శరణార్థులకోసం జెనీవాలోని ఐక్యరాజ్యసమితి హై కమిషనర్ ఆఫీసులో నేను పనిచేస్తున్నప్పుడు మొదటిసారిగా స్వామి అగ్నివేశ్‌ను చూశాను. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ వద్ద బానిసత్వంకి సంబంధించిన సమకాలీన ఫోరమ్‌లపై కార్యాచరణ బృందం ముందు సాక్ష్యం చెప్పడానికి ఆయన వచ్చినప్పుడు నేను చూశాను. ఆనాడు అగ్నివేశ్ కలిగించిన ప్రభావం మరపురానిది. జెనీవాలో ఆనాడు ఆయన పేల్చిన మాటలను ఎవరమూ మర్చిపోలేం.
శుక్రవారం 80 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన స్వామి అగ్నివేశ్ ఈ దేశంలో చాలామందికి అర్థం కాని ఒక నిగూఢ రహస్యమే. 1939 సెప్టెంబర్ 21న ఆయన జన్మించారు. తల్లిదండ్రులను కోల్పోయి, ఒక సంస్థానంలో దివాన్‌గా పనిచేస్తున్న తన తాతగారి వద్ద పెరిగిన ఈ బ్రాహ్మణుడు తదనంతర కాలంలో అణగారిన ప్రజలతో తన్నుతాను మమే కం చేసుకున్నాడు. 30 ఏళ్ల ప్రాయంలోనే సన్యాసాన్ని పుచ్చుకున్న అగ్నివేశ్ స్వయంప్రకటిత హిందుత్వ ప్రచారకుల దాడికి నిత్యం గురవుతూ వచ్చాడు. 30 ఏళ్ల ప్రాయంలోనే ఎమ్మెల్యేగా, రాష్ట్రమంత్రిగా పనిచేసిన అగ్నివేశ్ తర్వాత రాజ కీయ పదవులకు దూరంగా ఉండిపోయారు.
ఆర్యసమాజ్ అత్యున్నత అంతర్జాతీయ సంస్థ అయిన వరల్డ్ కౌన్సిల్ అధ్యక్షుడిగా దశాబ్దంపాటు పనిచేశారు. తరువాత ఆ సంస్థలోని కీలక నియమాలనుంచి వేరుపడి 30 ఏళ్ల వయస్సులోనే తన సొంత ఆర్యసభను నెలకొల్పారు. భారతీయ సమాజ సమస్యలు, దానికి కారణాలపై అత్యంత ఆసక్తితో నిబ ద్ధంగా పనిచేసిన ఈ భారతీయ విశిష్టమూర్తి అంతర్జాతీయ ప్రాచుర్యం పొందడమే కాకుండా 1994 నుంచి 2004 వరకు బానిసత్వ వర్తమాన వేదికలపై ఐక్యరాజ్యసమితి వాలంటరీ ట్రస్ట్ ఫండ్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి ఛత్తీస్‌గఢ్‌లో పెరిగిన ఈ భారతీయుడు హరి యాణాలో పోటీ చేసి ఎన్నికయ్యారు, ఆయన ప్రధానంగా సామాజిక కార్యకర్త. 1981లో తాను స్థాపిం చిన వెట్టిచాకిరీ విమోచన ఫ్రంట్ ద్వారా వెట్టిచాకిరీకి వ్యతి రేకంగా గొప్ప కృషి సాగించారు.
నిర్విరామ ప్రచారకర్త
80 సంవత్సరాల క్రితం వేప శ్యామ్‌రావుగా జీవితం ప్రారంభించిన అగ్నివేశ్.. భారతీయ సామాజిక జీవితంలో అత్యంత గుర్తింపు పొందిన వ్యక్తులలో ఒకరు. 1980ల నుంచి సాంప్రదాయిక ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టకూడదని నిర్ణయించుకున్నారు. కానీ ఏది సరైనది అని నమ్ముతూ వచ్చారో దానిని నిర్విరామంగా ప్రచారం చేస్తూ వచ్చారు. న్యాయశాస్త్రం, వాణిజ్య శాస్త్రంలో డిగ్రీలు సాధిం చిన అగ్నివేశ్, భారత భవిష్యత్ ప్రధాన న్యాయమూర్తి వద్ద గతంలో జూనియర్ లాయర్‌గా ప్రాక్టీసు కూడా చేశారు. జీవితపర్యంతం అన్యాయ చట్టాలను సవాలు చేస్తూ వాటిని మార్చేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. వెట్టిచాకిరీ నిషేధ చట్టంలాగా కొన్ని సార్లు గొప్ప విజయం సాధించారు కూడా. సతీ నిరోధక చట్టం–1987 రూపకల్పనలో ఆధ్యాత్మిక మద్దతుదారుగా వ్యవహరించారు.
అగ్నివేశ్ తన సోషలిస్టు విశ్వాసాల కోసం హిందూయిజాన్ని వరించారు. తన పంథాను ఆయన వైదిక సామ్యవాదం లేదా వేదిక్ సోషలిజం అని పిలిచేవారు. ఆయన కార్యాచరణే ఆయన్ని వీధుల్లోకి తీసుకొచ్చింది. భ్రూణహత్యల నుంచి బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక అంశాలపై ఆయన నిర్విరామంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన ఎన్నోసార్లు భౌతిక దాడులనుంచి తప్పించుకున్నారు. అఖిల భారతీయ హిందూ మహారాష్ట్ర ఆయన తలకు 20 లక్షల రూపాయల మేరకు వెలకట్టింది. ఇక జార్ఖండ్‌లో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయన కార్యాచరణ అనేక సార్లు తనను జైళ్లలోకి నెట్టింది. విద్రోహం, హత్యారోపణల పాలై దాదాపు 14 నెలలపాటు ఆయన జైళ్లలో గడిపారు. 2011 ఫిబ్రవరిలో మావోయిస్టులు అపహరించిన అయిదుగురు పోలీసులను ఆయన చర్చల ద్వారా విడిపించారు.
మతోన్మాదం, మూఢవిశ్వాసాల విమర్శకుడు
ఇటీవలి కాలంలో ఆయన మతపర సహనం, విశ్వాసాల మధ్య సామరస్యతపై గళం విప్పారు. అనేక అంతర్జాతీయ వేదికలపై ముస్లిం కమ్యూనిటీపై సానుభూతి చూపాలని, ఇస్లాంను అర్థం చేసుకోవాలని అనేక చర్చల్లో వాదిస్తూవచ్చారు. కొద్దిమంది వ్యక్తులు చేసే తప్పుపనులకు మొత్తం కమ్యూనిటీనే దోషిని చేయడం చాలా తప్పు అని బహిరంగ సభల్లోనే వాదించేవారు. అయితే, కొన్నిసార్లు తాను నమ్ముతున్న సిద్ధాంతాలను తీవ్రమైన భాషతో ఆయన వ్యక్తీకరించినప్పుడు మధ్యేవాదులమైన నాలాంటి వాళ్లకు మద్దతివ్వడం కష్టంగా ఉండేది. ఐక్యరాజ్యసమితి నంబర్‌వన్ ఉగ్రవాది అని ఆయన వర్ణించడం నాకు సులభంగా జీర్ణమయ్యేది కాదు. కానీ తన విశ్వాసాలు, భావాల విషయంలో మధ్యేమార్గంతో వ్యవహరించడం అగ్నివేశ్‌కు సాధ్యమయ్యే వనికాదు. జీవితాంతం ఆయన తన భావాలతో రాజీపడకుండానే గడిపారు.
మత దురభిమానం, మత పక్షపాతంపై తీవ్ర విమర్శ చేసే అగ్నివేశ్ కొన్ని హిందూ బృందాల ఆగ్రహానికి గురయ్యేవారు. పూరీ జగన్నాథ్ ఆలయాన్ని హిందూయేతరులకు కూడా తెరవాలని సూచించడం, లక్షలాది శివభక్తులు పూజించే అమర్‌నాథ్ శివలింగంపై చేసిన వ్యాఖ్యలు వీటిలో కొన్ని. చివరకు అమర్‌నాథ్ శివలింగంపై ఆయన చేసిన వ్యాఖ్యల విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ప్రజల విశ్వాసాలను దెబ్బతీసే పదాలను వాడేముందు వెనుకాముందూ ఆలోచించుకోవాలని హితవు చెప్పాల్సి వచ్చింది.
అనేకమంది ఆదర్శవాదుల్లాగే స్వామి అగ్నివేశ్ కొన్ని సార్లు తాను వ్యక్తీకరించిన భావాల తీవ్రత పరంగా చిక్కుల్లో పడ్డారు. కానీ అయన ఎప్పటికీ స్వామి అగ్నివేశ్‌లాగే ఉండేవారు. తన స్వప్నాలను సాకారం చేసుకునేందుకు తన జీవితాన్ని, సమయాన్ని, శక్తిని ఒకే మార్గంలో సిద్ధం చేసుకుంటూ వచ్చారు. దశాబ్దాలుగా తన విశ్వాసాలకు గాను తింటూ వచ్చిన దెబ్బలన్నీ ఆయన నిజాయితీకి, సాహసప్రవృత్తికి గీటురాళ్లుగా నిలిచాయి. మానవ చైతన్యాన్ని నిశ్చింతగా, నిర్భీతిగా కలవరపర్చిన ఈ దీపశిఖను నేను కోల్పోయాను. ఓం శాంతి. (ది క్వింట్ సౌజన్యంతో)
వ్యాసకర్త : శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ, మాజీ దౌత్యవేత్త
సోషలిస్టు విశ్వాసం రగిలించిన ‘అగ్నిశిఖ’
Published Sun, Sep 13 2020 1:26 AM | Last Updated on Sun, Sep 13 2020 1:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment