న్యూఢిల్లీ: స్వతంత్ర భారత చరిత్రలోనే చరిత్రాత్మకమని చెప్పదగ్గ ఘట్టం శుక్రవారం లోక్ సభలో ఆవిష్కృతమైంది. బ్రిటిష్ వలస పాలన తాలూకు అవశేషాలుగా కొనసాగుతూ వస్తున్న మూడు కీలక నేర న్యాయ చట్టాలకు చెల్లు చీటీ పాడే దిశగా పెద్ద ముందడుగు పడింది. వాటి స్థానంలో స్వదేశీ చట్టాలను తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ లు చరిత్రగా మిగలనున్నాయి. వాటి స్థానంలో పూర్తి భారతీయ చట్టాలు రానున్నాయి.
ఈ మేరకు న్యాయ సంహిత బిల్లు– 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు–2023, భారతీయ శిక్షా బిల్లు–2023లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. ‘ప్రతిపాదిత చట్టాలు దేశ నేర న్యాయ వ్యవస్థను సమూలంగా మెరుగు పరుస్తాయి. ప్రతి భారతీయుని హక్కులను పరిపూర్ణంగా పరిరక్షించాలన్న స్ఫూర్తికే పెద్ద పీట వేస్తాయి‘ అని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడంతో పాటు సమకాలీన అవసరాలు, వారి ఆకాంక్షలను తీర్చేందుకు అవసరమైన అన్ని మార్పుచేర్పులను కొత్త బిల్లుల్లో పొందుపరిచినట్టు వివరించారు. వాటిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాల్సిందిగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను మంత్రి కోరారు.
మూడేళ్లలో న్యాయం
ప్రతిపాదిత బిల్లులు ఆమోదం పొందితే నేర న్యాయ వ్యవస్థ సమూలంగా మెరుగు పడుతుందని అమిత్ షా అన్నారు. అంతేగాక ప్రతి పౌరునికీ గరిష్టంగా మూడేళ్లలో న్యాయం అందుతుందన్నారు. ‘కొత్త చట్టాల్లో మహిళలు, బాలలకు అత్యంత ప్రాధాన్యం దక్కనుంది. మూక దాడుల వంటి హేయమైన నేరాలకు కూడా నిర్దిష్టమైన శిక్షలను పొందుపరిచాం. తొలిసారిగా ఉగ్రవాదానికి కూడా నిర్వచించాం‘ అని ప్రకటించారు. ‘రాజద్రోహం సెక్షన్ ను పూర్తిగా ఎత్తేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ భావ వ్యక్తీకరణ హక్కు ఉంటుంది‘ అని వివరించారు. ‘ఈ బిల్లులు మన నేర న్యాయ వ్యవస్థను సమూలంగా మెరుగు పరుస్తాయని సభకు హామీ ఇస్తున్నా. వీటి లక్ష్యం శిక్ష విధింపు కాబోదు.
న్యాయం అందేలా చూడటమే ప్రధానోద్దేశం. కొత్త చట్టాల్లో కేవలం నేరాలను నియంత్రించే లక్ష్యంతో మాత్రమే శిక్ష విధింపులు ఉంటాయి‘ అన్నారు. బ్రిటిష్ కాలం నాటి ప్రస్తుత చట్టాల నిండా బానిసత్వపు చిహా్నలే ఉన్నాయని విమర్శించారు. ‘అధికారంలో ఉన్నవారిని వ్యతిరేకించే ప్రతి ఒక్కరినీ ఏదోలా శిక్షించడం వాటి ఏకైక లక్ష్యము. బ్రిటిష్ అధికారాన్ని పరిరక్షించడం, బలోపేతం చేయడమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న చట్టాలవి. శిక్షించడమే వాటి ప్రధాన లక్ష్యం తప్ప న్యాయం అందించడం కాదు‘ అని ఆరోపించారు. శిక్ష పడే రేటును కనీసం 90 శాతానికి పెంచడమే కొత్త చట్టాల లక్ష్యమన్నారు. ఇందుకోసం ఫోరెన్సిక్ సైన్స్ వాడకాన్ని మరింతగా పెంచే యోచన కూడా ఉందని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
► మూక దాడులకు, మైనర్లపై అత్యాచారానికి మరణశిక్ష.
► దేశం పట్ల నేరాలను ఇకపై అతి తీవ్రమైనవిగా పరిగణిస్తారు.
► కొన్ని రకాల చిల్లర నేరాలకు శిక్షగా సామాజిక సేవ (అమల్లోకి వస్తే ఇలాంటి శిక్ష ఇదే తొలిసారి అవుతుంది).
► వేర్పాటువాదం, తత్సంబంధ చర్యలు, సాయుధ తిరుగుబాటు, భారత సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను ప్రమాదంలో పడవేయడం వంటి కొత్త నేరాలను పొందుపరిచారు.
► పలు నేరాలకు ఇకపై లింగ భేదం ఉండబోదు.
► పెళ్లి, ఉద్యోగం, ప్రమోషన్ల వంటి ప్రలోభాలు చూపి, గుర్తింపును దాచి మహిళలను లైంగికంగా దోచుకోవడం నేరంగా పరిగణనలోకి వస్తుంది.
► గ్యాంగ్ రేప్ కు 20 ఏళ్లు, లేదా జీవిత ఖైదు.
► తీవ్రతను బట్టి మూక దాడులకు ఏడేళ్లు, జీవిత ఖైదు, లేదా మరణ శిక్ష.
► తొలిసారిగా ఉగ్రవాదానికి నిర్వచనం.
► ఉగ్రవాదుల ఆస్తుల జప్తు
రాజకీయ రెమిషన్లకు చెక్...
శిక్ష తగ్గింపు (రెమిషన్) వంటి సదుపాయాలను రాజకీయ లబి్ధకి వాడుకోవడాన్ని నిరోధించేందుకు ప్రతిపాదిత బిలుల్లో కొత్త సెక్షన్లు పొందుపరిచారు. వాటి ప్రకారం...
► ఇకపై మరణశిక్షను కేవలం జీవిత ఖైదుగా మాత్రమే మార్చేందుకు వీలవుతుంది.
► జీవిత ఖైదును ఏడేళ్ల శిక్షగా మాత్రమే మార్చవచ్చు.
► బిహార్ కు చెందిన నేరమయ నేత ఆనంద్ మోహన్ కు క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడానికి అమిత్ షా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకే రాజకీయ అండదండలున్న వారు చట్టం బారి నుంచి తప్పించుకోకుండా చూసేందుకే ఈ సెక్షన్లను చేర్చినట్లు వివరించారు.
కొత్త నేర–న్యాయ ప్రక్రియ ఇదీ
► 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి.
► పరిస్థితిని సమీక్షించాక కోర్టు మరో 90 రోజుల సమయం ఇవ్వొచ్చు.
► దర్యాప్తును 180 రోజుల్లోపు పూర్తి చేసి విచారణకు పంపాలి.
► విచారణ ముగిశాక 30 రోజుల్లోపు తీర్పు వెలువడాలి.
న్యాయ సంహిత బిల్లు ప్రకారం ఉగ్రవాది అంటే...
► దేశంలో గానీ, విదేశాల్లో గానీ భారత దేశ ఐక్యతను, సమగ్రతను, భద్రతను ప్రమాదంలో పడేసే చర్యలకు పాల్పడేవాడు.
► తద్వారా జన సామాన్యాన్ని, లేదా ఒక వర్గాన్ని భయభీతులను చేసేవాడు, శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించేవాడు.
రాజద్రోహం ఇక దేశద్రోహం
బ్రిటిష్ కాలం నాటి వివాదాస్పద రాజద్రోహ చట్టాన్ని తొలగించనున్నట్టు కేంద్రం ప్రతిపాదించింది. అదే సమయంలో దేశద్రోహం పేరిట దానికి కొత్త రూపు ఇవ్వనుంది. బ్రిటిష్ సింహాసనాన్ని గుర్తు చేసే వలస వాసనలు వదిలించుకోవడమే పేరు మార్పు ఉద్దేశమని పేర్కొంది. బీఎన్‌ఎస్ బిల్లులో ప్రతిపాదించిన ఈ కొత్త చట్టాన్ని మరిన్ని కొత్త సెక్షన్లతో మరింత బలోపేతం కూడా చేయనుంది. దాని ప్రకారం... ఉద్దేశపూర్వకంగా నోటిమాట ద్వారా, రాతపూర్వకంగా, సైగలు, చిహ్నాల ద్వారా, అందరికీ బయటికి కనిపించేలా, ఎలక్ట్రానిక్ కమ్యూనికషన్స్ ద్వారా, ఆర్థిక సాధనాల ద్వారా, ఇతరత్రా, రెచ్చగొట్టే చర్యల ద్వారా, వేర్పాటువాదం ద్వారా, సాయుధ తిరుగుబాటు ద్వారా, అలాంటి ధోరణులను ప్రోత్సహించినా, దేశ సార్వ¿ౌమత్వాన్ని, సమైక్యతను, సమగ్రతను ప్రమాదంలో పడేసినా, అలాంటి మరే ఇతర చర్యలకు పాల్పడినా అది దేశ ద్రోహమే.
► దేశానికి వ్యతిరేకంగా చేసే ఎలాంటి పనినైనా దేశ ద్రోహంగానే పరిగణిస్తారు.
► శాంతి సమయంలో ప్రభుత్వంపై యుద్ధం చేసినా, అందుకు ప్రయతి్నంచినా, అందుకోసం విదేశీ ప్రభుత్వాలతో చేతులు కలిపినా, అలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించినా అందుకోసం మూకలను, ఆయుధాలను సమీకరించినా, అందుకు ప్రయతి్నంచినా, అలాంటి ప్రయత్నాలు గురించి తెలిసీ చెప్పకపోయినా, వాటిని దాచినా, అది దేశ ద్రోహమే.
► నేర తీవ్రతను బట్టి అందుకు జీవిత ఖైదు, పదేళ్లకు మించని, లేదా ఏడేళ్ల ఖైదు, వాటితో పాటు జరిమానా కూడా పడవచ్చు.
‘నేర న్యాయ చట్టాలను సమూలంగా మదింపు చేయాల్సిన, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని 70 ఏళ్ల ప్రజాస్వామ్య భారత అనుభవం చెబుతోంది. సబ్ కా సాత్ (అందరికీ తోడు), సాబ్ కా వికాస్ (అందరి అభివృద్ధి), సాబ్ కా విశ్వాస్ (అందరి నమ్మకం), సాబ్ కా ప్రయాస్ (అందరి ప్రయత్నం) అన్నదే కేంద్ర ప్రభుత్వ మంత్రం‘
– బీఎన్‌ఎస్‌ఎస్ బిల్లు లక్ష్య ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment