Suicide Machine In Switzerland: Sarco Suicide Capsule Hopes To Enter Swiss - Sakshi
Sakshi News home page

Switzerland Suicide Machine: నొప్పి తెలియకుండా విముక్తి

Published Mon, Dec 13 2021 3:39 AM | Last Updated on Mon, Dec 13 2021 9:35 AM

Sarco suicide capsule hopes to enter Switzerland - Sakshi

మరొకరి సాయంతో జీవితాన్ని చాలించడాన్ని (అసిస్టెడ్‌ సూసైడ్‌) సులభతరం చేసేదే ఈ ‘సార్కో మెషీన్‌’. నయం కాని వ్యాధులతో బాధపడుతూ... నిత్యం నొప్పిని, మానసిక క్షోభనూ అనుభవిస్తూ అనుక్షణం చచ్చేకంటే... ఎలాగూ బతికే అవకాశాలు లేవు కాబట్టి... పలుదేశాలు స్వీయ సమ్మతితో ప్రాణాలు విడవడాన్ని చట్టబద్ధంగా అనుమతిస్తున్నాయి. అందులో స్విట్జర్లాండ్‌ ఒకటి. అసిస్టెడ్‌ సూసైడ్‌కు ఈ సార్కో మెషీన్‌ ఒక సులువైన, బాధ తెలియనివ్వని సాధనం. స్విట్జర్లాండ్‌లో న్యాయ సమీక్షలో దీనికి ఆమోదముద్ర పడిందని తయారీ సంస్థ ఎగ్జిట్‌ ఇంటర్నేషనల్‌ (లాభాపేక్ష లేని సంస్థ. స్వచ్చంద సంస్థ లాంటిది) గతవారం వెల్లడించింది.  

ఎలా పని చేస్తుందంటే...
శవపేటిక ఆకారంలో ఉండే సార్కో త్రీడీ ముద్రిత క్యాప్సుల్‌. ఎవరైనా ఇందులోకి ప్రవేశించి పడుకొంటే కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. సమాధానాలు ఇచ్చాక లోపల ఉండే ఒక బటన్‌ను నొక్కడం ద్వారా దీన్ని పనిచేసేటట్లుగా చేయవచ్చు. ఎప్పుడు ప్రారంభం కావాలనే సమయాన్ని కూడా సెట్‌ చేసుకోవచ్చు. నైట్రోజన్‌తో నిండిన ఒక పరికరం ఉపరితలంపై దీని నిర్మాణం జరుగుతుంది. బటన్‌ నొక్కిన వెంటనే క్యాప్సుల్‌లోకి శరవేగంగా నైట్రోజన్‌ నిండుతుంది. సెకన్లలో ఆక్సిజన్‌ స్థాయి 21 నుంచి ఒకటికి పడిపోతుంది. క్యాప్సుల్‌లోని వ్యక్తి వినికిడి శక్తిని కొద్దిగా కోల్పోయిన భావన కలుగుతుంది... ఒకరకమైన ఆనందానుభూతిని పొందుతాడు. శరీరంలో ఆక్సిజన్, కార్బన్‌ డయాౖMð్సడ్‌ స్థాయిలు పడిపోయి మరణం సంభవిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ 30 సెకన్లలో ముగుస్తుందని దీని రూపకర్త డాక్టర్‌ ఫిలిప్‌ నిష్కే తెలిపారు. తీవ్ర భయాందోళనలకు లోనుకావడం, ఊపిరి ఆడని ఫీలింగ్, యాతన... ఇవేవీ ఉండవు.  

ఆటోమేషన్‌ చేసే ఆలోచన
స్విట్జర్లాండ్‌లో అసిస్టెడ్‌ సూసైడ్‌ చట్టబద్ధంగా అనుమతించడం పరోక్షంగా జరుగుతుంది. నేరుగా దీన్ని అనుమతించే చట్టాలు లేవు. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడానికి ఇంకొకరు సహాయపడితే... దాని వెనుకగనక అతనికి స్వార్థపూరిత ఉద్దేశాలు ఉన్నాయని రుజువు చేయగలిగితే శిక్షార్హుడని చట్టం చెబుతోంది. అసిస్టెడ్‌ సూసైడ్‌కు ఒక ప్రొసీజర్‌ ఉంటుంది. జీవించే అవకాశాల్లేని రోగి... తనువు చాలించాలని నిర్ణయం తీసుకొనేటపుడు మానసిక సమతౌల్యంతో ఉన్నట్లు సైకియాట్రిస్టు ధ్రువీకరించాలి. తర్వాత రోగి నోటి ద్వారా ద్రవరూపంలో ఉన్న సోడియం పెంటోబార్బిటాల్‌ తీసుకుంటాడు. 2 నుంచి 5 నిమిషాల్లోపే నిద్రలోకి... ఆపై గాఢ కోమాలోకి వెళ్లిపోతాడు. అనంతరం మరణం సంభవిస్తుంది. చాలాదేశాల్లో అసిస్టెడ్‌ సూసైడ్‌ డాక్టర్‌ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కానీ స్విట్జర్లాండ్‌లో డాక్టర్లు కాని వారు కూడా ఆత్మహత్యలో సహాయపడవచ్చు. సైకియాట్రిస్టు ధ్రువీకరణ కూడా యాంత్రికంగా జరిగేలా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ)ని సార్కోకు జోడించే యత్నాలు చేస్తున్నామని డాక్టర్‌ ఫిలిప్‌ తెలిపారు.

అసిస్టెడ్‌ సూసైడ్‌– యుథనేసియా ఒకటేనా!
కాదు తేడా ఉంది. యూకే నేçషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌  ప్రకారం యుథనేసియా/మెర్సీకి ల్లింగ్‌ (కారుణ్య మరణం)లో ఒక వ్యక్తికి భరింపలేని, నిరంతర బాధ నుంచి విముక్తి ప్రసాదించడానికి డాక్టర్‌ ప్రాణాలు తీసే మందును తానే ఇంజక్ట్‌ చేస్తాడు. రోగి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిల్లో ఉంటే మెర్సీకిల్లింగ్‌లో అతని లేదా ఆమె బంధువులు కూడా రాతపూర్వకంగా సమ్మతి తెలుపవచ్చు. అసిస్టెడ్‌ సూసైడ్‌... ఒక బాధిత రోగి ప్రాణాలు తీసుకోవడానికి వైద్యుడు ప్రిస్కిప్షన్‌ రాస్తాడు.. రోగి స్వయంగా ఇంజక్షన్‌ లేదా నోటిద్వారా మందును వేసుకుంటాడు. స్విట్జర్లాండ్‌లో మాత్రమే డాక్టర్లు కాని వారు కూడా అసిస్టెడ్‌ సూసైడ్‌లో సహాయపడవచ్చు.

ఏయే దేశాలు అనుమతిస్తున్నాయి...
స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్, కెనడా, కొలంబియా, స్పెయిన్, న్యూజిలాండ్‌ (6నెలలకు మించి బతకడని ఇద్దరు డాక్టర్లు ధ్రువీకరించాలి) దేశాల్లో చట్టబద్ధం. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోనూ ఇది అమల్లో ఉంది. అమెరికా లోని కాలిఫోర్నియా, కొలరాడో, హవాయి, న్యూజెర్సీ, ఒరెగాన్, వాషింగ్టన్‌ స్టేట్, డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా, మోంటానా, వెర్మోంట్‌ల్లో చట్టబద్ధం. ఎవరు అర్హులనే విషయంలో నిబంధనలు మాత్రం వేరుగా ఉన్నాయి. స్విట్జర్లాండ్‌లో రెండు అతిపెద్ద అసిస్టెడ్‌ సూసైడ్‌ సంస్థలు... ఎగ్జిట్, డిగ్నిటాస్‌ల సేవలు ఉపయోగించుకొని 2020లో 1,300 మంది విముక్తి పొందారు. చట్టబద్ధత లేని దేశాల వారు స్విట్జర్లాం డ్‌ వచ్చి మరీ  ప్రాణాలు వదులుతున్నారు. ఇది ‘డెత్‌ టూరిజం’గా మారుతోందనే విమర్శలున్నాయి.

నైతికంగా సబబేనా?
జాతస్య మరణం ధృవంః. పుట్టిన వాడు గిట్టక తప్పదు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ, ఇక బతికే అవకాశాలేమాత్రం లేనపుడు  నొప్పిని భరిస్తూ బతికుండటానికి బదులు తనువు చాలించడమే మేలని భావిస్తారు బాధితులు. శారీరకంగా నొప్పిని భరిస్తూ,  మానసిక క్షోభను అనుభవిస్తూ మృత్యువు ఎప్పుడొస్తుందోనని ఎదురుచూడటమనేది అన్నింటికంటే పెద్ద నరకం. అలాంటి జీవికి సాధ్యమైనంత తేలికైన మార్గంలో ముక్తిని ప్రసాదించడమే మేలనేది కొందరి వాదన. అందుకే చట్టాలు దీన్ని అనుమతిస్తున్నాయి.

భారత్‌లో ఏంటి స్థితి?
అసిస్టెడ్‌ సూసైడ్, యుథనేసియా/మెర్సీ కిల్లింగ్‌ రెండూ మనదేశంలో చట్ట విరుద్ధం. నేరం. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు అరుణా షాన్‌బాగ్‌ కేసులో 2011లో ఒక చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ముంబైలోని ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే అరుణా షాన్‌బాగ్‌పై వార్డుబాయ్‌ 1973లో అత్యాచారం చేశాడు. దాంతో కోమాలోకి వెళ్లిన ఆమె కోలుకోలేదు. 37 ఏళ్లు అలా ఆసుపత్రిలో జీవచ్చవంగా బెడ్‌పై ఉండిపోయిన ఆమె తరఫున 2011లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడో న్యాయవాది. ఆమెకు విముక్తి కల్పించాలని కోరాడు. మెడికల్‌ లైఫ్‌సపోర్ట్‌ సిస్టమ్‌ను తొలగించడానికి (పాసివ్‌ యుథనేసియా) సుప్రీంకోర్టు అనుమతించింది. కానీ అది జరగలేదు. 42 ఏళ్లు కోమాలో ఉన్న తర్వాత 2015లో న్యూమోనియాతో అరుణ మరణించారు. అనంతరం 2018లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం... ఒక వ్యక్తిని వైద్య చికిత్సను నిరాకరించే హక్కు ఉందని రూలింగ్‌    ఇచ్చింది. ‘వయోజనుడైన ఓ వ్యక్తి మానసిక సమతౌల్యంతో నిర్ణయం తీసుకోగలిని స్థితిలో ఉంటే... ప్రాణాలు నిలిపే పరికరాలను తొలగించడంతో సహా ఎలాం టి వైద్య చికిత్సనైనా నిరాకరించే హక్కు అతను లేదా ఆమెకు ఉంటుంది’ అని స్పష్టం చేసింది.

– నేషనల్‌ డెస్క్, సాక్షి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement