ముంబై: ఆరేళ్ల కిందట జరిగిన ప్రముఖ హేతువాది నరేంద్ర ధబోల్కర్ (67) హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శరద్ కలస్కర్ కర్ణాటక పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించాడు. నరేంద్ర ధబోల్కర్‌ను రెండుసార్లు తుపాకీతో కాల్చానని, మొదట వెనుక నుంచి తలలోకి బుల్లెట్ దింపానని, దీంతో కుప్పకూలి పడిపోయిన ఆయన కుడికన్నులోకి మరో బుల్లెట్ దింపానని నిందితుడు అంగీకరించాడు. ఈ మేరకు నిందితుడు పోలీసుల విచారణలో నేరాంగీకరం వాంగ్మూల ఇచ్చాడు. మొత్తం 14 పేజీలు ఉన్న నిందితుడి వాంగ్మూలాన్ని ఓ జాతీయ మీడియా చానెల్ గురువారం ప్రసారం చేసింది.
ఒక కేసు విషయంలో శరద్ కలస్కర్ గత అక్టోబర్‌లో అరెస్టై.. జైల్లో ఉన్నాడు. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్, ప్రముఖ హేతువాది గోవింద్ పన్సారే హత్యకేసుల్లోనూ ఇతను నిందితుడిగా ఉన్నాడు. గౌరీ లంకేశ్ హత్యకు కుట్ర పన్ని చంపినట్టు అతనిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ హత్యకేసు గురించి విచారిస్తున్న సమయంలోనే నరేంద్ర ధబోల్కర్‌ను కూడా తానే హత్య చేసినట్టు శరద్ కలస్కర్ అంగీకరించడం గమనార్హం. మొదట 2013 ఆగస్టులో పుణెలో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన నరేంద్ర ధబోల్కర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అనంతరం 2015 ఫిబ్రవరిలో గోవింద్ పన్సారే కోల్హాపూర్‌లో హత్యకు గురయ్యారు. అదే సంవత్సరం ఆగస్టులో ఎంఎం కల్బుర్గీ దారుణ హత్య చోటుచేసుకుంది. 2017 సెప్టెంబర్‌లో బెంగళూరులోని తన నివాసం వద్దే జర్నలిస్ట్ గౌరీలంకేశ్‌ను హతమార్చారు.
Comments
Please login to add a commentAdd a comment