ఆయన దాహం తీరనిది!
ప్రపంచమొక పద్మవ్యూహం... కవిత్వమొక తీరని దాహం అన్నారు శ్రీశ్రీ. ఇలాంటి కవితా పంక్తులెన్నో కంఠతా వచ్చిన సాహితీప్రియుడైన నటుడు ప్రకాశ్‌రాజ్‌కు మాత్రం నటన ఒక తీరని దాహం. అందుకే, కావచ్చు... వెండితెరపై దక్షిణాది నుంచి ఉత్తరాది దాకా విస్తరించిన ఈ జాతీయ స్థాయి నటుడు విలక్షణంగా రంగస్థలంపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కన్నడసీమకు చెందిన ఆయన మరో సీనియర్ నటుడు - సాహిత్యకాడు ఇప్పురుడు గిరీష్ కర్నాడ్ రాసిన కొత్త కన్నడ నాటకంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. నాటకం పేరు - ‘మంత్రపుష్పం’. ‘‘భక్తి, శృంగారం - రెండూ మిళితమైన కథాంశంతో ఈ నాటకం నడుస్తుంది.
అందులో నాది కీలకమైన పూజారి పాత్ర’’ అని ప్రకాశ్‌రాజ్ ‘సాక్షి’కి వివరించారు. నిత్యం చేస్తున్న వాణిజ్య తరహా పాత్రలు, చిత్రాల నుంచి ఇది కొంత విశ్రాంతినిస్తుందని ఆయన భావిస్తున్నారు. ‘‘అన్ని భాషల్లోనూ సాహిత్యంలో, రంగస్థలంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగితే, ఇటు సాహిత్యానికీ, అటు సమాజానికీ కూడా మరింత మేలు జరుగుతుంది’’ అని ప్రకాశ్‌రాజ్ అభిప్రాయపడ్డారు. మరి, అలాంటి తీరని దాహంతో ముందుకొచ్చేవాళ్ళు ఇంకా ఉన్నారా?