక భోగమా? మనకి తెలీదు. అదే ఆయా పెద్దమనుషులకు పెట్టుబడి. అవినీతి ఆఫీసర్లకు రాబడి.

ఇలాంటి సౌకర్యాలు లోగడ అనుభవించినవారున్నారు. జెస్సికా లాల్‌ని కాల్చి చంపిన మనూశర్మకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కాని వారు చుట్టపు చూపుగానే జైలుకి వెళ్లి, మిగతా సమయాల్లో బయటే ఉన్నారు. వారి తల్లికి ఆరోగ్యం బాగాలేదనే మిషతో బయటికి వచ్చారు. కాని వారి తల్లిగారు చండీగఢ్‌లో మహిళా క్రికెట్‌ జట్టుతో గడుపుతూండగా, మనూశర్మగారు ఢిల్లీలో నైట్‌క్లబ్బుల్లో గడుపుతూ, పోలీసు కమిషనర్‌గారి కొడుకుతో తగాదా పెట్టుకున్న సంగతి వెలుగులోకొచ్చింది. అనుమతి ఇచ్చినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌గారి మీద విమర్శలు వచ్చాయి.

జైలు శిక్ష పడగానే ఎటువంటివారికయినా హఠాత్తుగా గుండె నొప్పి వస్తుంది. లేదా కడుపు నొప్పి వస్తుంది. డాక్టర్లు తప్పనిసరిగా ఆసుపత్రికి తరలించాలంటారు. అయిదు నక్షత్రాల ఆసుపత్రిలో, చలువ గదుల్లో, ఇద్దరు ముగ్గురు అందమయిన నర్సులు సేవలు చేస్తూండగా వారు సేదదీర్చుకుంటారు. ఇందుకు గొప్ప ఉదాహరణ– నితీశ్‌ కటారాను చంపిన వికాస్‌ యాదవ్, విశాల్‌ యాదవ్‌. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించాల్సిన వీరిద్దరూ ఇలాంటి సుఖాల్నే అనుభవించారు. వికాస్‌ యాదవ్‌ 98 సార్లు మాత్రమే విడిది చేశారు. విశాల్‌ యాదవ్‌ గారి అనారోగ్యం ఇంకా బలమైనది. వారు కేవలం 105 సార్లు మాత్రమే విడిది చేశారు. నిక్షేపం లాంటి కొడుకుని పోగొట్టుకున్న నీలం కటారా ఈసారి కోర్టుని–శిక్ష వేయాలని కాదు, వేసిన శిక్షని అమలు జరపాలని ఆశ్రయించారు. ఆ తల్లి ఆర్తిని గ్రహించిన సుప్రీం కోర్టు ఈసారి మన ఖరీదయిన ‘రోగులకు’ 30 ఏళ్లుగా శిక్షను పెంచింది. ఇవన్నీ మన జైలు ఆఫీసర్ల అవినీతిని ఆకాశంలో నిలిపే కథలు.

ప్రస్తుతం జైళ్లలో ఇలాంటి వైభవం కొనసాగుతోందనడానికి నిదర్శనం శశికళగారు రాజభోగాలతో కర్ణాటక జైల్లో ఉండడం. అందుకు వారు కేవలం 2 కోట్లు ఖర్చు చేశారని మనకు తెలిసింది. వారు నలుగురిలాగా సాదాసీదా ఖైదీ. అయినా ఆవిడకి 5 వరస గదుల వసతిని జైలు పెద్దలు కల్పించారు. మధ్య గదిలో ఉంటూ మిగతా గదుల్లో ఆమె సరంజామా పెట్టుకుంటారు. ప్రత్యేకమైన వంటలు అమెకి చేయిస్తారు. హాయిగా నైటీలు వేసుకుంటారు. ఎవరైనా చూడడానికి వచ్చినప్పుడు సిల్కు దుస్తులు– చుడీ దార్లు వేస్తారు. టేపుల దుకాణం నడుపుకునే ఆవిడకు ఇంత డబ్బు ఎక్కడిది? జయలలిత డబ్బు ఆవిడ ఖాతాలోకి ఎంత చేరింది? పదవుల కోసం కొట్టుకుంటున్న ప్రస్తుత పార్టీ నాయకులకు ఇది పిడకల వేట.

ఏతావాతా–ఆవిడ ఆనందంగా ఉన్నందుకు కాదు, 2 కోట్లు ఇచ్చినందుకు కాదు, ఇచ్చిందని చెప్పిన పోలీసు డిప్యూటీ ఇనస్పెక్టర్‌ జనరల్‌ డి. రూపని కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగారు బదిలీ చేశారు. ఇది కాంగ్రెసు ఘనత. ఎన్నోసారి? గత 17 సంవత్సరాలలో 26వ సారి. అంటే ప్రతీ ఏడెనిమిది నెలలకి ఒక్కో ట్రాన్స్‌ ఫర్‌ జరిగింది. లోగడ ఇలాంటి అడ్డదిడ్డమయిన ‘నీతి’ని పట్టుకు వేలాడినందుకు ఒకానొక ఐయ్యేయస్‌ ఆఫీసరు–ఖేమ్కాగారిని కాంగ్రెసు నాయకత్వమే బదిలీలు చేసి చేతులు కడుక్కుంది. ఎన్నిసార్లు? 27 సంవత్సరాలలో 47 సార్లు.

ఆ మధ్య దుర్గా నాగ్‌పాల్‌ అనే సరికొత్త ఐయ్యేయస్‌కి ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్‌ ప్రభుత్వం అధికారం ‘రుచి’ని చూపి నోరు మూయించిన కథ మనం చదువుకున్నాం. ఈ దిక్కుమాలిన నీతిపరులు మరీ శ్రుతి మించితే? ఏం జరుగుతుందో లోగడ ధనంజయ్‌ మహాపాత్రా గారి ద్వారా అవినీతిపరులు నిరూపించారు.

చివరిగా డి. రూప అన్నమాట: ‘అవినీతి జరిగినప్పుడు–నోరు విప్పకపోతే–ఆ అవినీతికి పరోక్షంగా మనం మద్దతు ఇచ్చినట్టే.’
వ్యవస్థని ఎదిరించడానికి దమ్ము కావాలి. చిత్తశుద్ధి కావాలి. అకళంకమైన శీల సంపద కావాలి. అడ్డదారిన డబ్బో, పదవో దక్కించుకోవాలనే దేబ రింపు గల అవకాశవాదులకు ఇవన్నీ గగన కుసుమాలు. ఖేమ్కాలు, రూపలు, ధనంజయ్‌లూ అరుదుగా కనిపిస్తారు. దుర్గా నాగ్‌పాల్‌లు తొలిరోజుల్లోనే మూగపోతారు. ప్రతీ తరానికీ మహాత్ముడు పుట్టడు. నీతి నిప్పు. పాటించిన వారికి అది వెలుగు. తేజస్సునిస్తుంది. పాటించని వారిని కాలుస్తుంది.

 

- గొల్లపూడి మారుతీరావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement