
గిరీష్ కర్నాడ్(ఫైల్ ఫొటో)
కొంత కాలం క్రితం బెంగళూరు నగరంలో జరిగిన నిరసన ప్రదర్శనలో బహిరంగంగా సినీ నటుడు రచయిత కవి గిరీష్ కర్నాడ్, స్వామి అగ్నివేశ్ మరికొందరు మేమూ అర్బన్ నక్సల్స్ అంటూ మెడలో ప్లే కార్డులు ధరిం చారు. ‘అర్బన్ నక్సల్స్’, ‘హాఫ్ మావోయిస్ట్స్’ అనే పదాలు నేడు దేశమంతటా ప్రతిధ్వనిస్తున్నాయి. నగర ప్రాంతాలలో స్థావరాల గురించి ఒకటిన్నర దశాబ్దం క్రితం మావోయిస్టులు కన్న కల ఇప్పుడు ఫలిస్తున్నది. ఉగ్రవాద ధోరణులకు జనామోదం సమకూర్చడమే అర్బన్ నక్సల్స్ ప్రథమ కర్తవ్యం. వీరి అర్బన్ పర్‌స్పెక్టివ్ పత్రం ప్రకారం పట్టణాలలో, నగరాలలో అసంఘటిత రంగ కార్మికులను సంఘటితం చేయాలి. కార్యకర్తలను సేకరించడంతో పాటు, నాయకత్వాన్ని అభివృద్ది చేసే పని జరగాలి. సెక్యులర్ శక్తులను, పీడనకు గురి అవుతున్న అల్పసంఖ్యాక వర్గాలను హిందూ ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ఏకం చేయాలి.
2004లో నాటి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటి నుంచి నగరాలు, పట్టణాలపై దృష్టి కేంద్రీకరించడం కోసం నక్సల్స్ అధినాయకత్వం శ్రమిస్తూనే ఉంది. పథకం ప్రకారం ఎంపిక చేసిన తమ నాయకులను కొందరిని జనజీవన స్రవంతిలో కలిపి దేశవ్యాప్తంగా తమ పోరాట పంథాను మార్చి భావప్రకటన స్వేచ్ఛ ముసుగులో వివిధ ప్రజా ఉద్యమాలకు నేతృత్వం వహిస్తూ భారత ప్రభుత్వంపై తమ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. సంఘ పరివార సంస్థలపై అక్కసును వెళ్లగక్కడం అర్బన్ నక్సల్స్ వ్యూహం. రచయితలను, మేధావులను విద్యార్థులను ‘బ్రెయిన్ వాష్’ చేసి అడవులకు పంపే ప్రయత్నంలో అర్బన్ నక్సల్స్ సఫలీకృతం అవుతున్నారా అనిపిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో ఒకప్పటి రాడికల్ విద్యార్థి సంఘం పాత్రను అధ్యాపకులు, మేధావుల రూపంలో కొందరు అర్బన్ నక్సల్స్ పోషిస్తున్నారు.
నక్సలైట్ల ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రారంభమైన మొదటి రోజుల నుంచే ఇప్పటి అర్బన్ నక్సల్స్ కీలకపాత్ర పోషిస్తూ వచ్చారు. వీరు గతంలో హక్కుల ఉద్యమకారులుగా చెలామణీ అయ్యారు. సకల వ్యవహారాలను చట్టాలకతీతంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ముసుగులో కోర్టుల బయట రాజకీయ రచ్చ ద్వారా తేల్చుకుంటామని భావిస్తున్నారు. మరోవైపున చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళే మార్గంలో అర్బన్ నక్సల్స్ సమస్యకు సరైన పరి ష్కారాలు లభిస్తాయని ఆశిద్దాం.
-కొట్టె మురళీకృష్ణ, కరీంనగర్
మొబైల్ : 94417 26741