![American teacher Marc Fogel released from Russian prison](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12022025132-TRUMP.jpg.webp?itok=NP1TNEHb)
వాషింగ్టన్: అన్యాయంగా రష్యా కారాగారంలో మూడేళ్లు జైలు జీవితం అనుభవించిన అమెరికాకు చెందిన ఉపాధ్యాయుడు మార్క్ ఫోగెల్ ఎట్టకేలకు ట్రంప్ ప్రభుత్వం చొరవతో విడుదలయ్యారు. రష్యా నుంచి బయల్దేరిన ఫోగెల్ మంగళవారం రాత్రి అమెరికాలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వైమానిక స్థావరంలో దిగారు. తర్వాత నేరుగా అధ్యక్ష భవనంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. తన విడుదలకు అవిశ్రాంతంగా కృషిచేసినందుకు ట్రంప్‌కు ఆయన మనసారా కృతజ్ఞతలు తెలిపారు.
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాతో మాట్లాడి యుద్ధానికి ముగింపు పలుకుతానని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించిన వేళ పశ్చిమాసియాలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ స్వయంగా రష్యాకు వెళ్లిమరీ ఉపాధ్యాయుడిని వెంట తీసుకురావడం విశేషం. తమ పౌరుని విడుదల కోసం చూపిన స్థాయిలోనే ట్రంప్ సర్కార్ రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం చొరవ చూపుతుందని శ్వేతసౌధం ఒక ప్రకటనలో పేర్కొంది. ట్రంప్ ఇదే చొరవను కొనసాగించాలని ప్రపంచ దేశాలు ఆశాభావం వ్యక్తంచేశాయి.
ఎవరీ ఫోగెల్
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందిన ఫోగెల్ రష్యాలోని మాస్కో సిటీలో ఆంగ్లో– అమెరికన్ పాఠశాలలో దశాబ్దకాలంపాటు టీచర్‌గా చరిత్ర పాఠ్యాంశాలను బోధించారు. ఉపాధ్యాయునిగా ఉన్న కాలంలోనే మాస్కో ఎయిర్‌పోర్ట్‌లో 2021 ఆగస్ట్‌లో ఆయనను రష్యా పోలీసులు అరెస్ట్‌చేశారు. చట్టవ్యతిరేకంగా 17 గ్రాముల గంజాయిని రష్యాకు తీసుకొస్తున్నారని ఆయనపై నేరాభియోగాలు మోపింది. 2022 జూన్‌లో ఆయనకు 14 ఏళ్ల జైలుశిక్ష వేశారు. దీనిపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. తీవ్రమైన వెన్ను సమస్య కారణంగా వైద్యుల సలహా మేరకే ఆయన గంజాయిని వాడుతూ, వెంట తెచ్చుకున్నారని అమెరికా పేర్కొంది.
ఈయనను ‘‘పొరపాటున అరెస్ట్‌కు గురైన వ్యక్తి’గా అమెరికా అభివరి్ణంచింది. ఎలాగైనా ఆయనను విడుదలచేసి తీసుకొస్తామని నాటి బైడెన్ ప్రభుత్వం చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా అమెరికా జైళ్లో మగ్గిపోతున్న ఒక రష్యా పౌరుడిని విడుదలచేసి అందుకు ప్రతిగా టీచర్ ఫోగెల్ విడుదలను ట్రంప్ సుసాధ్యం చేశారని మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఈ ఖైదీల పరస్పర మారి్పడి అంశంపై వైట్‌హౌస్ స్పందించలేదు. త్వరలో మరో అమెరికన్ విడుదలై స్వదేశానికి రాబోతున్నారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment