బెంగళూరు: ప్రముఖ జర్నలిస్టు గౌరీలంకేశ్ హత్య కేసులో బెంగళూరు పోలీసుల విచారణలో ఓ అడుగు ముందుపడింది. ఈ కేసుకు సంబంధించి మాండ్య జిల్లాకు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ తర్వాత నవీన్ నేరాంగీకార వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్‌కు సమర్పించారు. ఫిబ్రవరి 18నే నవీన్‌ను అరెస్టు చేసినా ఆలస్యంగా ఈ విష యం వెల్లడైంది. నవీన్‌ను అక్రమ ఆయుధాల కేసులో అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా, తనే గౌరీని చంపినట్లు అంగీక రించినట్లు తెలిసింది. దీంతో నవీన్‌ను సిట్ కస్టడీలోకి తీసుకుని విచారించింది.
హత్య ప్రణాళిక, వినియోగించిన ఆయుధాలు తదితర అంశాలను రాబట్టింది. ‘ప్రస్తుతానికి ఒక నిందితుడినే అరెస్టు చేశాం. దీని ఆధారంగా కుట్రకు పాల్పడిన అందరినీ పట్టుకుంటాం’ అని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిర్మల తెలిపారు. కర్ణాటకలోని మాండ్య జిల్లా మద్దూర్ గ్రామానికి చెందిన నవీన్‌కు ‘హిందు యువసేన’తో సంబంధం ఉందని విచారణలో తేలిందన్నారు. 7.65 ఎంఎం దేశవాళీ తుపాకీతోనే గౌరీలంకేశ్ హత్య జరిగిందని ఫొరెన్సిక్ లేబొరేటరీ గతంలోనే తెలిపింది. కన్నడ సాహితీవేత్త ఎంఎం కల్బుర్గీ, మహారాష్ట్ర వామపక్ష నేత గోవింద్ పన్సారేల హత్యల్లోనూ ఇలాంటి తుపాకులే వాడారు.
Comments
Please login to add a commentAdd a comment