Prison life
-
నాడు దళంలో.. నేడు సమస్యల్లో.. కేసీఆర్‌కు కామ్రేడ్ రమాకాంత్ వేడుకోలు
ఓదెల(పెద్దపల్లి): సమసమాజ నిర్మాణం కోసమంటూ మావోయిస్టు పార్టీలో చేరి, నాలుగేళ్లు పని చేశాడు. ఆ తర్వాత అనుకోకుండా అరెస్టయ్యి, జైలు జీవితం గడిపాడు ఓదెల గ్రామానికి చెందిన కోండ్ర నాగరాజు అలియాస్ రమాకాంత్. ప్రస్తుతం అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఓదెలలో దళిత సామాజికవర్గానికి చెందిన నాగరాజు ఐదోతరగతి వరకు చదువుకున్నాడు. జీతానికి పశువుల కాపరిగా పనిచేస్తున్న సమయంలో మావోయిస్టులతో పరిచయం ఏర్పడింది. వారి పాటలకు, కార్యకలాపాలకు ఆకర్షితుడై, 2006లో మావోయిస్టు పార్టీలో చేరాడు. తర్వాత ఏటూరునాగారం, మహదేవపూర్, గుండారం, నర్సంపేట్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలలో దళ నేతగా, ఏరియా కమిటీ బాధ్యుడిగా పని చేశాడు. ప్రభుత్వం నాగరాజు తలపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించింది. మావోయిస్టు పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న అతనికి మహారాష్ట్రలో పార్టీ నిర్మాణ బాధ్యతలను పైస్థాయి నాయకులు అప్పగించారు. 2010 జనవరి 27న మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీ శివశంకర్ ఆధ్వర్యంలో పోలీసులు నాగరాజును అరెస్టు చేశారు. రెండేళ్లు జైలు జీవితం గడిపిన అనంతరం స్వగ్రామం ఓదెలకు వచ్చాడు. అప్పటినుంచి ఇక్కడే జీవిస్తున్నాడు. గ్రామంలో ఎలాంటి ఆస్తిపాస్తులు లేని నాగరాజు బీపీ, గుండె సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ప్రస్తుతం ద్విచక్రవాహనంపై ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో ఐస్‌క్రీం అమ్ముతున్నాడు. తాను అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నానని, ఇంట్లో తనతో భార్య, తల్లి, తమ్ముడు ఉన్నాడని తెలిపాడు. ప్రభుత్వం కనికరించి, దళితబంధు పథకం మంజూరు చేస్తే సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిలకు జీవితాంతం రుణపడి ఉంటానని వేడుకుంటున్నాడు. -
గగుర్పాటు కలిగించే ‘గ్యాంగ్‌స్టర్’ చీకటి కోణం.. కానీ ఇప్పుడు..
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం)/తూర్పుగోదావరి: ప్రతాప్‌సింగ్.. ఒకప్పుడు గ్యాంగ్‌స్టర్.. షార్ప్ కిల్లర్ కూడా. జైలు జీవితం అతడిలో పశ్చాత్తాపాన్ని కలిగించింది. పరివర్తన చెందిన అతడు ఇప్పుడు యోగా గురువుగా మారి ఎందరికో యోగా నేర్పుతూ.. తనలా ఎవరూ కాకూడదనే సందేశాన్ని ఇస్తున్నాడు. అతడి గతాన్ని పరికిస్తే.. ఉత్తరాఖండ్‌లోని ఫితోడ్ గఢ్ గ్రామంలోని ఉన్నత కుటుంబంలో జన్మిచాడు ప్రతాప్‌సింగ్. తండ్రి ఆర్మీ అధికారి. అన్న కూడా ఆర్మీలో చేరి అధికారి స్థాయికి ఎదిగాడు. తాను కూడా ఆర్మీలో చేరాలని ప్రతాప్‌సింగ్ కలలుకన్నా నెరవేరలేదు. చదవండి: అమెరికా అబ్బాయికి, ఆంధ్రా అమ్మాయికి నిశ్చితార్థం పోలియో వల్ల వచ్చిన అవిటితనం కారణంగా కలని నెరవేర్చుకోలేకపోయాడు. దానికి తోడు సవితి తల్లి సూటిపోటి మాటల్ని భరించలేక ఇంటినుంచి పారిపోయి చిన్నతనంలోనే ఢిల్లీ చేరుకున్నాడు. ఓ గ్యాంగ్‌స్టర్ వద్ద చేరి 15 సంవత్సరాలకే దోపిడీలు, కిడ్నాప్‌లు చేశాడు. ప్రతాప్ సింగ్ గ్యాంగ్ ఆగడాల కారణంగా ఢిల్లీ కల్యాణ్‌పూర్‌లో అడుగుపెట్టాలంటే జనం భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎవరినైనా చంపాలనుకుని సుపారీ తీసుకుంటే వారికి చావు మూడినట్టే. అతీ సమీపానికి వెళ్లి గురి చూసి కాల్చి చనిపోయాడనుకుని నిర్ధారించుకున్న తరువాతే ఆ గ్యాంగ్ అక్కడ నుంచి వెళ్తుందనే పేర్కొంది. జైలులోనే పరివర్తన పదహారు హత్య కేసులతో సంబంధం ఉన్న ప్రతాప్‌సింగ్ ఏలూరు జిల్లా పినకడిమిలో జరిగిన హత్య కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 7 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. 2017లో ఖైదీలలో పరివర్తన తీసుకుని రావడానికి ప్రణవ సంకల్ప సమితి ఆధ్వర్యంలో యోగా నేర్పించారు. అందులో ఇంటర్మీడియెట్, టెన్త్ చదివిన 30 మందిని ఎంపిక చేశారు. 6వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న ప్రతాప్‌సింగ్ తాను యోగా నేర్చుకుంటానని పట్టుపట్టడంతో అతడికీ యోగా నేర్పించారు. 9 నెలల శిక్షణలో ధ్యానం, జపం నేర్చుకుని పరివర్తన చెందాడు. చెడు మార్గాన్ని వీడి నూతన జీవితం వైపు ప్రయాణిస్తానని, తిరిగి ఎప్పుడూ అటూవైపు వెళ్లనని దృఢంగా నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్టుగానే శిక్షా కాలం పూర్తయ్యాక నలుగురికీ యోగా నేర్పుతూ అదర్శప్రాయంగా ఉంటున్నాడు. గుంటూరులో కలెక్టర్ తన యోగా విన్యాసాలను చూసి మెచ్చుకున్నారని.. తాను గ్యాంగ్‌స్టర్‌ని అయినా.. తనలో వచ్చిన మార్పు చూసి కలెక్టర్ మెచ్చుకోవడం కంటే సంతృప్తి తనకు ఏముంటుందని ప్రతాప్‌సింగ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అనర్థాలను వివరిస్తూ.. ఇప్పుడు యోగా శిక్షకుడుగా పలువురికి యోగా నేర్పుతూ తనలా ఎవరి జీవితం చీకటి కోణంలోకి వెళ్లకూడదని ప్రతాప్‌సింగ్ హితవు చెబుతున్నాడు. యోగాతోపాటు చెడు వ్యసనాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ పలువురిలో పరివర్తన తీసుకొస్తున్నాడు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల వేళ రాజమహేంద్రవరంలోని అనం కళా కేంద్రంలో మంగళవారం ప్రణవ యోగ సంకల్ప సమితి వ్యవస్థాపకుడు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో యోగా గురువులను సత్కరించారు. ఇదే కార్యక్రమంలో ప్రతాప్‌సింగ్‌ను నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్‌కుమార్ సన్మానించారు. -
పది రోజుల్లో చిన్నమ్మ విడుదల!
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ పది రోజుల్లో జైలు నుంచి విడుదల య్యే అవకాశాలున్నట్టు ఆమె న్యాయవాది రాజా చెందూర్ పాండియన్ ధీమా వ్యక్తం చేశారు. జరిమానా మొత్తం రూ.10 కోట్ల 10 వేలు సిద్ధం చేశామని తెలిపారు. అక్రమాస్తుల కేసులో శిక్ష ముగించుకుని జనవరిలో శశికళ జైలు నుంచి విడుదల అవుతారని ఇప్పటికే సంకేతాలు వెలుడిన విషయం తెలిసిందే. తన న్యాయవాది రాజాచెందూర్ పాండియన్‌కు శశికళ ఆదివారం ఓలేఖ కూడా రాశారు. (శశికళ వ్యూహం.. పది కోట్ల జరిమానాకు రెడీ) ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ న్యాయవాది గురువారం మీడియాతో మాట్లాడారు. పది రోజుల్లో చిన్నమ్మ జైలు నుంచి బయటకు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చిన్నమ్మ తనకు రాసిన లేఖలోని అంశాల ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నట్టు పేర్కొన్నారు. చిన్నమ్మకు కోర్టు విధించిన రూ.10 కోట్ల 10 వేలు జరిమానాను సిద్ధం చేసినట్టు తెలిపారు. కర్ణాటక జైళ్ల నిబంధనల మేరకు శిక్ష అనుభవించే వారికి నెలలో 3 రోజులు సత్ప్రవర్తన పరిధిలో ఉంటుందని, చిన్నమ్మ కు 129 రోజుల శిక్షా కాలం తగ్గుతుందన్నారు. ఇప్పటికే చిన్నమ్మ 43 నెలలు జైల్లో ఉన్నారని, మరో పది రోజు ల్లో ఆమె విడుదలయ్యేందుకు అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం కర్ణాటకలో కోర్టులకు దసరా సెలవులని, ఈనెల 26న కోర్టులు పునః ప్రారంభం కానున్నా యని పేర్కొన్నారు. ఈ క్రమంలో మంగళ లేదా బుధవారం మంచి సమాచారం వెలువడే అవకాశం ఉందని చెప్పారు. చిన్నమ్మ జైలు నుంచి ముందు గానే విడుదల అవుతారని ఇప్పటికే తాను పేర్కొన్నానని, ఇది జరిగి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు. (ఎన్నికల్లో పోటీకి శశికళ వ్యూహరచన) -
'10 కోట్ల చెల్లింపునకు సిద్ధంగా ఉండండి'
సాక్షి, చెన్నై : చట్ట ప్రకారం కర్ణాటక జైళ్ల శాఖ మంచి నిర్ణయం తీసుకుంటుందని, జరిమానా చెల్లింపునకు సిద్ధంగా ఉండాలని న్యాయవాది రాజాచెందూర్ పాండియన్‌కు చిన్నమ్మ శశికళ లేఖ రాశారు. అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. శిక్షాకాలం 2021 జనవరిలో ముగియనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆమెతో ములాఖత్ అయ్యేందుకు సన్నిహితులు, న్యాయవాదులకు కర్ణాటక అనుమతి ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో శశికళ తన న్యాయవాదికి రాసిన లేఖ సోమవారం వెలుగులోకి వచ్చింది. (సీఎంని పరామర్శించిన ఎంకే స్టాలిన్) లేఖలో ఏముందంటే.. భగవంతుడి దయతో తాను బాగానే ఉన్నానని చిన్నమ్మ పేర్కొన్నారు. తమిళనాడును కరోనా వణికిస్తోందని, దాని ప్రభావం పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో రాష్ట్రం కరోనా నుంచి పూర్తిగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు వివరించారు. మార్చి నుంచి తనతో ములాఖత్‌లను కర్ణాటక జైళ్ల శాఖ నిలుపుదల చేసిందని, ఎప్పుడు పునరుద్ధరిస్తుందదో తెలియదన్నారు. తన విడుదల విషయాన్ని ప్రస్తావిస్తూ జైళ్ల శాఖ త్వరలో చట్ట ప్రకారం మంచి నిర్ణయం తీసుకుంటుందని, మంచే జరుగుతుందని భావిస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. 10 కోట్ల రూపాయల జరిమానా చెల్లింపునకు సిద్ధంగా ఉండాలని, అలాగే కోర్టులో పిటిషన్ దాఖలు, ఇతర న్యాయపరమైన వ్యవహారాలపై ఢిల్లీలోని సీనియర్ న్యాయవాదుల్ని సంప్రదించాలని ఆదేశించారు. దినకరన్(అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత)తో కలిసి ముందుకు సాగాలని కోరారు. -
200 మంది ఖైదీలు కనిపించడం లేదు!
సాక్షి, చెన్నై: జైలు జీవితం ఓ శాపమైతే...పెరోల్ పొందడం ఖైదీలకు ఒక వరం. ఈ వరాన్ని వరప్రసాదంగా స్వీకరించిన ఖైదీలు జైలుకు టాటా..బైబై అంటూ చెక్కేస్తున్నారు. గత నాలుగు దశాబ్దాల కాలంలో పెరోల్‌పై బయటకు వచ్చిన 200 మందికి పైగా ఖైదీలు కనపడకుండా పోయారంటూ జైళ్లశాఖ లబోదిబోమంటోంది. మంత్రుల సిఫార్సుతో పెరోల్ పొందినవారే వీరిలో అధికం కావడంతో మింగలేక, కక్కలేక బావురుమంటున్నారు. పరారీలో ఉన్న పెరోల్ ఖైదీలను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. తమిళనాడులో 9 కేంద్ర కారాగారాలుండగా, వీటిల్లో 13వేల మంది ఖైదీలున్నారు. వీరిలో 2,500లకు పైగా శిక్షాఖైదీలు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో యావజ్జీవశిక్ష అనుభవిస్తున్న నళినీ పెరోల్ పొంది మరలా జైల్లోకి రాగా, పేరరివాళన్, రాబర్ట్‌పయాస్ ప్రస్తుతం పెరోల్‌పై బయటే ఉన్నారు. న్యాయస్థానం, జైళ్లశాఖ ద్వారా ఖైదీలు పెరోల్ పొందుతున్నారు. బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలి శశికళ.. తన భర్త నటరాజన్ అనారోగ్యానికి గురైనపుడు, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పెరోల్‌పై చెన్నైకి వచ్చి వెళ్లారు. కేరళలో పోలీసు కాల్పుల్లో మరణించిన మావోయిస్ట్ మణివాచకం భార్య కలా, సోదరి చంద్రలకు సైతం కోర్టు పెరోల్ మంజూరు చేసింది. శిక్షా ఖైదీలైనా, విచారణ ఖైదీలైనా జైల్లో వారి స్రత్పవర్తనను అనుసరించి పెరోల్‌ను మంజూరు చేయడం సహజం. ఒక ఏడాది కాలంలో 15 రోజులపాటూ పెరోల్ మంజూరు చేసే అధికారాన్ని జైలు సూపరింటెండెంట్ కలిగి ఉన్నారు. జైళ్లశాఖ డీఐజీ రెండేళ్లకు నెలరోజులు, ప్రభుత్వమే అనుకుంటే ఎన్నిరోజులైనా పెరోల్ మంజూరు చేయవచ్చు. ఖైదీల కుటుంబసభ్యుల్లో పెళ్లి, గృహప్రవేశం వంటి శుభకార్యాలు, పొంగల్, దీపావళి ముఖ్యమైన పండుగలు, సమీప బంధువులకు తీవ్ర అనారోగ్యం, మరణం వంటి అశుభాలు చోటుచేసుకున్నా పెరోల్ మంజూరు చేస్తున్నారు. జైల్లో ఉండగా తీవ్ర అనారోగ్యానికి గురై, మరో ప్రయివేటు ఆసుపత్రిలో చేరిస్తే కోలుకుంటారని జైలు అధికారులు భావించిన పక్షంలో కూడా పెరోల్ మంజూరు చేస్తారు. ఈ పెరోల్ రోజులను శిక్షాకాలం నుంచి మినహాయించరు. ఐదేళ్ల శిక్షను అనుభవిస్తున్న ఖైదీ నెలరోజులు పెరోల్ పొందినా ఐదేళ్ల శిక్షాకాలాన్ని పూర్తిచేయాల్సి ఉంటుంది. పెరోల్లో ఉన్నపుడు పారిపోకుండా ఉండేందుకు సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ప్రతిరోజూ సంతకం చేయాల్సి ఉంటుంది. లేకుంటే పోలీసు బందోబస్తు పెడతారు. ఏ కారణం చేత పెరోల్ మంజూరైందో ఖైదీ దానికే పరిమితం కావాలి, మరో శుభం, లేదా అశుభ కార్యాలకు వెళ్లకూడదు. ఈ నిబంధనలను మీరినట్లయితే పెరోల్‌ను రద్దుచేయడంతోపాటూ అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. పెరోల్‌పై ఛలో ఛలో: ఇలా అనేక కారణాలతో పెరోల్‌పై విడుదలైన ఖైదీల్లో తిరిగి జైలుకు చేరుకోని సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. కొంతకాలం క్రితం సేలం జైలు నుంచి పెరోల్‌పై బయటకు వెళ్లిన ఇద్దరు ఖైదీలు జైలుకు మరలా రాలేదు. వీరిద్దరిలో ఒకరు మాత్రమే పట్టుబడగా మరో వ్యక్తి ఆచూకీ తెలియలేదు. 1982 నుంచి ఈ ఏడాది వరకు 200 మంది ఖైదీలకు పైగా పెరోల్‌పై బయటకు వచ్చి పత్తాలేకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. జైలు అధికారులను కాదని ప్రభుత్వం ద్వారా పెరోల్ మంజూరు చేయించుకున్న ఖైదీలే వీరిలో ఎక్కువగా ఉండడం గమనార్హం. దీంతో ప్రభుత్వ సిఫార్సుతో పెరోల్ మంజూరు చేయడం నిలిచిపోగా జైలు అధికారులు, న్యాయస్థానానికే పరిమితం చేశారు. దీంతో పెరోల్ పొందే ఖైదీల సంఖ్య తగ్గిపోయింది. పెరోల్ ఖైదీలు పరారైతే జైలు అధికారులు అతడి నివాసానికి సమీపంలోని పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇస్తున్నారు. అయితే పెరోల్ ఖైదీల పరారీ కేసులపై పోలీసులు పెద్దగా ఆసక్తిచూపకపోవడంతో వారు పట్టుబడడం లేదు. వారు ఎక్కడ దాక్కుని ఉన్నారనే సమాచారం కూడా అధికారులకు దొరకలేదు. దీంతో ఇలా పారిపోయిన పెరోల్ ఖైదీలను పట్టుకునేందుకు ప్రభుత్వమే ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని జైలు అధికారులు కోరుతున్నారు. ఈ విషయమై జైలు అధికారులు మాట్లాడుతూ, జైళ్లశాఖను చూసే మంత్రుల సిఫార్సుతో పెరోల్ పొందినవారే ఎక్కువగా పారిపోతున్నారని తెలిపారు. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్న తరువాత పెరోల్‌కు సిఫార్సు చేయడాన్ని మంత్రులు నిలిపివేశారని అన్నారు. ప్రస్తుతం శిక్షాఖైదీలకు మాత్రమే పెరోల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. -
శశికళ జైలు జీవితం ఏడాది పూర్తి..
ఇప్పటికే అనేక చిక్కుల్లో పీకల్లోతుల్లో మునిగి ఉన్న చిన్నమ్మ మెడకు బినామీ ఉచ్చుబిగుసుకుంటోంది. నకిలీ సంస్థలు, అక్రమంగా విదేశీ మారకద్రవ్యాల వ్యవహారం బైటపడింది. అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ బంధువులకు సంబంధించిన రూ.380 కోట్ల విలువైన బినామీ ఆస్తులను ఆదాయపు పన్నుశాఖ జప్తు చేసిన సంగతి బుధవారం వెలుగుచూసింది. జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు కదలడంతో విషయంబైటపడింది. ఐటీ అధికారి ఒకరు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత, శశికళ బంధువులు, మిత్రులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై గత ఏడాది ఐటీ శాఖ భారీ ఎత్తున ఆకస్మికదాడులు నిర్వహించింది. జయ, శశికళ పేర్లతో అనేక బినామీ సంస్థలు పనిచేస్తున్నట్లు అధికారుల దాడులతో వెలుగుచూసింది. వీటిల్లో అనేక సంస్థలను చెన్నై టీనగర్‌లోని ఒక అపార్టుమెంటును చిరునామాగా చూపి ప్రారంభించారు. పైగా వీటిల్లో కొన్ని కంపెనీలు పేరుకు మాత్రమే పరిమితమై ఆస్తులను కొనుగోలు చేయడం వంటి కార్యకలాపాలకు మాత్రమే పాల్పడ్డారు. ఇతర వ్యాపార లావాదేవీలు, ఐటీ రిటరŠన్స్ చేసిన దాఖలు లేవు. నల్లధనం లెక్కలు చూపేందుకే ఇలాంటి సంస్థలను స్థాపించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సదరు ఆస్తులను, బ్యాంకు ఖాతాలను ఐటీ అధికారులు గతంలోనే జప్తు చేసిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు కొనసాగింపుగా చెన్నై ఎంఏఆర్సీ నగర్‌లోని ఆది ఎంటర్‌ప్రైజెస్‌కు సొంతమైన రూ.380 కోట్ల విలువైన 4.3 ఎకరాల ఫిర్హెవెన్ ఎస్టేట్‌ను ఇటీవల జప్తు చేశారు. ప్రస్తుత మార్కెట్ «ధర కాకుండా 2015లో ఆ ఎస్టేట్ కొనుగోలు విలువనే అధికారులు జప్తులో లెక్క చూపారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా పడిపోయి ఉన్న సమయంలోనే ఇంతపెద్ద మొత్తం పెట్టి కొనుగోలు చేయడంపై అధికారులు విస్తుపోయారు. గుజరాత్‌కు చెందిన సునీల్ కెట్పాలియా, మనీష్ బార్మర్ అనే వ్యక్తుల నుంచి ఆ ఎస్టేట్‌ను కొనుగోలు చేసినట్లు తెలిసింది. గత ఏడాది ఐటీ దాడుల తరువాత నుంచి ఇప్పటి వరకు జరిపిన విచారణలో ఇదే ఎస్టేట్‌కు సంబంధించి రూ.70 కోట్లు జప్తు చేసి ఉన్నారు. ఆది సంస్థ పెద్ద ఎత్తున వ్యాపారం ఏమీ చేయకుండానే కోట్లాది రూపాయల లావాదేవీలు నిర్వహించింది. మారిషస్ దేశంలోని పసిట్టోలోస్ ఇన్వెస్టిమెంట్ లిమిటెడ్ నుంచి రూ.250 కోట్లు విదేశీమారక ద్రవ్యంగా ఆది సంస్థకు ముట్టింది. ఈ నిధులను వెచ్చించే ఆది సంస్థ చెన్నైలో ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేసింది. అలాగే సునీల్ కెట్పాలియా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఎడిసన్ ఎనర్జీ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ ఆది సంస్థలో రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు అధికారులు కనుగొన్నారు. ఎడిసన్ ఎనర్జి సంస్థలో మరో డైరెక్టర్‌గా వ్యక్తి అన్నాడీఎంకేలోని ఒక ప్రముఖ నేత సన్నిహితుడిని పరోక్షంగా శశికళను ఉద్దేశించి ఐటీ అధికారులు తెలిపారు. సునీల్, మనీష్ కలిసి 2015లో పెరంబూరు బేరక్స్ రోడ్డులో లాండ్‌మార్క్స్ గ్రూపునకు చెందిన ఒక భారీ అపార్టుమెంటు నిర్మాణాన్ని చేపట్టారు. ఇలా మనీష్ సుమారు 12 బినామీ సంస్థలను నిర్వహించి భారీ ఎత్తున నల్లధనం కూడగట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. అలాగే సునీల్ కెట్పాలియాకు ఎందరో అన్నాడీఎంకే నేతలు, మాజీ మంత్రులతో సంబంధాలు ఉన్నాయని తెలుసుకున్నారు. అంతేగాక అన్నాడీఎంకే నేతలకు అనేక పనులు చేసిపెట్టే బ్రోకర్‌గా కూడా సునీల్ పనిచేసినట్లు తెలుసుకున్నారు. 2011లో అన్నాడీఎంకే అధికారంలోకి వరకు సదరు సునీల్ చిన్నపాటి వడ్డీ వ్యాపారం, శశికళ బినామీ కంపెనీల్లో ఉద్యోగిగా ఉండేవాడు. ఈవిధంగా ఏర్పడిన పరిచయాలతో తానే ఒక బినామీ సంస్థ యజమానిగా ఎదిగినట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు. శశికళ బంధువులు, బినామీలను గుర్తిస్తూ ఆస్తుల జప్తునకు పూనుకోవడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. జైలు జీవితం ఏడాది పూర్తి: ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్షను ఎదుర్కొంటున్న శశికళ బుధవారంతో ఏడాది జైలు జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన తుదితీర్పు వెలువడగా 15వ తేదీన శిక్ష ఖైదీగా ఆమె బెంగళూరు జైల్లోకి వెళ్లారు. చిన్నమ్మతోపాటు ఆమె వదిన ఇళవరసి, అక్క కుమారుడు సుధాకరన్ సైతం అదే రోజున జైలు జీవితాన్ని ప్రారంభించారు. జయలలిత తొలి వర్ధంతి గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన మౌనవ్రతాన్ని ప్రారంభించిన శశికళ మంగళవారం శివరాత్రి పర్వదినం సందర్భంగా విరమించినట్లు తెలుస్తోంది. -
జైలు వైభవం
విశ్లేషణ ఆవిడ ఆనందంగా ఉన్నందుకు కాదు, 2 కోట్లు ఇచ్చినందుకు కాదు, ఇచ్చిందని చెప్పిన పోలీసు డిప్యూటీ ఇనస్పెక్టర్ జనరల్ డి. రూపని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగారు బదిలీ చేశారు. ఇది కాంగ్రెసు ఘనత. జైళ్లు మనకు దేవాలయాలు. మన దేవుడు జైల్లో పుట్టాడు. ఆనాటి మహానుభావులంతా జైళ్లలో ఉన్నారు. ఒక్క పూనా యెరవాడ జైలులోనే మహాత్మా గాంధీ, నెహ్రూ, తిలక్, సుభాశ్చంద్ర బోస్, సావర్కర్ ప్రభృతులు ఉన్నారు. ఇప్పుడూ ఆ వైభవం కొనసాగుతోంది. ప్రస్తుతం ఓం ప్రకాశ్చౌతాలా గారు, పండిత్ సుఖ్రాంగారు జైల్లో ఉన్నారు. మొన్నటిదాకా లాలూగారు, అంతకు ముందు కనిమొళిగారు, ఏ. రాజా గారు ఉండి వచ్చారు. అది నిజంగా శిక్షా? లేక విశ్రాంతా? లేక భోగమా? మనకి తెలీదు. అదే ఆయా పెద్దమనుషులకు పెట్టుబడి. అవినీతి ఆఫీసర్లకు రాబడి. ఇలాంటి సౌకర్యాలు లోగడ అనుభవించినవారున్నారు. జెస్సికా లాల్‌ని కాల్చి చంపిన మనూశర్మకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కాని వారు చుట్టపు చూపుగానే జైలుకి వెళ్లి, మిగతా సమయాల్లో బయటే ఉన్నారు. వారి తల్లికి ఆరోగ్యం బాగాలేదనే మిషతో బయటికి వచ్చారు. కాని వారి తల్లిగారు చండీగఢ్‌లో మహిళా క్రికెట్ జట్టుతో గడుపుతూండగా, మనూశర్మగారు ఢిల్లీలో నైట్‌క్లబ్బుల్లో గడుపుతూ, పోలీసు కమిషనర్‌గారి కొడుకుతో తగాదా పెట్టుకున్న సంగతి వెలుగులోకొచ్చింది. అనుమతి ఇచ్చినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌గారి మీద విమర్శలు వచ్చాయి. జైలు శిక్ష పడగానే ఎటువంటివారికయినా హఠాత్తుగా గుండె నొప్పి వస్తుంది. లేదా కడుపు నొప్పి వస్తుంది. డాక్టర్లు తప్పనిసరిగా ఆసుపత్రికి తరలించాలంటారు. అయిదు నక్షత్రాల ఆసుపత్రిలో, చలువ గదుల్లో, ఇద్దరు ముగ్గురు అందమయిన నర్సులు సేవలు చేస్తూండగా వారు సేదదీర్చుకుంటారు. ఇందుకు గొప్ప ఉదాహరణ– నితీశ్ కటారాను చంపిన వికాస్ యాదవ్, విశాల్ యాదవ్. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించాల్సిన వీరిద్దరూ ఇలాంటి సుఖాల్నే అనుభవించారు. వికాస్ యాదవ్ 98 సార్లు మాత్రమే విడిది చేశారు. విశాల్ యాదవ్ గారి అనారోగ్యం ఇంకా బలమైనది. వారు కేవలం 105 సార్లు మాత్రమే విడిది చేశారు. నిక్షేపం లాంటి కొడుకుని పోగొట్టుకున్న నీలం కటారా ఈసారి కోర్టుని–శిక్ష వేయాలని కాదు, వేసిన శిక్షని అమలు జరపాలని ఆశ్రయించారు. ఆ తల్లి ఆర్తిని గ్రహించిన సుప్రీం కోర్టు ఈసారి మన ఖరీదయిన ‘రోగులకు’ 30 ఏళ్లుగా శిక్షను పెంచింది. ఇవన్నీ మన జైలు ఆఫీసర్ల అవినీతిని ఆకాశంలో నిలిపే కథలు. ప్రస్తుతం జైళ్లలో ఇలాంటి వైభవం కొనసాగుతోందనడానికి నిదర్శనం శశికళగారు రాజభోగాలతో కర్ణాటక జైల్లో ఉండడం. అందుకు వారు కేవలం 2 కోట్లు ఖర్చు చేశారని మనకు తెలిసింది. వారు నలుగురిలాగా సాదాసీదా ఖైదీ. అయినా ఆవిడకి 5 వరస గదుల వసతిని జైలు పెద్దలు కల్పించారు. మధ్య గదిలో ఉంటూ మిగతా గదుల్లో ఆమె సరంజామా పెట్టుకుంటారు. ప్రత్యేకమైన వంటలు అమెకి చేయిస్తారు. హాయిగా నైటీలు వేసుకుంటారు. ఎవరైనా చూడడానికి వచ్చినప్పుడు సిల్కు దుస్తులు– చుడీ దార్లు వేస్తారు. టేపుల దుకాణం నడుపుకునే ఆవిడకు ఇంత డబ్బు ఎక్కడిది? జయలలిత డబ్బు ఆవిడ ఖాతాలోకి ఎంత చేరింది? పదవుల కోసం కొట్టుకుంటున్న ప్రస్తుత పార్టీ నాయకులకు ఇది పిడకల వేట. ఏతావాతా–ఆవిడ ఆనందంగా ఉన్నందుకు కాదు, 2 కోట్లు ఇచ్చినందుకు కాదు, ఇచ్చిందని చెప్పిన పోలీసు డిప్యూటీ ఇనస్పెక్టర్ జనరల్ డి. రూపని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగారు బదిలీ చేశారు. ఇది కాంగ్రెసు ఘనత. ఎన్నోసారి? గత 17 సంవత్సరాలలో 26వ సారి. అంటే ప్రతీ ఏడెనిమిది నెలలకి ఒక్కో ట్రాన్స్ ఫర్ జరిగింది. లోగడ ఇలాంటి అడ్డదిడ్డమయిన ‘నీతి’ని పట్టుకు వేలాడినందుకు ఒకానొక ఐయ్యేయస్ ఆఫీసరు–ఖేమ్కాగారిని కాంగ్రెసు నాయకత్వమే బదిలీలు చేసి చేతులు కడుక్కుంది. ఎన్నిసార్లు? 27 సంవత్సరాలలో 47 సార్లు. ఆ మధ్య దుర్గా నాగ్‌పాల్ అనే సరికొత్త ఐయ్యేయస్‌కి ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ ప్రభుత్వం అధికారం ‘రుచి’ని చూపి నోరు మూయించిన కథ మనం చదువుకున్నాం. ఈ దిక్కుమాలిన నీతిపరులు మరీ శ్రుతి మించితే? ఏం జరుగుతుందో లోగడ ధనంజయ్ మహాపాత్రా గారి ద్వారా అవినీతిపరులు నిరూపించారు. చివరిగా డి. రూప అన్నమాట: ‘అవినీతి జరిగినప్పుడు–నోరు విప్పకపోతే–ఆ అవినీతికి పరోక్షంగా మనం మద్దతు ఇచ్చినట్టే.’ వ్యవస్థని ఎదిరించడానికి దమ్ము కావాలి. చిత్తశుద్ధి కావాలి. అకళంకమైన శీల సంపద కావాలి. అడ్డదారిన డబ్బో, పదవో దక్కించుకోవాలనే దేబ రింపు గల అవకాశవాదులకు ఇవన్నీ గగన కుసుమాలు. ఖేమ్కాలు, రూపలు, ధనంజయ్లూ అరుదుగా కనిపిస్తారు. దుర్గా నాగ్‌పాల్‌లు తొలిరోజుల్లోనే మూగపోతారు. ప్రతీ తరానికీ మహాత్ముడు పుట్టడు. నీతి నిప్పు. పాటించిన వారికి అది వెలుగు. తేజస్సునిస్తుంది. పాటించని వారిని కాలుస్తుంది. - గొల్లపూడి మారుతీరావు