టీడీఎఫ్ బృందాన్ని విడుదల చేయాలి
విడుదలకు యత్నిస్తున్న వారిపై నిర్బంధం తగదు: వరవరరావు
హైదరాబాద్: విచారణ లేకుండా ఐదు నెలల నుంచి జైల్లోనే మగ్గిపోతున్న తెలంగాణ ప్రజాస్వామిక వేదిక (టీడీఎఫ్) నిజనిర్ధారణ బృందాన్ని వెంటనే విడుదల చేయాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. ఈ బృందాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై రాజ్య నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ మేరకు గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడు తూ..గత ఏడాది డిసెంబర్ 25న ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంలో ఏడుగురు సభ్యులున్న టీడీఎఫ్ బృందాన్ని తెలంగాణ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి అప్పగించిందని..
అప్పట్నుంచీ వారంతా ఆ రాష్ట్రంలోని సుకుమా జైల్లో మగ్గిపోతున్నారని ఆయన ఆరోపించారు. వీరి అరెస్టులపై ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులిద్దరూ మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. జైల్లో ఉన్న టీడీఎఫ్ నిజనిర్ధారణ బృందం విడుదల కోసం ప్రజాస్వామిక నేతలు, ప్రజలు ఆందోళనలు చేస్తున్నప్పటికీ వారికి మాత్రం బెయిల్ మంజూరు చేయడం లేదన్నారు. టీడీఎఫ్ సభ్యుల్ని బేషరతుగా విడుదల చేయాలని లేదంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీఎఫ్ కన్వీనర్ ఎన్. నారాయణరావు, కోట శ్రీనివాస్, ప్రజాకళామండలి నాయకులు కోటి తదితరులు పాల్గొన్నారు.