గిరీష్ కర్నాడ్‌ను చంపేస్తామని హెచ్చరిక
ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని డిమాండ్ చేసినందుకు ఆయన్ను చంపేస్తామంటూ కొంతమంది హెచ్చరించారు. తర్వాత.. హిందువులను, వక్కలింగ వర్గాన్ని అవమానిస్తూ సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారంటూ బెంగళూరు పోలీసులకు ఓ ఫిర్యాదు కూడా అందింది. మంగళవారం నాడు టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా గిరీష్ కర్నాడ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఈ వేడుకలను నిరసిస్తూ ప్రదర్శనలు జరిగాయి. వాటిలో కొన్ని హింసాత్మకంగా కూడా మారి, పోలీసు కాల్పుల్లో ఓ వీహెచ్‌పీ కార్యకర్త మరణించాడు.
తన వ్యాఖ్యలతో వివాదం రేగడంతో.. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కూడా అయిన గిరీష్ కర్నాడ్ క్షమాపణలు చెప్పారు. ఎవరైనా తన వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడితే క్షమాపణలు చెబుతున్నానని, అలా చెప్పడం వల్ల తనకేమొస్తుందని అన్నారు. 'ఇన్‌టోలరెంట్ చంద్ర' అనే యూజర్ నేమ్‌తో ట్విట్టర్‌లో గిరీష్ కర్నాడ్‌ను హెచ్చరిస్తూ పోస్టింగ్ వచ్చిందని, దీనిపై ఏమైనా ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.