సుప్రీం నుంచి శుభ్ర పవనాలు | ABK Prasad Special Article On Supreme Court Of India | Sakshi
Sakshi News home page

సుప్రీం నుంచి శుభ్ర పవనాలు

Published Tue, Dec 22 2020 12:12 AM | Last Updated on Tue, Dec 22 2020 9:37 AM

ABK Prasad Special Article On Supreme Court Of India - Sakshi

జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే

ప్రాథమిక హక్కులను సైతం హరించే దుర్ముహూర్త ఘడియలు వేగంగా పాలకులకే గాదు, న్యాయవ్యవస్థను కూడా ముసురుకుంటున్న దశలోనే కారు చీకటిలో కొంత కాంతిరేఖలా ప్రధాన న్యాయమూర్తి బాబ్డే ధర్మాసనం నుంచి కొంత కొత్తగాలి వీచడం ఈ దేశంలో ప్రజాస్వామ్యం కొన ఊపిరితోనైనా బతికి ఉండటానికి తోడ్పడగల్గుతుందా? ఆ భరోసా భారత ప్రజాబాహుళ్యానికి కలగాలంటే, పాలకవర్గాలు రాజ్యాంగ చట్టానికి, ప్రకటిత సెక్యులర్‌ విధానాలకు కట్టుబడి ఉండాలి. పేద కార్మిక కర్షక వర్గాలకు మద్దుతుగా నిలిచే అభ్యుదయకర శక్తులపైన నిర్బంధ విధానాన్ని తక్షణం రద్దు చేయాలి. వారిపైన మోపిన కేసులు ఎత్తివేయాలి.

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం వైఫల్యం చెందింది అనేంతలా వారిని (ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్, జస్టిస్‌ ఉమాదేవి ధర్మాసనం) ప్రభావితం చేసిన అంశమేమిటో మాకు అంతుపట్టడం లేదు. తమ వారిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ కొందరు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు దాఖలు చేస్తే ఆ వ్యాజ్యాల్లో ఓ న్యాయ స్థానం ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఎప్పుడైనా, ఎక్కడైనా మనం చూశామా? పైగా రాష్ట్రంలో రాజ్యాంగం విఫలమైనట్లు పిటిషన్లు ఎవరూ పేర్కొనలేదు. ఆ ఏపీ హైకోర్టు న్యాయ మూర్తుల ధర్మాసనం ఆ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలి పోయాయని భావించడానికి అంతగా వారిని ప్రభావితం చేసిన అంశాలేమున్నాయో మాకు అంతుపట్టడం లేదు.

అందువల్లనే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తూ ‘స్టే’ ఇస్తు న్నాం. అలాగే రాజ్యాంగం వైఫల్యంపై రాష్ట్ర హైకోర్టు కేవలం ప్రశ్న మాత్రమే లేవనెత్తిందనీ, అవి ఆదేశాలు కావనీ ప్రతివాదుల తరపున వాదించిన న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు. కానీ మీరు 29 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉంటున్నప్పుడు ఎప్పుడైనా, ఏ న్యాయ స్థానమైనా ఇలాంటి కేసుల్లో (హెబియస్‌) రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరుపుతామంటూ ఉత్తర్వులు ఇవ్వడం చూశారా? ఏపీ హైకోర్టు ఉత్తర్వులు అత్యున్నత న్యాయస్థానమైన మాకు ఆందోళన కల్గిస్తున్నాయి!’’
– ఏపీ ప్రభుత్వ అప్పీలుపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నల పరంపర.

సుమారు నాలుగేళ్ల తరువాత దేశ అత్యున్నత న్యాయస్థానంలో తిరిగి వీస్తున్న చైతన్య పవనాలుగా తాజా పరిణామాలను భావించు కోవ చ్చునా?! ఎందుకంటే ఇటీవల కొందరు సునిశిత పరిశోధకులు, పరి శీలకులు, సుప్రీంకోర్టు ధర్మాసన చైతన్యంలో చాలాకాలం తర్వాత తిరిగి పొడసూపుతున్న పరిణామాలను రెండు దశలుగా విభజించి – ఒకటి, మాజీ ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్‌.ఖేహార్‌ (2017) బెంచ్‌ ఉన్నప్పటి దశగానూ, రెండు– మాజీ చీఫ్‌ జస్టిస్‌ గొగోయ్‌ అనంతర (2019) దశగానూ విశ్లేషించుతున్నారు. ఈ రెండు దశలను తులనాత్మ కంగా జల్లెడపట్టి జస్టిస్‌ ఖేహార్‌కు ముందున్న ప్రధాన న్యాయ మూర్తుల హయాం ఎంత గౌరవప్రదంగా ముగిసిందీ, క్రమంగా ఆ ఉన్నతస్థాయి నుంచి గొగోయ్‌ నేతృత్వ పతనదశ ఇటీవలి కాలం దాకా ఎలా కొనసాగుతూ వచ్చిందీ విశ్లేషిస్తూ వచ్చారు.

వచ్చి, వచ్చి చీఫ్‌ జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాతో (రిటైర్డ్‌) న్యాయవ్యవస్థలో పతనదశ తారా స్థాయికి ఎలా చేరేస్థితికి వచ్చిందో విచారించుకోవటం మొదలైంది. ఎందుకంటే, సుప్రీం చరిత్రలో బహుశా తొలిసారిగా న్యాయమూర్తులు తమకు ప్రమేయం ఉన్న కేసులపై తామే తీర్పులు చెప్పేసుకునే దశకు ఎదిగిపోయారన్నది ఒక బహిరంగ రహస్యంగా మారింది! న్యాయ వ్యవస్థలో ఈ పరిణామానికి దోహదం చేసినవారు కొందరు న్యాయ మూర్తులతో పాటు రాజ్యాంగ వ్యవస్థలో భాగమైన పాలకవర్గాలు కూడానని మరచిపోరాదు.

ప్రభుత్వం, శాసనవేదిక, న్యాయవ్యవస్థల పరిధుల్ని, అధికారాల్ని స్పష్టంగా భారత లౌకిక రాజ్యాంగం నిర్వచించి విభజించినా– పాల నాధికారంలో ఉన్న రాజకీయులు తరచూ తమపైకి వచ్చిపడే అవినీతి కేసుల నుంచి, వారు జరిపే అక్రమ లావాదేవీల నుంచి బయటపడేం దుకు న్యాయవ్యవస్థపైన, న్యాయమూర్తులపైన ఒత్తిడి చేసి ప్రయో జనం పొందడం మానరు గాక మానరు. ఈ పరిణామం తిరిగి న్యాయ వ్యవస్థను తీవ్రమైన  ఒత్తిడికి గురి చేసి బలహీనంగా కనిపించే న్యాయ మూర్తులను ప్రభుత్వానికి, లేదా పాలకులకు లోబడి ఉండేట్లు చేస్తుంది. ఈ దశలోనే చైతన్యం గల, స్వతంత్రంగా వ్యవహరించగల నలుగురు సుప్రీం న్యాయమూర్తులు స్వతంత్ర భారత చరిత్రలో తొలి సారిగా జస్టిస్‌ చలమేశ్వర్‌ నాయకత్వంలో జరూరుగా సమావేశమై బహిరంగ పత్రిక గోష్ఠి నిర్వహించి జ్యుడీషియరీలో జరుగుతున్న బాగోతాన్ని కాస్తా నిర్భయంగా ఎండగట్టి, న్యాయవ్యవస్థ పరువు నిల్పడానికి ఒక చారిత్రక పాత్ర నిర్వహించాల్సి వచ్చింది. అయితే, తదనంతరం వచ్చిన ప్రధాన న్యాయమూర్తి తీరుపైనా, ఆయన రాజ్యసభ సీటు అంగీకరించడంపైనా విమర్శలు వచ్చాయి. చివరికి కొందరు న్యాయమూర్తులు ఏ స్థాయికి దిగజారిపోయారంటే, రాజ్యాంగం చట్టరీత్యా కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను, గ్యారంటీ చేసిన ప్రాథమిక స్వత్వాలన్నింటినీ బాహాటంగానో, నర్మగర్భంగానో హరించే రాజకీయ పాలనాశక్తులు శాసించే ఆదేశాలను పాటించి, న్యాయసూత్రాలను పక్కకు త్రోసిపుచ్చే దశకు చేరుకున్నారు. 

సరిగ్గా అలాంటి దుర్ముహూర్త ఘడియలు వేగంగా పాలకులకే గాదు, న్యాయవ్యవస్థను కూడా ముసురుకుంటున్న దశలోనే కారు చీకటిలో కొంత కాంతిరేఖలా ప్రధాన న్యాయమూర్తి బాబ్డే ధర్మాసనం నుంచి కొంత కొత్తగాలి వీచడం ఈ దేశంలో ప్రజాస్వామ్యం కొన ఊపిరితోనైనా బతికి ఉండటానికి తోడ్పడగల్గుతుందా? ఎందుకంటే– ఆ భరోసా భారత ప్రజాబాహుళ్యానికి కలగాలంటే, పాలకవర్గాలు రాజ్యాంగ చట్టానికి, ప్రకటిత సెక్యులర్‌ (లౌకిక వ్యవస్థా రక్షణకు) విధానాలకు, పౌర బాధ్యతల అధ్యాయంలో శాసించిన శాస్త్రీయ ఆలోచనా స్రవంతిని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉండాలి. ఆ భరోసా కలగడానికి పాలకశక్తులు– దేశ స్వాతంత్య్ర రక్షణకు, లౌకిక రాజ్యాంగ రక్షణకు బాధ్యత వహించి పేద మధ్యతరగతి కార్మిక, కర్షక, నిరుపేద వర్గాలతో మతాతీతంగా వ్యవహరిస్తున్న అభ్యుదయకర శక్తులకు అండదండలుగా నిలుస్తున్న ప్రజా ఉద్యమకారులు, రచయితలు,  కవులపైన, స్వాతంత్య్రోద్యమ కార్యకర్తలపైన నిర్బంధ విధానాన్ని తక్షణం రద్దు చేయాలి. అక్రమ కేసులు మోపి జైళ్లలో బంధించిన వారిని విడుదల చేయాలి. కేసులు ఎత్తివేయాలి.

ఈ విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఇక మీనమేషాలు లెక్కించకుండా తక్షణం ‘సుమోటో’గా స్వీకరించి, జస్టిస్‌ ఖన్నాలాగా (ఎమర్జెన్సీలో మొనగాడు న్యాయమూర్తిగా నిలిచి) వేలాదిమంది కార్యకర్తల విడుదలకు వంతెన నిర్మించి, అమెరికాలో సహితం కీర్తి పతాక సన్నివేశానికి చేరినట్టుగా నూతన అధ్యాయాన్ని రచించాలి! ఆ అవకాశాన్ని స్వతంత్ర శక్తిగా న్యాయస్థానం చేతికి అందివచ్చిన లౌకిక రాజ్యాంగ స్వభావాన్ని తు. చ. తప్పకుండా న్యాయస్థానాలు జారవిడుచుకోరాదు. అందుకు మొదటి గ్యారంటీ – నిర్ణయాలలో స్వతంత్ర శక్తిగా జ్యుడీషియరీ వ్యవహరించడమేనన్న రాజ్యాంగ నిర్దేశమే! ఆ శక్తి చొరవ లేకపోబట్టే వీమార్‌ (జర్మన్‌) జ్యుడీషియరీ చివరికి నాజీల పాలనకు లొంగిపో వలసి వచ్చింది. బహుశా ఈ చరిత్ర గుర్తుండబట్టే సుప్రసిద్ధ భారత న్యాయవాదులలో ఒకరైన ఎ.జి.నూరానీ ఒక సందర్భంలో, న్యాయవాద వృత్తి తొలిరోజుల్లో మరో వివాదాస్పద న్యాయమూర్తిని శక్తియుక్తులున్న  ‘బార్‌’ అదుపాజ్ఞల్లో ఉంచగలిగినట్లయితే మనకు ఈ ఇబ్బందులు తప్పేవని అన్నారు. అమెరికా సుప్రీంకోర్టు ఆయన లాంటి జడ్జీలను అనుమతించి ఉండేదీ కాదు అన్నారు.

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఎస్‌.వర్మ ఉత్తరోత్తరా న్యాయమూర్తులుగా తప్పుడుమార్గం తొక్కబోయే జడ్జీలు ‘బార్‌’లో ప్రవేశించడం వల్లనే ధర్మాసనం ప్రతిష్ట కూడా పతనం అవుతుందని హెచ్చరించారని మరచిపోకూడదు. 1918లో బ్రిటిష్‌ జ్యుడీషియల్‌ కమీషన్‌ పరిశీలనకు ఒక హెబియస్‌ కార్పస్‌ పిటి షన్‌ తీర్పు కోసం వచ్చినపుడు మన జాతీయోద్యమ నాయకుల్లో ఒక రైన సి.ఆర్‌.దాస్‌ ఆ కేసు విచారణ సందర్భంలో జడ్జీ కటువైన వ్యాఖ్యకు ఆగ్రహించి ఇక మీరు ఈ కేసును అసలు విచారించనే కూడ దని జవాబిచ్చారట!  అలాగే ప్రజల స్వేచ్ఛ స్వాతంత్య్రాలను హరించి దెబ్బతీసే చట్టాలను (1780 నుంచి 1919 దాకా); పత్రికలను అణచి వేసే నిర్బంధ చట్టాలను, ప్రెస్‌ యాక్ట్‌ లాంటి వలస పాలనా చట్టా లను ఖండిస్తూ క్రోఢీకరించి ప్రచురించిన ప్రసిద్ధ ఇంగ్లిష్‌ బారిస్టర్, మద్రాసు, కలకత్తా హైకోర్టులలో ప్రాక్టీస్‌ చేసిన ప్రసిద్ధుడు, జాతీయ కాంగ్రెస్‌ నాయకుల్లో ఒకరైన ఎర్డాలీ నోటన్‌ ఇలా అన్నారు:  న్యాయ మూర్తి తన స్థానంలో ఉండి జారీ చేసే అధికారిక తాఖీదులను తానుగా కావాలని చేయడు; అనిష్టంగానే రిజర్వేషన్‌తో జారీ చేస్తాడు. వ్యక్తి నచ్చినందున అధికారం అతనికి అప్పనంగా చేతికి రాదు.

అధి కారం ద్వారా పని అమలులోకి వస్తోంది. చట్టం నిర్వచించి  నివేదిం చిన దాన్ని పౌరుడు తెలుసుకుంటాడు. అప్పుడే అతనికి తన హక్కులే మిటో తెలుస్తాయి. తన హక్కులేమిటి, వాటిని ఎలా పొందాలని చెప్పే చట్టాల్ని, ఆ హక్కుల్ని స్పష్టంగా నిర్వహించాలని చెప్పే విధానాన్ని తెలుసుకోనంతకాలం ఏ పౌరుడూ తన హక్కుల్ని రక్షించుకోలేడు. ఇంతకూ న్యాయం చెప్పు నాగిరెడ్డీ అంటే, నాకూ ఇద్దరు ‘పెళ్లాలే’ అన్నట్టుగా న్యాయం ఉండకూడదు. ఆఖరి తీర్పూ, మొదటి తీర్పూ కూడా.

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement