మదనపల్లె టౌన్ (చిత్తూరు జిల్లా): ఇద్దరు మగ పిల్లలు.. ఒకరి తర్వాత ఒకరు గతంలో చనిపోయారు. మూడో సంతానంగా ఏడాది క్రితం ఆడ బిడ్డ పుట్టింది. అయితే పుట్టుక నుంచే శరీరంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండటం, మూర్చ పోవడం, శ్వాస తీసుకునేందుకు ఆ పాప ఇబ్బందులు పడుతోంది. ఆ చిన్నారి చికిత్సకుగాను శక్తికి మించి ఖర్చుచేశారు. పేదరికం కారణంగా ఇక ఖర్చు పెట్టే స్తోమత లేక, చిన్నారి పడుతున్న నరకయాతన చూడలేక ఆ తల్లిదండ్రులు గుండెల్లో బాధను దిగమింగుకుంటూ ఓ నిర్ణయానికి వచ్చారు. గురువారం మదనపల్లె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ బిడ్డకు కారుణ్యమరణం ప్రసాదించాలంటూ న్యాయమూర్తిని అభ్యర్థించారు.
వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా, బి.కొత్తకోట, బీసీ కాలనీలో నివాసం ఉండే బావాజాన్, షబానా దంపతులకు రెక్కాడితే గానీ డొక్కాడదు. సొంతిల్లు కూడా లేని వీరికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. మొదటి, రెండో సంతానంగా ఇద్దరు మగ పిల్లలు జన్మించారు. పుట్టిన రోజుల వ్యవధిలోనే సుగర్ స్థాయి పడిపోయి ఆ ఇద్దరూ చనిపోయారు. మూడో సంతానంగా రెడ్డి సుహానా (1) జన్మించింది. పాపకు ఏడాది వయసు వచ్చినా ఎదుగుదల లేకపోవడంతో కొంతకాలం క్రితం డాక్టర్లకు చూపించారు.
ఆ చిన్నారికి సుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెప్పడంతో.. పాపను కాపాడుకోవడానికి అప్పులు చేసి వైద్యం చేయించారు. అయినా వ్యాధి నయం కాలేదు. ఇకపై వైద్యం చేయించడానికి వారివద్ద చిల్లిగవ్వలేదు. కళ్ల ముందే నరకయాతన పడుతున్న బిడ్డను చూస్తూ బతకలేమని, తమ బిడ్డకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని తల్లిదండ్రులు సెకండ్ జేయంఎఫ్‌సీ కోర్టు న్యాయమూర్తిని ఆశ్రయించారు. తాము ఇందుకు అనుమతించలేమని, జిల్లా జడ్జిని ఆశ్రయించాలని న్యాయమూర్తి సలహా ఇచ్చారని బాధితులు తెలిపారు.
రోజుకు రూ. 2,400 ఖర్చు
నా బిడ్డకు సుగర్ లెవల్స్ తగ్గడంతో ఆరోగ్యం క్షీణిస్తోంది. పాపకు రోజుకు 4 ఇంజక్షన్లు చేయించాలి. ఒక్కో సూది మందు రూ. 600. ఇలా రోజుకు రూ. 2,400 ఖర్చు చేయాలి. ఇప్పటికే ఉన్నవన్నీ అమ్మేశాం. మా వద్ద ఇంక మిగిలిందేమీ లేదు. ప్రభుత్వం ఆదుకుంటే బిడ్డను కాపాడుకుంటాం. న్యాయస్థానం అనుమతిస్తే బిడ్డ ప్రశాంతంగా అయినా కన్నుమూయాలని మేం కోరుకుంటున్నాం.
– బావాజాన్, పాప తండ్రి,
బి.కొత్తకోట, బీసీ కాలనీ
ఆడబిడ్డ పుట్టిందనుకుంటే..
ఇద్దరు మగబిడ్డలు పుట్టి మాయదారి వ్యాధితో కళ్ల ఎదుటే మరణించారు. మూడో కాన్పులోనైనా ఆడబిడ్డ పుట్టిందనుకుంటే ఆ బిడ్డ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది.పుట్టిన ప్రతి బిడ్డా మాకు దక్కకుండా పోతున్నారు.
– షబాన, పాప తల్లి,
బి.కొత్తకోట, బీసీ కాలనీ
Comments
Please login to add a commentAdd a comment