ఐపీసీ నుంచి ‘రాజద్రోహం’ తొలగించాలి
విరసం నేత వరవరరావు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) నుంచి కుట్ర, రాజద్రోహం సెక్షన్లను తొలగించాలని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. విరసం కార్యవర్గ సభ్యుడు ఖాసీంపై పెట్టిన కేసుని తక్షణమే ఎత్తివేయాలంటూ గీతాంజలి అధ్యక్షతన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాతెలంగాణ కోసం గొంతెత్తి నినదించిన ఖాసీంపై రాజద్రోహ నేరం మోపడం కుట్ర పూరితమన్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో పత్రికల చందాదారుల రసీదు పుస్తకాలు, పత్రికలు రాజద్రోహ నేరానికి కారణమెట్లా అవుతాయో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు.
మావోయుస్టుల ఎజెండానే నా ఎజెండా అన్న కేసీఆర్ ప్రభుత్వానికి ఖాసీం కుట్రదారుడిగా ఎలా కనిపించాడన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛని హరించే ఏ చర్యనైనా ఖండించాల్సిందేనని కవి శివారెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజులున్నారని నిరూపించేందుకే రాజద్రోహ కేసు పెట్టారని తెలకపల్లి రవి అభిప్రాయపడ్డారు. కల్‌బుర్గి నుంచి నిన్నటి రోహిత్ వరకు జరిగిన పరిణామాలు, నిషేధాలు అన్నీ తనతో కలిసి నడిచిన వారిని వదిలించుకునే చర్యల్లో భాగమేనని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు. ఏ ప్రభుత్వమయినా తన అధికారాన్ని కాపాడుకోవడానికే పనిచేస్తుందని, వ్యతిరేకంగా మాట్లాడేవారి గొంతు నొక్కేయడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని కవి నిఖిలేశ్వర్ చెప్పారు. వీక్షణం సంపాదకులు ఎన్ వేణుగోపాల్, ప్రజానాట్యమండలి ప్రతాపరెడ్డి, కవి యాకూబ్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, నందిని సిధారెడ్డి, బమ్మిడి జగదీశ్వరరావు, బండారు విజయ, అమ్మంగి వేణుగోపాల్, జూలూరి గౌరీశంకర్, నలమాస కృష్ణ, డప్పు రమేష్ పాల్గొన్నారు.