ఫిర్యాదు చేస్తే, పోయేది అతగాడి పరువే!
మెన్‌టోన్
లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులందరూ మహిళలేనని, నిందితులందరూ పురుషులేనని మన సమాజానికి నిశ్చితాభిప్రాయం ఉంది. అభిప్రాయాలను గౌరవించడం ప్రజాస్వామిక లక్షణం. అందువల్ల ఘనత వహించిన మన పత్రికలు, ప్రసార సాధనాలు, న్యాయస్థానాలు ఈ అభిప్రాయాన్ని ఇతోధికంగా గౌరవిస్తూనే ఉన్నాయి. అభిప్రాయాలను గౌరవించడంలో ఎలాంటి పేచీ లేదు. అయితే, వాస్తవాలను కూడా గుర్తించాలి కదా అనేదే పురుషాధముల గోడు. అరివీరభయంకర మైకాసురుల విజృంభణ కొనసాగే మీడియాలో అభాగ్య పురుషాధముల గోడు ఎవరికి వినిపించాలి? అదంతా బధిర శంఖారావమే!
మహిళల బారిన పడి లైంగిక వేధింపులకు గురవుతున్న పురుషుల సంఖ్య గడచిన రెండు దశాబ్దాలుగా నెమ్మదిగా పెరుగుతూ వస్తోందని అనధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా వంటి అగ్రరాజ్యాల్లోను, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఇదే పరిస్థితి. రాజ్యాంగం ప్రవచించే సమానత్వమేదీ లైంగిక వేధింపుల చట్టాల్లో మచ్చుకైనా కనిపించదు. మన దేశం సంగతే తీసుకుంటే, ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 354, 354 ఎ, బీ, సీ, డీ సహా సంబంధిత ఇతరేతర చట్టాల్లోని సెక్షన్లన్నీ లైంగిక వేధింపుల కేసుల్లో... సమాజంలో ఎక్కువ సమానులైన మహిళలనే బాధితులుగా గుర్తిస్తాయి. పురుషులకు మహిళల నుంచి లైంగిక వేధింపులు ఎదురైతే, ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకోవాలో పోలీసులకు కూడా తెలియని పరిస్థితి.
మహిళల నుంచి లైంగిక వేధింపులకు గురయ్యే మగాళ్లలో చాలామంది ఎలాంటి ఫిర్యాదులూ చేయరు. వేధింపులు మరీ శ్రుతిమించి, మితిమీరితే గత్యంతరం లేని పరిస్థితుల్లో తప్ప పోలీస్ స్టేషన్లను, కోర్టులను ఆశ్రయించరు. కర్మకాలి ఎవడైనా మగాధముడు తనపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఫిర్యాదు చేస్తే, పోయేది అతగాడి పరువే! బాధితుడి గోడు ఆలకించి, సమస్యను పరిష్కరించాల్సిన పోలీసులు సైతం ముందు అతడినే గేలి చేస్తారు. ఇక వ్యవహారం మీడియా వరకు వెళితే రచ్చ రచ్చే! ఇంత జరిగినా బాధితుడికి న్యాయం జరుగుతుందని ఎలాంటి గ్యారంటీ లేదు. - దాసు