ఐస్‌క్రీం అమ్ముతున్న నాగరాజు
ఓదెల(పెద్దపల్లి): సమసమాజ నిర్మాణం కోసమంటూ మావోయిస్టు పార్టీలో చేరి, నాలుగేళ్లు పని చేశాడు. ఆ తర్వాత అనుకోకుండా అరెస్టయ్యి, జైలు జీవితం గడిపాడు ఓదెల గ్రామానికి చెందిన కోండ్ర నాగరాజు అలియాస్ రమాకాంత్. ప్రస్తుతం అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఓదెలలో దళిత సామాజికవర్గానికి చెందిన నాగరాజు ఐదోతరగతి వరకు చదువుకున్నాడు. జీతానికి పశువుల కాపరిగా పనిచేస్తున్న సమయంలో మావోయిస్టులతో పరిచయం ఏర్పడింది. వారి పాటలకు, కార్యకలాపాలకు ఆకర్షితుడై, 2006లో మావోయిస్టు పార్టీలో చేరాడు.
తర్వాత ఏటూరునాగారం, మహదేవపూర్, గుండారం, నర్సంపేట్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలలో దళ నేతగా, ఏరియా కమిటీ బాధ్యుడిగా పని చేశాడు. ప్రభుత్వం నాగరాజు తలపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించింది. మావోయిస్టు పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న అతనికి మహారాష్ట్రలో పార్టీ నిర్మాణ బాధ్యతలను పైస్థాయి నాయకులు అప్పగించారు. 2010 జనవరి 27న మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీ శివశంకర్ ఆధ్వర్యంలో పోలీసులు నాగరాజును అరెస్టు చేశారు. రెండేళ్లు జైలు జీవితం గడిపిన అనంతరం స్వగ్రామం ఓదెలకు వచ్చాడు.
అప్పటినుంచి ఇక్కడే జీవిస్తున్నాడు. గ్రామంలో ఎలాంటి ఆస్తిపాస్తులు లేని నాగరాజు బీపీ, గుండె సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ప్రస్తుతం ద్విచక్రవాహనంపై ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో ఐస్‌క్రీం అమ్ముతున్నాడు. తాను అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నానని, ఇంట్లో తనతో భార్య, తల్లి, తమ్ముడు ఉన్నాడని తెలిపాడు. ప్రభుత్వం కనికరించి, దళితబంధు పథకం మంజూరు చేస్తే సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిలకు జీవితాంతం రుణపడి ఉంటానని వేడుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment