
కేంద్రమంత్రిపై మండిపడ్డ సీఎం
సాక్షి, మైసూరు: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. జర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌కు భద్రత కల్పించడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ‘గౌరీ లంకేశ్ ప్రాణాలకు ముప్పు ఉందని మా ప్రభుత్వానికి ముందుగా తెలిసినట్టు ఆ కేంద్ర మంత్రి చెప్పారు. ఆమె కోరినా మేము భద్రత కల్పించలేదని ఆరోపించారు. కేంద్ర మంత్రి బాధ్యతారహితంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నార’ని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు చర్చలు జరిపిన గౌరికి ముప్పు ఉందని తెలిసినప్పటికీ, కర్ణాటక ప్రభుత్వం ఎందుకు భద్రత కల్పించలేదని రవిశంకర్ ప్రసాద్ అంతకుముందు ప్రశ్నించారు. అయితే తన ప్రాణానికి ముప్పు ఉందన్న విషయం తమతో గౌరి చెప్పలేదని, భద్రత కూడా కోరలేదని సిద్ధరామయ్య తెలిపారు. గౌరీ లంకేశ్ చాలా మంచి మనిషి అని, ఆమెను ఎవరూ ద్వేషించరని చెప్పారు. గౌరికి ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించి ఆమెకు భద్రత కల్పించారా, లేదా అని కర్ణాటక ప్రభుత్వాన్ని అడిగానని రవిశంకర్ ప్రసాద్ తాజాగా పేర్కొన్నారు.