ipc section
-
Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు ఊహించని షాక్
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణకు మరో షాక్ తగిలింది. తాజాగా అతడిపై అత్యాచారం కేసు నమోదైంది.వివరాల ప్రకారం.. కర్ణాటకలో సంచనలంగా మారిన ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు విషయంలో పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ప్రజ్వల్‌పై అత్యాచారం కేసు నమోదైంది. లైంగిక వేధింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌పై సిట్ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ఐపీసీ సెక్షన్ 376 (బీ) (ఎన్), 506, 354(ఏ)(2), 354(బీ), 354(సీ), ఐటీ చట్టం కింద కేసు ఫైల్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో ప్రజ్వల్ రేవణ్ణను ఏకైక నిందితుడిగా చేర్చారు. కాగా, ఇది ప్రజ్వల్‌పై నమోదైన రెండో కేసు.ఇదిలా ఉండగా.. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ దర్యాప్తు చేపడుతోంది. ఇందులో భాగంగా విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా ఎస్పీ సీమా లాట్కార్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, తనకు సమయం కావాలని ప్రజ్వల్ రేవణ్ణ సిట్ అధికారులను కోరారు. Karnataka government's special investigation team (SIT) filed a rape case against Janata Dal (Secular)'s Hassan MP #PrajwalRevanna. This is the second #FIR against Prajwal Revanna, who is also the grandson of JDS chief and former PM HD Deve Gowda.The FIR against JDS' (cont) pic.twitter.com/A6tKUIFsYu— News Daily 24 (@nd24_news) May 3, 2024 ఈ నేపథ్యంలో ప్రజ్వల్ ట్విట్టర్ వేదికగా‘సిట్ ముందు హాజరుకావడానికి ఏడు రోజుల సమయం కావాలి. ఇప్పుడు నేను బెంగళూరులో లేను’ అంటూ ఒక పోస్టు చేశాడు. కాగా, ప్రజ్వల్ అభ్యర్థనను సిట్ తిరస్కరించింది. ఈ మేరకు గురువారం ఉదయం మరోసారి సమన్లు పంపింది. అనంతరం కొద్దిసేపటికే ఆయనపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనపై అత్యాచారం కేసు కూడా నమోదు చేసింది.ప్రస్తుతం ప్రజ్వల్ జర్మనీలో ఉన్నట్లు తేలింది. లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రజ్వల్.. డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ ఉపయోగించి ఏప్రిల్ 28న జర్మనీ పారిపోయారు. ఈ క్రమంలో మరోవైపు అతడి పాస్‌పోర్ట్ రద్దు చేసి, ప్రజ్వల్‌ను భారత్‌కు రప్పించటంలో సాయం చేయాలని ప్రధాని మోదీని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కోరారు. మరోవైపు విచారణకు హాజరు కాకపోతే దేశానికి తిరిగి వచ్చిన వెంటనే ప్రజ్వల్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. -
ఐపీసీ, సీఆర్పీసీ స్దానంలో కొత్త చట్టాలు.. చిల్లర నేరాలకు శిక్షగా సామాజిక సేవ
న్యూఢిల్లీ: స్వతంత్ర భారత చరిత్రలోనే చరిత్రాత్మకమని చెప్పదగ్గ ఘట్టం శుక్రవారం లోక్ సభలో ఆవిష్కృతమైంది. బ్రిటిష్ వలస పాలన తాలూకు అవశేషాలుగా కొనసాగుతూ వస్తున్న మూడు కీలక నేర న్యాయ చట్టాలకు చెల్లు చీటీ పాడే దిశగా పెద్ద ముందడుగు పడింది. వాటి స్థానంలో స్వదేశీ చట్టాలను తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ లు చరిత్రగా మిగలనున్నాయి. వాటి స్థానంలో పూర్తి భారతీయ చట్టాలు రానున్నాయి. ఈ మేరకు న్యాయ సంహిత బిల్లు– 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు–2023, భారతీయ శిక్షా బిల్లు–2023లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. ‘ప్రతిపాదిత చట్టాలు దేశ నేర న్యాయ వ్యవస్థను సమూలంగా మెరుగు పరుస్తాయి. ప్రతి భారతీయుని హక్కులను పరిపూర్ణంగా పరిరక్షించాలన్న స్ఫూర్తికే పెద్ద పీట వేస్తాయి‘ అని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడంతో పాటు సమకాలీన అవసరాలు, వారి ఆకాంక్షలను తీర్చేందుకు అవసరమైన అన్ని మార్పుచేర్పులను కొత్త బిల్లుల్లో పొందుపరిచినట్టు వివరించారు. వాటిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాల్సిందిగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను మంత్రి కోరారు. మూడేళ్లలో న్యాయం ప్రతిపాదిత బిల్లులు ఆమోదం పొందితే నేర న్యాయ వ్యవస్థ సమూలంగా మెరుగు పడుతుందని అమిత్ షా అన్నారు. అంతేగాక ప్రతి పౌరునికీ గరిష్టంగా మూడేళ్లలో న్యాయం అందుతుందన్నారు. ‘కొత్త చట్టాల్లో మహిళలు, బాలలకు అత్యంత ప్రాధాన్యం దక్కనుంది. మూక దాడుల వంటి హేయమైన నేరాలకు కూడా నిర్దిష్టమైన శిక్షలను పొందుపరిచాం. తొలిసారిగా ఉగ్రవాదానికి కూడా నిర్వచించాం‘ అని ప్రకటించారు. ‘రాజద్రోహం సెక్షన్ ను పూర్తిగా ఎత్తేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ భావ వ్యక్తీకరణ హక్కు ఉంటుంది‘ అని వివరించారు. ‘ఈ బిల్లులు మన నేర న్యాయ వ్యవస్థను సమూలంగా మెరుగు పరుస్తాయని సభకు హామీ ఇస్తున్నా. వీటి లక్ష్యం శిక్ష విధింపు కాబోదు. న్యాయం అందేలా చూడటమే ప్రధానోద్దేశం. కొత్త చట్టాల్లో కేవలం నేరాలను నియంత్రించే లక్ష్యంతో మాత్రమే శిక్ష విధింపులు ఉంటాయి‘ అన్నారు. బ్రిటిష్ కాలం నాటి ప్రస్తుత చట్టాల నిండా బానిసత్వపు చిహా్నలే ఉన్నాయని విమర్శించారు. ‘అధికారంలో ఉన్నవారిని వ్యతిరేకించే ప్రతి ఒక్కరినీ ఏదోలా శిక్షించడం వాటి ఏకైక లక్ష్యము. బ్రిటిష్ అధికారాన్ని పరిరక్షించడం, బలోపేతం చేయడమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న చట్టాలవి. శిక్షించడమే వాటి ప్రధాన లక్ష్యం తప్ప న్యాయం అందించడం కాదు‘ అని ఆరోపించారు. శిక్ష పడే రేటును కనీసం 90 శాతానికి పెంచడమే కొత్త చట్టాల లక్ష్యమన్నారు. ఇందుకోసం ఫోరెన్సిక్ సైన్స్ వాడకాన్ని మరింతగా పెంచే యోచన కూడా ఉందని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ► మూక దాడులకు, మైనర్లపై అత్యాచారానికి మరణశిక్ష. ► దేశం పట్ల నేరాలను ఇకపై అతి తీవ్రమైనవిగా పరిగణిస్తారు. ► కొన్ని రకాల చిల్లర నేరాలకు శిక్షగా సామాజిక సేవ (అమల్లోకి వస్తే ఇలాంటి శిక్ష ఇదే తొలిసారి అవుతుంది). ► వేర్పాటువాదం, తత్సంబంధ చర్యలు, సాయుధ తిరుగుబాటు, భారత సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను ప్రమాదంలో పడవేయడం వంటి కొత్త నేరాలను పొందుపరిచారు. ► పలు నేరాలకు ఇకపై లింగ భేదం ఉండబోదు. ► పెళ్లి, ఉద్యోగం, ప్రమోషన్ల వంటి ప్రలోభాలు చూపి, గుర్తింపును దాచి మహిళలను లైంగికంగా దోచుకోవడం నేరంగా పరిగణనలోకి వస్తుంది. ► గ్యాంగ్ రేప్ కు 20 ఏళ్లు, లేదా జీవిత ఖైదు. ► తీవ్రతను బట్టి మూక దాడులకు ఏడేళ్లు, జీవిత ఖైదు, లేదా మరణ శిక్ష. ► తొలిసారిగా ఉగ్రవాదానికి నిర్వచనం. ► ఉగ్రవాదుల ఆస్తుల జప్తు రాజకీయ రెమిషన్లకు చెక్... శిక్ష తగ్గింపు (రెమిషన్) వంటి సదుపాయాలను రాజకీయ లబి్ధకి వాడుకోవడాన్ని నిరోధించేందుకు ప్రతిపాదిత బిలుల్లో కొత్త సెక్షన్లు పొందుపరిచారు. వాటి ప్రకారం... ► ఇకపై మరణశిక్షను కేవలం జీవిత ఖైదుగా మాత్రమే మార్చేందుకు వీలవుతుంది. ► జీవిత ఖైదును ఏడేళ్ల శిక్షగా మాత్రమే మార్చవచ్చు. ► బిహార్ కు చెందిన నేరమయ నేత ఆనంద్ మోహన్ కు క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడానికి అమిత్ షా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకే రాజకీయ అండదండలున్న వారు చట్టం బారి నుంచి తప్పించుకోకుండా చూసేందుకే ఈ సెక్షన్లను చేర్చినట్లు వివరించారు. కొత్త నేర–న్యాయ ప్రక్రియ ఇదీ ► 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. ► పరిస్థితిని సమీక్షించాక కోర్టు మరో 90 రోజుల సమయం ఇవ్వొచ్చు. ► దర్యాప్తును 180 రోజుల్లోపు పూర్తి చేసి విచారణకు పంపాలి. ► విచారణ ముగిశాక 30 రోజుల్లోపు తీర్పు వెలువడాలి. న్యాయ సంహిత బిల్లు ప్రకారం ఉగ్రవాది అంటే... ► దేశంలో గానీ, విదేశాల్లో గానీ భారత దేశ ఐక్యతను, సమగ్రతను, భద్రతను ప్రమాదంలో పడేసే చర్యలకు పాల్పడేవాడు. ► తద్వారా జన సామాన్యాన్ని, లేదా ఒక వర్గాన్ని భయభీతులను చేసేవాడు, శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించేవాడు. రాజద్రోహం ఇక దేశద్రోహం బ్రిటిష్ కాలం నాటి వివాదాస్పద రాజద్రోహ చట్టాన్ని తొలగించనున్నట్టు కేంద్రం ప్రతిపాదించింది. అదే సమయంలో దేశద్రోహం పేరిట దానికి కొత్త రూపు ఇవ్వనుంది. బ్రిటిష్ సింహాసనాన్ని గుర్తు చేసే వలస వాసనలు వదిలించుకోవడమే పేరు మార్పు ఉద్దేశమని పేర్కొంది. బీఎన్ఎస్ బిల్లులో ప్రతిపాదించిన ఈ కొత్త చట్టాన్ని మరిన్ని కొత్త సెక్షన్లతో మరింత బలోపేతం కూడా చేయనుంది. దాని ప్రకారం... ఉద్దేశపూర్వకంగా నోటిమాట ద్వారా, రాతపూర్వకంగా, సైగలు, చిహ్నాల ద్వారా, అందరికీ బయటికి కనిపించేలా, ఎలక్ట్రానిక్ కమ్యూనికషన్స్ ద్వారా, ఆర్థిక సాధనాల ద్వారా, ఇతరత్రా, రెచ్చగొట్టే చర్యల ద్వారా, వేర్పాటువాదం ద్వారా, సాయుధ తిరుగుబాటు ద్వారా, అలాంటి ధోరణులను ప్రోత్సహించినా, దేశ సార్వ¿ౌమత్వాన్ని, సమైక్యతను, సమగ్రతను ప్రమాదంలో పడేసినా, అలాంటి మరే ఇతర చర్యలకు పాల్పడినా అది దేశ ద్రోహమే. ► దేశానికి వ్యతిరేకంగా చేసే ఎలాంటి పనినైనా దేశ ద్రోహంగానే పరిగణిస్తారు. ► శాంతి సమయంలో ప్రభుత్వంపై యుద్ధం చేసినా, అందుకు ప్రయతి్నంచినా, అందుకోసం విదేశీ ప్రభుత్వాలతో చేతులు కలిపినా, అలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించినా అందుకోసం మూకలను, ఆయుధాలను సమీకరించినా, అందుకు ప్రయతి్నంచినా, అలాంటి ప్రయత్నాలు గురించి తెలిసీ చెప్పకపోయినా, వాటిని దాచినా, అది దేశ ద్రోహమే. ► నేర తీవ్రతను బట్టి అందుకు జీవిత ఖైదు, పదేళ్లకు మించని, లేదా ఏడేళ్ల ఖైదు, వాటితో పాటు జరిమానా కూడా పడవచ్చు. ‘నేర న్యాయ చట్టాలను సమూలంగా మదింపు చేయాల్సిన, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని 70 ఏళ్ల ప్రజాస్వామ్య భారత అనుభవం చెబుతోంది. సబ్ కా సాత్ (అందరికీ తోడు), సాబ్ కా వికాస్ (అందరి అభివృద్ధి), సాబ్ కా విశ్వాస్ (అందరి నమ్మకం), సాబ్ కా ప్రయాస్ (అందరి ప్రయత్నం) అన్నదే కేంద్ర ప్రభుత్వ మంత్రం‘ – బీఎన్ఎస్ఎస్ బిల్లు లక్ష్య ప్రకటన -
చట్టాలకు ప్రక్షాళన.. IPC, CRPC స్థానంలో కొత్త చట్టాలు
ఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి చట్టాలను ప్రక్షాళన చేస్తూ కొత్త చట్టాలు తీసుకొచ్చే క్రమంలో కేంద్రం ముందడుగు వేసింది. 1860 ఇండియన్ పీనల్ కోడ్(భారత శిక్షా స్మృతి)తో పాటు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(CRPC), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్(IEA) చట్టాలను భర్తీ చేసేలా కొత్త చట్టాలను తెరపైకి తెచ్చింది. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, సీఆర్పీసీ ప్లేస్‌లో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్యా చట్టాలను తెచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా చివరిరోజైన శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రతిపాదనలను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో కొత్త చట్టాల్ని.. భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు- 2023లను తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిస్తామని చెప్పారు. ‘‘బ్రిటీష్ కాలం నాటి కాలం చెల్లిన చట్టాలను ప్రక్షాళన చేస్తున్నాం. కొత్త చట్టాలతో 90 శాతంపైగా నేరగాళ్లకు శిక్షలు ఖాయం’’ అని వెల్లడించారు. కొత్త చట్టాలు మహిళలు, పిల్లలపై నేరాలతో పాటు హత్యా నేరాలు, దేశానికి వ్యతిరేకంగా చేసే నేరాల కట్టడిని ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని సవరణలు చేసినట్లు వెల్లడించారు. కొత్త చట్టాల ప్రతిపాదన ప్రకారం.. ఏడేళ్లకు పైగా శిక్షపడే కేసుల్లో ఫోరెన్సిక్ తనిఖీ తప్పనిసరి చేశారు. రాజద్రోహం(Sedition) వంటి చట్టాన్ని తొలగించారు. ఉద్దేశపూర్వకంగా (ఏదైనా రూపంలో సరే).. సాయుధ తిరుగుబాటుకు ఉసిగొల్పడం, విధ్వంసక కార్యకలాపాలను ప్రేరేపించే ప్రయత్నాలు, వేర్పాటువాద కార్యకలాపాల భావాలను ప్రోత్సహించడం నేరం. అది భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతాసమగ్రతలను ప్రమాదంలో పడేస్తుంది. ఇలాంటి చర్యలకు పాల్పడినా.. పాలుపంచుకున్నా జీవిత ఖైదు, లేదంటే ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది అలాగే జరిమానా కూడా. ఇక మూక హత్యలకు మరణశిక్ష విధించేలా ప్రొవిజన్‌ను ప్రవేశపెట్టారు. గ్యాంగ్ రేప్‌లకు 20 ఏళ్ల జైలు శిక్ష నుంచి జీవితఖైదు, మైనర్లపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధిస్తారు. ఇక క్రిమినల్ ప్రొసీజర్‌లో 300పైకి మార్పులు చేశారు. ఎక్కడ నుంచైనా ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. కేసుల సత్వర పరిష్కారం కోసమేనని కేంద్రం వెల్లడించింది. మరణశిక్షను మాత్రం అలాగే ఉంచారు. వివిధ నేరాలకు జరిమానాలు, శిక్షలను కూడా పెంచారు. చిన్న చిన్న నేరాలకు సమాజ సేవలాంటి శిక్షలను సైతం విధిస్తారు. #WATCH | Union Home Minister Amit Shah says, "...Under this Bill, we have set the goal that the conviction ratio has to be taken above 90%. That is why, we have brought an important provision that the Sections which provide for 7 years or a greater jail term, under all those… pic.twitter.com/Ap0eSzdCsG — ANI (@ANI) August 11, 2023 అమిత్ షా లోక్‌సభలో మాట్లాడుతూ.. ‘1860 నుండి 2023 వరకు, దేశంలోని నేర న్యాయ వ్యవస్థ బ్రిటిష్ వారు చేసిన చట్టాల ప్రకారం పనిచేసింది. వాటిని ఈ మూడు చట్టాలు భర్తీ చేస్తాయన్నారు. దేశంలో నేర న్యాయ వ్యవస్థలో పెనుమార్పు వస్తుందన్నారు. కొత్త మూడు చట్టాలు.. భారత పౌరుల హక్కులను పరిరక్షిస్తాయి. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌లు బ్రిటిష్ కాలంనాటి చట్టాలు. ఆంగ్లేయుల పాలనను రక్షించడం, బలోపేతం చేయడంతోపాటు శిక్షించడమే లక్ష్యంగా వాటిని ప్రవేశపెట్టారు. బాధితులకు న్యాయం చేయడం వాటి ఉద్దేశం కాదు. కానీ, శిక్ష వేయడం కాదు.. న్యాయం అందించడం ఈ కొత్త చట్టాల లక్ష్యం. అలాగే నేరాలను అరికట్టేందుకు శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. #WATCH | Union Home Minister Amit Shah says, "...Under this law, we are repealing laws like Sedition...," as he speaks on Bharatiya Nyaya Sanhita Bill, 2023; The Bharatiya Sakshya Bill, 2023 and The Bharatiya Nagrik Suraksha Sanhita Bill in Lok Sabha. pic.twitter.com/CHlz0VOf7Z — ANI (@ANI) August 11, 2023 -
124–ఏ సెక్షన్‌ను ఎందుకు రద్దు చేయాలి?
‘‘ఇండియా తేరే తుకడే తుకడే కరేంగే’’ అని ఊరేగింపులలో బహిరంగంగా అరవడం దేశద్రోహం కాకపోతే, మరేమిటి? భారత పార్లమెంటుపై హంతక దాడికి పాల్పడిన ఉగ్ర వాదులనూ, వారిని ప్రేరేపించిన వారినీ, వారికి శిక్షణ ఇచ్చిన వారినీ హీరోలుగా కీర్తించడం దేశద్రోహం అవ్వక మరే మౌతుంది? ప్రభుత్వాన్ని పడగొట్టి శ్రామికవర్గ నియంతృత్వాన్ని స్థాపించే లక్ష్యంతో సొంత బలగాలను పెంచుకోవడం, సైన్యం దేశరక్షణ బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పుడు వారిపై దొంగ దాడులకు పాల్పడటం దేశద్రోహం కాకపోతే మరింకేమిటి? ముస్లింలు సురక్షితంగా ఉండేందుకూ, వారికి స్వయం పాలన ఒనగూడేందుకూ భారతదేశాన్ని మరోసారి విభజించి మొఘలి స్థాన్‌ను సృష్టించాలని ఒక ప్రొఫెసర్ రాస్తే అది దేశద్రోహం కాకుండా ఎలా ఉంటుంది? హత్య, అత్యాచారం, దోపిడీ అనేవి 150 ఏళ్లకు పైగా ఉన్న భారతీయ శిక్షాస్మృతి ప్రకారం నేటికీ శిక్షార్హమే అయినప్పుడు ఆ కాలం నాటిదే అయిన 124–ఏ సెక్షన్‌ను ఎందుకు రద్దు చేయాలి? (చదవండి: నల్ల చట్టానికి అమృతోత్సవాలా?) వలస పాలకుల కాలంలో 150 ఏళ్ల క్రితం నేరాలుగా పరి గణన పొందినవి నేడెలా నేరం కాకుండా పోతాయి? భారతదేశంలో దేశ వ్యతిరేక, సమాజ వ్యతిరేక, విదేశీ ప్రేరక... వ్యక్తులూ, సిద్ధాంత కర్తలూ, కార్యకర్తలూ ఉన్నారు. ప్రజాస్వామిక స్వేచ్ఛా భారతాన్ని వారి నుంచి రక్షించడానికి దేశద్రోహ ప్రసంగాలను, రచనలను, ప్రచారాలను, చర్యలను గుర్తించాలి, గమనించాలి, శిక్షించాలి. అందుకోసం రాజద్రోహాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 124–ఏను కొనసాగించాలి. న్యాయబద్ధంగా నిందితులను విచారించాలి. దోషులకు శిక్షలు విధించాలి. ఈ విషయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజుజు దృఢ వైఖరి సరైనది, ప్రశంసనీయమైనది. (క్లిక్: దేశద్రోహం కేసు నిందితుడిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా) – డాక్టర్ టి. హనుమాన్ చౌదరి; చైర్మన్, ప్రజ్ఞాభారతి -
పరువు హత్యలు మానవతకు అవమానం!
దేశంలో రాజ్యాంగం అమలు లోకి వచ్చి 71 వసంతాలు గడిచిపోయాయి. భారత రాజ్యాంగం పౌరులందరికీ కుల మత ప్రాంతాలకు అతీతంగా సమానత్వం, సమ న్యాయం, వ్యక్తిగత స్వేచ్ఛ, లింగ వివక్ష లేని సౌభ్రాతృత్వాన్ని ప్రసాదించింది. అందులో భాగంగా ఆర్టికల్ 21 వ్యక్తిగత స్వేచ్ఛతో స్వతంత్రంగా జీవించే హక్కును కల్పించింది, ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధించింది. దేశం కుల రహిత సమాజంగా రూపాంతరం చెంది పౌరుల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు తొలగించడం రాజ్యాంగ అంతిమ లక్ష్యం. ఇవే అంశాలను సుప్రీంకోర్టు 2011లో ‘కేకే భాస్కరన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు’, ‘నందిని వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్‌గఢ్’ కేసుల తీర్పుల్లో స్పష్టంగా తెలియజేసింది. పురాతన ఆచార సంప్రదాయాలు మానవాళిని అభివృద్ధి పథంలో నడిపించేలా ఉండాలి. కానీ, సంప్రదాయాల చుట్టూ అవివేకంగా పరిభ్రమించేలా ఉండకూడదు. నానాటికీ పరువు హత్యల పేరుపై కులాంతర వివాహాలు చేసుకున్న వారినీ, చేసుకోవడానికి సిద్ధమైన వారినీ, వారి కుటుంబ సభ్యులనూ హత్యలు చేయడం లేదా దాడులు చేయడం ఎక్కువవుతోంది. ముఖ్యంగా నయా క్షత్రియ కులాలు, దళిత – బహుజన కులాల మధ్య జరుగుతున్న ప్రేమ వివాహాల సంఖ్య కంటే రెట్టింపు సంఖ్యలో హత్యలు/దాడులు జరుగుతున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 1936లో కులాంతర వివాహాలతోనే కుల నిర్మూలన సాధ్యమని చెప్పిన సంగతిని అందరూ గుర్తుపెట్టకోవాలి. కేంద్ర ప్రభుత్వం 2013లో ‘లా’ కమిషన్ ఇచ్చిన 242వ నివేదిక ఆధారంగా... ప్రేమ వివాహితుల హత్యల నివారణకు చట్టాన్ని ప్రతిపాదించింది. సదరు చట్టంపై రాష్ట్ర ప్రభుత్వాల నుండి సూచనలు, సలహాలను స్వీకరించే పనిలో ఉన్నారు. కుల అహంకార హత్యల కట్టడికి ప్రత్యేక చట్టం లేని కారణంగా ప్రస్తుతం ఐపీసీ సెక్షన్ 300 ప్రకారం హత్యకేసు నమోదు చేస్తుండడంతో... దోషులు బెయిల్ పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. (చదవండి: వివక్షను బయటి నుంచి చూస్తే ఎలా?) సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాలు 2018లో ‘శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’, 2021లో ‘హరి వర్సెస్ స్టేట్ అఫ్ ఉత్తర ప్రదేశ్’ కేసుల తీర్పుల్లో కుల అహంకార హత్యల నివారణ, విచారణకు సంబంధించి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. దేశంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన హత్యలను జిల్లాల వారీగా లెక్కించడంతోపాటూ ఆయా జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి నివారణ చర్యలు చేపట్టాలి. ప్రతి జిల్లాలో 24 గంటల హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. కులాంతర/ మతాంతర వివాహ జంటలను గుర్తించి వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక రక్షణలను కల్పించాలి. అధికారుల నిర్లక్ష్యంతో హత్యలు జరిగినట్లయితే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి అనేవి ఇందులో ముఖ్యమైనవి. (చదవండి: నేరస్థుల గుర్తింపు బిల్లుపై చర్చ ఏది?) రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం అంటరాని తనం నిషేధితమయ్యింది కనుక షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సామాజిక భద్రత కల్పనలో భాగంగా 1989లో అత్యాచార నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా కులనిర్మూలన జరగాలన్నా, కుల అహంకారంతో చేస్తున్న పరువు హత్యలను కట్టడి చేయాలన్నా రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ ‘17ఏ’ను చేర్చి కుల వ్యవస్థను నిషేధించాలి. దీన్ని అన్ని రాజకీయ పార్టీలూ ప్రధాన అంశంగా తీసుకోవాలి. అలాగే అన్ని మతాలకు సంబంధించిన పెద్దలు ముందుకువచ్చి పరువు హత్యలకు వ్యతిరేకంగా గళం విప్పాలి. అప్పుడే ఈ అమానవీయ హత్యాకాండకు తెరపడుతుంది. - కోడెపాక కుమారస్వామి సామాజిక విశ్లేషకులు -
సిగ్గు పడాల్సిన భారత జాతీయ నేరం వధూహత్య
‘వరకట్నమరణ’ నేరాన్ని మెకాలే కనిపెట్టలేదు. భారతదేశ భర్తలు, అత్తమామలు, ఆడపడచుల అనేక ఘోరనేరాల వల్ల భారత సమాజమే స్వతంత్రదేశంలో దీన్ని కొత్త నేరంగా నిర్వచించింది. సాక్ష్యాలు లేని నాలుగు గోడల మధ్య కుటుంబ సభ్యులే, అంటే పాత నేరగాళ్లు కాదు, సాగించే దారుణమైన హత్యలకు సరైన శిక్షలు విధించడానికి కావలసిన నియమాలు, విధానాలు పార్లమెంటు రూపొందించింది. మనం గొప్పగా చెప్పుకునే అద్భుతమైన వారసత్వ సంస్కృతి, మనమంతా పిలుచుకునే గొప్ప నాగరికత, అంతరిస్తున్న ప్రేమలు, విజృంభిస్తున్న ద్వేషాలు, ధనాశ, క్రౌర్యం నుంచి పుట్టిన కుటుంబ నేరం ఈ ఘోరం. సిగ్గుపడవలసిన సరికొత్త భారత జాతీయనేరం. (చదవండి: తప్పు చేసినా శిక్షకు అతీతులా?) జార్ఖండ్ రాష్ట్రంలో ఒక భర్త రామ్‌సహాయ్ మహతో, అత్త పార్వతీదేవి, మామ నేమా మహతో కలిసి కోడలు ఫుల్వాదేవిని వరకట్నం తేలేదని చంపిన సంఘటన ఇది. రాజ్‌దూత్ మోటార్ సైకిల్, 20 వేలరూపాయల వరకట్నం కోసం వధువును హింసించారు. వేరే అమ్మాయితో పెళ్లి చేస్తామని బెదిరించారు. తండ్రి అంత డబ్బు తేలేడని కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. 1997లో పెళ్లి అయిన కొద్ది నెలలకే ఆమె జీవితం ముగించారు. ఆమెను నదీ తీరానికి తీసుకువచ్చి నదిలోకి తోసి చంపేశారు. కూతురు కనిపించడం లేదని తండ్రి బోధి మహతో ఫిర్యాదు చేశారు. (చదవండి: ‘ట్యాక్స్ పేయర్స్ మనీ’ అంటూ ‘సోషల్ ఆడిట్’!) 1997లో వధువును చంపేశారు. కేసు రిజిస్టర్ అయింది. 20వ తేదీ సెప్టెంబర్ 1999 గిరిడిత్ అడిషనల్ సెషన్‌జడ్జి నేరం రుజువైందని పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. మరో నేరంలో మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమలు కావాలని తీర్పులో పేర్కొన్నారు. అంటే కేవలం పదేళ్లే శిక్ష అని అర్థం. 2007లో అంటే ఏడేళ్ల తరువాత హైకోర్టు శిక్షలను నిర్ధారించింది. 14 సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు శిక్షలను సమర్థించింది. ఈలోగా నేమా మహతో (మామ) 2009 సుప్రీం కోర్టులో అప్పీలు కోసం ఎస్ఎల్పీ వేశాడు. కానీ అంతలో మరణించాడు. కనుక ఆయనపై కేసులేవీ ఉండవు. అత్తమీద ఆరోపణలు స్పష్టంగా లేకపోవడం, రుజువులు సరైనన్ని లేకపోవడం వల్ల ఆమెను విడుదల చేశారు. 21 సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు తీర్పుతో ఈ సుదీర్ఘ అన్యాయాలస్యం తరువాత న్యాయం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కొహ్లి ఈ అప్పీలు విచారించారు. కొన్ని దేశాల్లో అయితే ఒక శిక్ష తరవాత మరొక శిక్ష అమలవుతుంది. అంటే ఇదే అమెరికాలో అయితే కోడలిని చంపిన ఈ హంతకులకు 13 ఏళ్ల జైలు శిక్ష పడేది. నేర విచారణ దశలో తమ ఇంట్లోంచి వధువు ఏ విధంగా మాయమైపోయిందో చెప్పలేకపోయారు అత్త మామలు, భర్త. ఆమె తనతో నివసించడం లేదని వారు చెప్పినవన్నీ అబద్ధాలని కోర్టు భావించింది. తమతో కాకుండా తన బావతో ఆమె నివసించేదని చెప్పడానికి వారు విఫల ప్రయత్నం చేశారు. ఇంట్లోంచి వెళ్లిపోయిందనీ తరువాత దొరకలేదనే మాటలు కూడా నమ్మశక్యంగా లేవు. వెతకడానికి ఏం ప్రయత్నాలు చేశారో చెప్పలేకపోయారు. నిజంగా ఆమె ఇంటినుంచి మాయమైపోతే ఆమె తల్లిదండ్రులకు చెప్పకపోవడం, పోలీసులకు ఫిర్యాదు చేయక పోవడం చూస్తే వారి ప్రవర్తనపై అనుమానాలు ధృవపడుతున్నాయి. వరకట్న హత్యలకు ప్రత్యక్ష సాక్షులు ఉండరు. నేరగాళ్లే సాక్షులు. వారి ప్రవర్తన, పరిస్థితులు, ముందు వెనుక వారి వ్యవహారాలు, అంతకుముందు జరిగిన సంగతులు వారి నేరాన్ని పట్టి ఇస్తాయి. మామూలు హత్యలకు ఈ హత్య లకు ఇదీ తేడా. హత్య జరిగిందని చెప్పే సాక్షులు ఉండని పరిస్థితులలో, వీరే హత్య చేసి ఉంటారు అని భావించడానికి తగిన పరిసర సాక్ష్యాలు కోర్టు ముందుంచడం ఒక సవాల్. దీనికిగానూ ప్రాసిక్యూషన్ వారు నీతిమంతంగా, న్యాయంగా, చాలాశ్రద్ధతో కృషి చేయవలసి వస్తున్నది. సెక్షన్ 304 బి ఇండియన్ పీనల్ కోడ్ కింద, నిందితులే నేరం చేసి ఉంటారని భావించడానికి కొన్ని సూత్రాలను ఈ తాజా తీర్పు వివరిస్తున్నది. 1. సాధారణ పరిస్థితుల్లో కాకుండా మరోరకంగా మరణం సంభవించి ఉండటం, కాలిన గాయాలో మరోరకం శారీరక గాయాలో అయి ఉండాలి. 2. పెళ్లయిన ఏడేళ్లలోగా అసాధారణ మరణం జరిగి ఉండాలి. 3. మరణానికి ముందు అప్పుడప్పుడే ఆమె హింసకు గురై ఉండాలి. 4. ఆ హింస, క్రౌర్యం వరకట్నం కోసమో లేక దానికి సంబంధించినదై ఉండాలి. ఇందులో వధువు తండ్రి ఒక్కడే ప్రత్యక్ష సాక్షి. నిందితుడు తన కూతురికి హాని చేస్తానని బెదిరించినట్టు సాక్ష్యం చెప్పాడు. తండ్రి, తమ్ముడు, బావ చేసిన ప్రయత్నాల వల్ల ఆమె శరీర భాగాలు లభించాయి గానీ పోలీసులేమీ చేయలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో దర్యాప్తు అంత పకడ్బందీగా లేదు. కానీ 304బి కింద పరిస్థితుల సాక్ష్యం నిందితుల నేరాన్ని రుజువు చేస్తోంది. ఫుల్వాదేవి పెళ్లయిన కొద్ది నెలలకే కట్నం కోసం హింసకు గురికావడం, కొద్దిరోజులకే అత్తవారింటి నుంచి మాయం కావడం (ఆరోపణ స్థాయిలో కూడా నమ్మలేని మాట), తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం, వధువు సోదరుడు వచ్చినపుడు ఇంటిల్లిపాదీ లేకపోవడం, ఇంటికి తాళం వేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయక పోవడం, ఆమె అస్తిపంజరం నదీ తీరంలో దొరకడం, భర్త, అత్త మామల మాటలు పొంతనలేకుండా ఉండటం వంటి వన్నీ నేరాన్ని పట్టి ఇస్తున్నాయి. ఇది హత్య. సాక్ష్యాలు దొరికితే హత్య అని నిరూపించి సెక్షన్ 302 కింద శిక్షించే వీలుంది. సెక్షన్ 304బి హత్యల వర్గంలోనే ఒక కొత్తరకం నేరం. దీన్ని చట్టం హత్య అనకుండా వరకట్న మరణం అని పేరుపెట్టినంత మాత్రాన ఇది హత్య కాకుండా పోదు. వివాహ వ్యవస్థను నాశనం చేస్తున్నది కుటుంబపెద్దల క్రూర స్వార్థ మనస్తత్వం. (చదవండి: వధువు కంటే వరుడు పెద్దవాడయి వుండాలా!) - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ -
సెక్షన్ 164: అక్కడ చెబితే... అంతా నిజమేనా?
కొద్ది రోజులుగా కొన్ని మీడియా మాధ్యమాలలో పనికట్టుకొని సెక్షన్ 164, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973 మీద విస్తృత చర్చలు నడుపుతున్నారు. ప్రజలలో తప్పుడు అపోహలు కలిగిస్తూ రాజకీయ దురుద్దేశంతో కొందరి వ్యక్తిత్వ హననం చేయడానికి పాటుపడుతున్నారు. సెక్షన్ 164(1) అనేది నేర ఒప్పుదల, రికార్డు చేసే ప్రక్రియ: ఈ ప్రక్రియలో, జుడిషియల్ మేజిస్ట్రేట్ తన పరిధిలో ఉన్న లేక తన పరిధిలో లేని నిందితుడిని దర్యాప్తు అధికారి అభ్యర్థన మేరకు, నేర ఒప్పుకోలు, ఇతర కథనాలను రికార్డు చేస్తారు. దీనిని రికార్డు చేసేటపుడు, మేజిస్ట్రేట్, నిందితుడిని సవివరంగా నేరం ఒప్పుకోవాల్సిన ఆగత్యం లేదని, తాను ఇస్తున్న ప్రకటన అతడికి వ్యతిరేకంగా ఉపయోగించవచ్చని లె లుపుతారు. ఆ మేరకు మేజిస్ట్రేట్ తన సంతకంతో స్టేట్మెంట్ను ముగిస్తారు. అయితే, కొన్ని మీడియాలలో వస్తున్న కథనాలు దీనికి భిన్నంగా ఉంటున్నాయి. సెక్షన్ 164లో పేర్కొన్నది అంతా వాస్తవ మని, దీనిని కోర్టులు వాస్తవ సాక్ష్యంగా పరిగణిస్తాయని చెబుతూ కావాలని కొందరి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వాస్తవానికి, అత్యధిక కేసుల్లో 164 స్టేట్మెంట్లో పేర్కొన్నది నిజం కాదని, వాస్తవాలకు దూరంగా ఉంటుందని, కేసును తప్పుదారి పట్టించడానికి ఇచ్చినదిగా కూడా రుజువైంది. దీనికి ఉదాహరణ– ఆయేషా మీరా కేసులో ఎనిమిదేళ్లు శిక్ష అనుభవించిన తర్వాత, ముద్దాయి సత్యంబాబు తాను చెల్లి పెండ్లి కోసం ఆర్థిక సహాయం పొంది తప్పుడు నేరం ఒప్పుకోలు ఇచ్చినట్లు గౌరవ హైకోర్టు అప్పీలులో మరో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది రుజువై, సత్యంబాబు నిర్దోషిగా బయటకి వచ్చారు. కాబట్టి, నిందితుడు అబద్ధాలు, అవాస్తవాలను రికార్డు చేసే అవకాశాలుంటాయి. సెషన్స్ కోర్టుల్లో రుజువైంది. సెక్షన్ 164 స్టేట్మెంట్ని కోర్టులలో తారుమారు కాని, మార్పు/ సవరణకు వీలు లేని సాక్ష్యంగా మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఎన్నో కేసులలో అప్రూవర్‌గా మారిన నిందితుడి స్టేట్మెంట్ సత్య నిరూపణకు విరుద్ధంగా ఉంటున్నాయి. సెక్షన్ 164(1) అనేది స్వచ్ఛందంగా నిందితుడి నేర ఒప్పుకోలు లేదా అప్రూవర్‌గా మారిన నిందితుడు, మేజిస్ట్రేట్ ముందు ఎలాంటి ఒత్తిళ్లూ లేకుండా, పోలీసు అధికారుల పర్యవేక్షణ లేకుండా ఇచ్చే స్టేట్మెంట్, ఇది పూర్తి వాస్తవ సాక్ష్యం అయిపోదు. అంతేకాని, మీడియా మాధ్యమాల్లో ఇటువంటి క్రిమినల్ ట్రయల్ చేయడం చట్టపరంగా నేరం. పైగా సమాజానికి చాలా ప్రమాదకరం. - పొనకా జనార్దన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది, తాడేపల్లి -
హింసించడం పోలీసుల డ్యూటీ కాదు!
దేశంలో పోలీసు కస్టడీలో నిందితులపై హింసా, ఇతర వేధింపులు ఇప్పటికీ కొనసాగుతున్నాయనీ, మానవ హక్కులకు ముప్పు ఎక్కువగా మన పోలీస్ స్టేషన్లలోనే ఉంటోందనీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ పలు సందర్భాల్లో అన్నారు. వాస్తవానికి పోలీసు ఠాణాల్లో నిందితులు చిత్రహింసలకు గురవుతున్నా, దెబ్బలకు తట్టుకోలేక మరణిస్తే తప్ప ఆ నేరం వెలుగులోకి రావడం లేదు. పోలీసు అధికారులు తప్పుడు కేసుల్లో అమాయకుల్ని ఇరికించి, గాయపరచడానికి ఉద్దేశపూర్వకంగా తప్పుడు పత్రాలను తయారు చేసినట్లయితే, భారతీయ శిక్షా స్మృతి, సెక్షన్ 167 ప్రకారం అతను శిక్షార్హుడు. నిందితుడిని అరెస్టు చేసి, నేరాన్ని చేసినట్లు ఒప్పుకోమని హింసించినా, భారతీయ సాక్ష్య చట్టం, 1872లోని సెక్షన్ 25, 26 ప్రకారం అటువంటి నేరాంగీకరణలు కోర్టుల్లో చెల్లవు. (చదవండి: ఆ వారసత్వం నేటికీ రేపటికీ అవసరమే!) మానసికంగా, శారీరకంగా నిందితులను గాయాల పాలు చేసి రిమాండుకు పంపేటప్పుడు జడ్జీ దగ్గర వాస్తవాలు చెప్పనివ్వకుండా కొట్టలేదు, తిట్టలేదు అని చెప్పించే పోలీసు వ్యవస్థలో మనం బతుకుతున్నాం. చాలామంది పోలీసులు ప్రజలను కొట్టడం వారి డ్యూటీలో భాగంగా భావిస్తు న్నారు. సుప్రీంకోర్టు 2006లో ప్రకాశ్ సింగ్ వర్సెస్ యూనియన్ అఫ్ ఇండియా కేసు తీర్పులో సూచిం చినట్లు జిల్లా, రాష్ట్ర స్థాయి ‘పోలీసు కంప్లయింట్ అథారిటీ’లను ఏర్పాటు చేసి పోలీసుల నేరాలను తగ్గించాలి. తెలంగాణ హైకోర్టు ఆదేశానుసారం జూన్ 2021లో సదరు అథారిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు జీవో నం.1093ను ప్రభుత్వం జారీ చేసింది. కానీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. (జైభీమ్: నాటి పోరాటం గుర్తొచ్చింది!) ఈ ఏడాది తెలంగాణలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరియమ్మ కస్టోడియల్ మరణం జరిగింది. ఈ లాకప్ డెత్ కేసులో ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీస్ నుండి తొలగించారు. కానీ వీరికి జైలు శిక్ష పడుతుందా? అదేరోజు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలో దొంగతనం చేశాడనే అనుమానంతో వీరశేఖర్ అనే గిరిజనుడిని పోలీసులు తీవ్రంగా కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. భారత దేశంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన మానవ హక్కుల గురించీ, సీఆర్పీసీ, ఐపీసీ చట్టాల గురించీ కనీస అవగాహన అవసరం. పాఠశాలల్లో ప్రాథమిక, ఉన్నత విద్యలో పాఠాల రూపంలో బోధించాలి. తెలంగాణాలో ఫ్రెండ్లీ పోలీసులు అని చెబుతున్న ప్రభుత్వం, కానిస్టేబుల్ నుండి ఉన్నతాధికారుల వరకు మానవ హక్కులపై ప్రతియేటా శిక్షణ తర గతులు నిర్వహించాలి. ఖాకీ డ్రెస్సుల్లో ఉద్యోగం చేస్తున్న నేరగాళ్ళను గుర్తించి, ఉద్యోగాల నుండి తొలగించాలి. తక్షణం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పోలీస్ కంప్లయింట్ అథారిటీలను ఏర్పాటు చేయాలి. - కోడెపాక కుమార స్వామి వ్యాసకర్త సామాజిక కార్యకర్త -
మొత్తం దేశద్రోహం కేసులు 326
న్యూఢిల్లీ: 2014– 2019 మధ్యకాలంలో దేశంలో దేశద్రోహం ఆరోపణలకు వర్తించే ఐపీసీ 124ఏ సెక్షన్ కింద మొత్తం 326 కేసులు నమోదయ్యాయి. వీటిలో 141 కేసుల్లో చార్జ్‌షీట్ నమోదవగా, 6 కేసుల్లో మాత్రమే నేరం రుజువై, దోషులకు శిక్ష పడింది. ఈ సెక్షన్ దుర్వినియోగమవుతోందని, బ్రిటిష్ వలస పాలన కాలం నాటి ఈ సెక్షన్ ఇంకా అవసరమా? అని ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మొత్తం 326 కేసుల్లో అత్యధికంగా 54 కేసులు అస్సాంలోనే నమోదయ్యాయి. అస్సాంలో 54 కేసులకు గానూ, 26 కేసుల్లో చార్జ్‌షీట్ నమోదు కాగా, 25 కేసుల్లో విచారణ ముగిసింది. అయితే, వీటిలో ఏ ఒక్క కేసులోనూ నేరం రుజువు కాలేదు. -
చట్ట పరిమితులు దాటిన ‘న్యాయం’
తనపై సంవత్సరాలుగా అత్యాచారం సాగిస్తూ వచ్చిన వ్యక్తిని పెళ్లాడటం ద్వారా బాధితురాలికి కాస్త ఉపశమనం కలుగుతుందని చీఫ్ జస్టిస్ భావించారా లేక జైలు శిక్షను అనుభవించడం కంటే పెళ్లి అనేది మరింత శిక్షగా ఆయన భావించారా లేక పెళ్లి ద్వారా శిక్షను తగ్గించుకోవచ్చని బాధితుడికి సూచించారా అనేది స్పష్టం కావడం లేదు. ఒక మహిళ శరీరంపై ఆమెకున్న హక్కును భగ్నపర్చిన వ్యక్తితో జీవితకాలం సంబంధంలో ఉండాలని, అందుకోసం చట్టపరంగా కూడా అతగాడికి పవిత్రతను చేకూరుస్తామని అర్థం వచ్చేలా ప్రధాన న్యాయమూర్తి సూచించడం నైతికంగా అత్యంత అసహ్యకరమైనదిగానే భావించాల్సి ఉంటుంది. సాక్షాత్తూ అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనమే అత్యాచార నేర చర్యను చట్టవిరుద్ధంగా మాఫీ చేయవచ్చని, రాజీ కుదుర్చవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు, తాము అత్యాచారం చేసిన మహిళలను పెళ్లి చేసుకుంటే చాలు తమకు క్షమాభిక్ష లభిస్తుందనే ప్రమాదకర సంకేతాలు లైంగిక నేరస్తులకు అందటం ఖాయం. మైనారిటీ తీరని బాలికపై అత్యాచారం చేసిన సీరియల్ రేపిస్టుకు ఆమెను పెళ్లాడతావా అంటూ సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే ప్రతిపాదించిన క్షణంలో మన దేశంలో కొనసాగుతున్న పితృస్వామిక దురభిప్రాయాలు, స్త్రీ ద్వేషం పూర్తి స్థాయిలో ప్రదర్శితమయ్యాయనే చెప్పాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించింది ఎవరినో కాదు.. లైంగిక దాడుల నుంచి పిల్లల పరిరక్షణ చట్టం 2012, భారతీయ శిక్షా స్మృతిలోని 376, 417, 506 సెక్షన్ల కింద అత్యాచారం, నేరపూరితంగా బెదిరించడం వంటి ఆరోపణలపై కేసులున్న నిందితుడికి సుప్రీం చీఫ్ జస్టిస్ ఈ విధమైన ప్రతిపాదన చేశారు. తన సమీప బంధువైన బాధితురాలి ఇంట్లోకి ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ప్రవేశించిన నేరస్థుడు ఆమె కాళ్లు చేతులను కట్టివేసి తర్వాత అత్యాచారానికి ఒడిగట్టాడు. అప్పుడు ఆ అమ్మాయి 9వ తరగతి చదువుతూ ఉండింది. ఆమె 12వ తరగతిలోకి వచ్చేంతవరకు ఆమెను అతగాడు పదేపదే అత్యాచారం చేస్తూ వచ్చాడు. తనకు, తన కుటుంబానికి హాని కలిగిస్తానని బెది రించి మరీ ఈ పనికి పాల్పడ్డాడు. పైగా ఈ ముష్కరుడు మోటార్ సైకిల్లో పెట్రోల్ క్యాన్ పెట్టుకుని మరీ ఆమెను అనుసరిస్తూ సజీవ దహనం చేస్తానంటూ బెదిరిస్తూ వచ్చాడు. ఈ భయానక నేరం ఆ అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు గానీ ఆమె తల్లిదండ్రులకు తెలీలేదు. చదువులేని ఆ బాధితురాలి తల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని వెళితే, ఆమె నుంచి ఫిర్యాదు తీసుకోవడానికి బదులుగా ఆమె కుమార్తెకు, నిందితుడికి మధ్య పరస్పర సమ్మతితోనే శారీరక సంబంధం పెట్టుకున్నట్లు స్టాంప్ పేపర్‌పై కన్నతల్లి చేత సంతకం పెట్టించుకున్నారు. పైగా ఆ అమ్మాయికి మైనారిటీ తీరాక తన కొడుకు ఆమెను పెళ్లాడతాడని నిందితుడి తల్లి హామీ ఇచ్చింది. కానీ హామీని నింది తుడు భంగపరిచిన తర్వాతే పోక్సో చట్టం కింద అతగాడిపై ఫిర్యాదు నమోదు చేశారు. అదనపు సెషన్స్ జడ్జి మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్‌ని బాంబే హైకోర్టు కొట్టివేశాక నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్లాడు. సెషన్స్ జడ్జి అహేతుకంగా, యథేచ్ఛగా, చంచలత్వంతో నిందితుడికి బెయిల్ మంజూరు చేశారని బాంబే హైకోర్టు పేర్కొనడమే కాకుండా, న్యాయవ్యవస్థ తనపై పెట్టిన బాధ్యతను విస్మరించారంటూ సెషన్స్ జడ్జిని అభిశంసించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యంలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సమక్షంలో నిందితుడితో చీఫ్ జస్టిస్ చేసిన సంభాషణను పరిశీలించవలసి ఉంటుంది. ఈ కేసులో నిందితుడి తరపు లాయర్‌తో మాట్లాడిన చీఫ్ జస్టిస్ ‘బాధితురాలిని పెళ్లాడాలనుకుంటే మేము నీకు సాయం చేస్తాం. అలా కాకుంటే నీ ఉద్యోగాన్ని పోగొట్టుకుని జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే నీవు ఆ అమ్మాయిని వేధించావు, అత్యాచారం చేశావు’ అని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆమెపై అత్యాచారం చేయడానికి ముందు నీవొక ప్రభుత్వ ఉద్యోగివి అనే విషయం ఆలోచించాల్సి ఉండిందని కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. దానికి నిందితుడు స్పందిస్తూ, ప్రారంభంలోనే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ ఆమె వ్యతిరేకించిందని, ఇప్పుడు తనకు పెళ్లయింది కాబట్టి ఆమెను పెళ్లాడలేనని సమాధానమిచ్చాడు. అప్పుడు సుప్రీంకోర్టు నిందితుడు తన పిటిషన్ ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తూ, రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు హైకోర్టు అతడిపై విధించిన అరెస్టు ఆదేశంపై నాలుగువారాల పాటు స్టే విధించింది. పెళ్లి-సాంత్వన, శిక్ష, మినహాయింపు తనపై సంవత్సరాలుగా అత్యాచారం సల్పిన వ్యక్తిని పెళ్లాడటం ద్వారా బాధితురాలికి కాస్త ఉపశమనం కలుగుతుందని చీఫ్ జస్టిస్ భావించారా లేక జైలు శిక్షను అనుభవించడం కంటే పెళ్లి అనేది మరింత శిక్షగా ఆయన భావించారా లేక పెళ్లి ద్వారా శిక్షను తగ్గించుకోవచ్చని బాధితుడికి సూచించారా అనేది స్పష్టం కావడం లేదు. ఒక మహిళ శరీరంపై ఆమెకున్న హక్కును భగ్నపర్చడమే కాకుండా, ఆ వ్యక్తితో జీవితకాలం సంబంధంలో ఉండాలని, అందుకోసం చట్టపరంగా కూడా అతగాడికి పవిత్రతను చేకూరుస్తామని అర్థం వచ్చేలా రాజ్యాంగంపై, లైంగిక సమానత్వం అనే మానవ విలువపై విశ్వాసం ఉంచుకున్న ప్రధాన న్యాయమూర్తి సూచించడం నైతికంగా అసహ్యకరమైనది. తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని పెళ్లాడటం ద్వారా బాధితురాలు అంతకాలం అనుభవించిన బాధ, మానసిక అఘాతం, అవమానం, ఆగ్రహం వంటివన్ని మంత్రించినట్లుగా మాయమైపోతాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భావిస్తున్నారా? నిందితుడి తల్లి తన కుమారుడితో పెళ్లికి ఒప్పుకోవాలని బాధితురాలి తల్లికి చేసిన ప్రతిపాదనను ఆమె ఆమోదించాల్సి వచ్చింది అంటేనే దాన్ని మహిళను నియంత్రిం చడానికి పితృస్వామిక ఆధిపత్యపు విషాద వ్యక్తీకరణగానే చూడాల్సి ఉంటుంది. దెబ్బతిన్న మహిళను లొంగదీయడానికి పరువు, అవమానాలను మన సమాజం నేటికీ ఆయుధాలుగా ఉపయోగి స్తోంది. ఈ కేసులో బాధితురాలు ఆనాటికి మైనర్‌గా ఉంటున్నందున ఆమె సమ్మతి తీసుకోవడం అనేది సమస్యే కాదు. కన్నకూతురిని బలాత్కరించిన వ్యక్తితో పెళ్లికి కన్నతల్లి ఆమోదం తెలపడం మన దేశ అమ్మాయిలపై తల్లిదండ్రులకు ఉన్న ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తుంది. మహిళ శరీరంపై అధికారం ఎవరిది? తనపై అత్యాచారం చేసిన నిందితుడిని పెళ్లాడాల్సిందిగా బాధితురాలిని తాను బలవంతపెట్టలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. బాధితురాలి మానసిక స్థితిని అంచనా వేయడానికి ముందే నిందితుడికి ఇలాంటి ప్రతిపాదన చేయడమే వింత. ఒకవేళ నిందితుడు బాధితురాలిని పెళ్లాడటానికి అంగీకరించి ఉంటే, తర్వాతైనా బాధితురాలి అభిప్రాయాలను, సమ్మతిని న్యాయస్థానం తెలుసుకుని ఉండేదా? తనపై లైంగిక దాడి చేసిన వ్యక్తితో సంబంధంలోకి వెళ్లడం అనే భావననే బాధితురాలు సహించలేదని, తిరగబడుతుందని న్యాయమూర్తులకు తెలీదా? అందులోనూ శారీరకంగా, భావోద్వేగపరంగా తనపై దాడిచేసిన వ్యక్తికి సంబంధించిన విషయం ఇది. బాధితురాలికి రేపిస్టుతోనే పెళ్లి చేయడం ద్వారా ఆమెకు కనీస ప్రమాణాలతో కూడిన పవిత్రతను కలిపించడం అంటే తనపై లైంగిక దాడిచేసిన వ్యక్తితో జీవితకాల సంబంధాన్ని వ్యవస్థాగతంగా ఏర్పర్చడంలోని భయానకమైన స్థితిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కాదా? దెబ్బతిన్న మహిళలకు ఉత్తమ ప్రయోజనాలు కలిగించడానికే తాను పనిచేస్తున్నానని ఉన్నత న్యాయస్థానం నిజంగా నమ్ముతోందా? దీన్ని మరోలా చూద్దాం. నీ శరీరంపై నీ హక్కును ఉల్లంఘించారు. కానీ నీ సొంత ప్రయోజనం కోసమే నీ శరీరాన్ని నీ సమ్మతి లేకుండా పాశవికంగా, బలవంతంగా తాకి బలాత్కరించిన వ్యక్తే నీ గౌరవాన్ని పునరుద్ధరించగలడని నేను హామీ ఇవ్వగలను, నిన్ను తన భార్యగా స్వీకరించి దయదల్చడం ద్వారా నిందితుడు నీకు కలిగిన నష్టాన్ని పూడ్చగలడు అనే అంశాన్ని న్యాయస్థానం ఈ కేసులో సూచిస్తోందా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకటనపై తీవ్ర ఆగ్రహం ప్రకటించిన వేలాదిమంది లైంగిక సమానత్వ ఉద్యమకారులు చీఫ్ జస్టిస్ బాబ్డేకి బహిరంగ లేఖ రాస్తూ తన ప్రకటనను ఉపసంహరించుకోవాలని, దేశంలోని మహిళలందరికీ ఆయన క్షమాపణ చెప్పాలని, అంతేకాకుండా ఆయన వెంటనే తన పదవినుంచి దిగిపోవాలని కూడా డిమాండ్ చేశారు. న్యాయస్థానాల్లో తమ విధులను నిర్వర్తిస్తున్న సమయంలో జడ్జీలు స్వేచ్ఛగా ఇలాంటి అసంబద్ధ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నప్పుడు, లైంగిక న్యాయం, సమానత్వానికి సంబంధించి రాజ్యాంగపరమైన విలువలను పాటించే, అమలు చేసే శక్తి మన న్యాయమూర్తులకు ఉందా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఎస్. దేవిక, న్యాయవాది, చెన్నై (ది వైర్ సౌజన్యంతో) -
సెక్షన్ 497.. విలువలకు రక్షణ
‘అడల్టరీ’ అనేది స్త్రీ ఆలోచనలో కూడా ఉండని విషయం. పురుషుడు మాత్రమే.. కష్టపడి స్త్రీ చుట్టూ తిరిగి, స్త్రీ కళ్లబడి, స్త్రీ కాళ్లావేళ్లా పడి, స్త్రీ ముందు కన్నీరు పెట్టుకుని, స్త్రీ చేత కన్నీరు పెట్టించి సాధించుకునే ‘విజయం’! ‘‘స్త్రీ, పురుషులిద్దరూ కలిసి చేసే తప్పుకు పురుషుడొక్కడిపైనే నేరం మోపి, అతడికి మాత్రమే శిక్ష విధించడం ఏ కాలం నాటి న్యాయం?’’ అని జోసెఫ్ షైనీ అనే వ్యక్తి భారత ప్రభుత్వంపై వేసిన కేసొకటి కొన్నాళ్లుగా సుప్రీంకోర్టులో నలుగుతోంది. ఇండియన్ పీనల్ కోడ్‌లోని 497వ సెక్షన్‌ను రద్దు చెయ్యాలని ఆయన అభ్యర్థన. ఆ సెక్షన్ ప్రకారం.. పెళ్లయిన స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకున్న పురుషుడికి ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేక ఈ రెండూ గానీ ఉంటాయి. స్త్రీకి ఇవేమీ ఉండవు. ఆమె అసలు నేరస్తురాలే కాబోదు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం మతానికి, జాతికి, కులానికి, ప్రాంతానికి అతీతంగా స్త్రీ, పురుషులంతా చట్టం ముందు సమానమే అయినప్పుడు 497 సెక్షన్ ఆ ఆర్టికల్‌కు లోబడే ఉండాలి కదా అని జోసెఫ్ వాదన. అలాగని స్త్రీని కూడా నిందితురాలిని, ముద్దాయినీ చేసి శిక్ష విధించమని ఆయనేమీ అడగడం లేదు. ఈ సెక్షన్‌ని అసలుకే ఎత్తేయమని విజ్ఞప్తి చేస్తున్నారు. వివాహిత స్త్రీతో ఆమె భర్త అనుమతి గానీ, సమ్మతిగానీ లేకుండా ఎవరైనా శారీరక సంబంధం పెట్టుకుంటే అది అత్యాచార స్థాయి నేరం కాకపోవచ్చు గానీ, అడల్టరీ (వ్యభిచారం) కింద నేరమే అవుతుందని అంటోంది సెక్షన్ ఫోర్ నైంటీ సెవన్. దీని పైన కూడా జోసెఫ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భర్త అనుమతి, సమ్మతి అన్నప్పుడు అందులో స్త్రీ అనే జీవి.. పురుషుడి ఆస్తి అన్న అర్థం ధ్వనిస్తోందని ఆయన తన వాదనల్లో వినిపించారు. అయితే ఈ కేసు విషయంలో భారత ప్రభుత్వం కాస్త గట్టిగానే ఉంది. జోసెఫ్ ఆశిస్తున్నట్లుగా సెక్షన్ ఫోర్ నైంటీ సెవన్‌ను రద్దు చేసినట్లయితే వివాహ వ్యవస్థ మొత్తం ధ్వంసం అయిపోతుందని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ మాత్రం భయమైనా లేకపోతే పురుషులను నియంత్రించలేమని, ఎంతో ఉదాత్తమైన భారతీయ వైవాహిక వ్యవస్థలోని విలువలు మంటగలిసి పోతాయని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఐదుగురు జడ్జిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసు మీద వచ్చే రెండు మూడు వాయిదాల్లో తీర్పు ఇవ్వబోతోంది. ఇంతగా ఆలోచించేందుకు ఇందులో ఏమీ లేదని అనుకుంటే కనుక ఈ ఒకట్రెండు రోజుల్లోనే తీర్పు వచ్చేయొచ్చు. ఐపీసీ లోని సెక్షన్ 497 నూటా యాభై ఏడేళ్ల నాటిది. అప్పటి సమాజానికీ, ఇప్పటి సమాజానికీ; అప్పటి స్త్రీల జీవన స్థితిగతులకు, ఇప్పటి స్త్రీల జీవన స్థితిగతులకు సుమారు ఒకటిన్నర శతాబ్దాల వ్యత్యాసం ఉంది కనుక, ఈ సెక్షన్‌ను రద్దు చేయడంలో తప్పు లేదని జోసెఫ్ షైనీ ఆలోచనను సమర్థించే వారు అంటున్నారు. ప్రముఖ ఆంగ్ల జాతీయ దిన పత్రిక కూడా తన ‘వ్యూ’ ఏమిటో ఒక్కమాటలో స్పష్టంగా చెప్పింది. విక్టోరియా కాలం నాటి ఈ సెక్షన్‌ను ఇంకా కొనసాగించడంలో అర్థం లేదంది! స్త్రీ, పురుషులిద్దరూ చేసిన తప్పులో పురుషుడిని మాత్రమే దోషిని చెయ్యడం అంటే.. స్త్రీ అమాయకురాలు, నిర్దోషి అని పరోక్షంగా తీర్మానించడమే కదా.. పురుషుడిని మాత్రమే దోషిని చెయ్యడం ఎంత అర్థరహితమో, స్త్రీని నిర్దోషిని చెయ్యడం అంత అర్థరహితం అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చట్టాలు, సెక్షన్లు భారతీయ వివాహ వ్యవస్థను నిలబెట్టలేవు అంటూ.. భారత ప్రభుత్వ వాదనలో ఈ కాలపు ఆలోచన లేదు అని విమర్శించింది. అంటే.. సెక్షన్‌ను రద్దు చెయ్యాలని చెప్పడం! 157 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌ను క్వీన్ విక్టోరియా పాలిస్తున్న కాలంలో 1861లో భారతీయ శిక్షా స్మృతి ఆవిర్భవించి, అమల్లోకి వచ్చింది. విక్టోరియా మహారాణి పాలనలో విలువలతో కూడిన మానవ జీవితం ఉండేది. నీతి నియమాలు, భక్తి విశ్వాసాలతో పాటు స్వీయ నిగ్రహం, విధేయత, కష్టపడి పని చేసే తత్వం ఉండేది. తప్పు జరిగే ఇరుకు తోవల్లోకి ఎవరూ వెళ్లేవారు కాదు. విశాలమైన వెలుగు మైదానాల్లో ధర్మబద్ధంగా, ధైర్యంగా జీవించేవారు. ఆ విలువలు అంత బలమైనవి కనుకే.. ఇప్పటికీ ‘విక్టోరియన్ మోరల్స్..’ అనే మాట వినిపిస్తుంటుంది. జోసెఫ్ షైనీని సమర్థించేవారు మాత్రం ‘ఇంకా ఆ మోరల్స్‌ని పట్టుకుని వేళ్లాడ్డం ఎందుకు? ఇప్పటి మహిళలు అప్పటి మహిళల్లా ఉన్నారా?’ అంటున్నారు! జోసెఫ్ని సమర్థించేవారు ఆ మాట అంటున్నారే కానీ, జోసెఫ్ ఆ మాట అనడం లేదు. స్త్రీలు గానీ, పురుషులుగానీ; అప్పుడు గానీ, ఇప్పుడుగానీ కలిసి ఒక తప్పు చేసినప్పుడు, వారిలో ఒకరికే శిక్ష విధించడం కన్నా.. అసలు ఆ సెక్షన్నే రద్దు చేయడమే న్యాయం కదా అంటున్నారు. అంతకు మించి డీప్‌గా ఆయనేమీ వెళ్లడం లేదు. తప్పు చేసినవాడు పురుషుడైతే, తప్పుకు తోడైన స్త్రీ సైతం నేరస్తురాలే అని కూడా ఆయనేమీ అనడం లేదు. పైగా రెండు మంచి విషయాల్ని (ఆర్టికల్ 14, స్త్రీని పురుషుడి ఆస్తిగా చేయడం) పైకి తీశారు. కానీ ఆయన తీసిన మంచి విషయాల కంటే, సెక్షన్‌ను రద్దు చేస్తే వివాహ వ్యవస్థకు జరిగే కీడే ఎక్కువ అని భారత ప్రభుత్వం భావిస్తోంది. ‘పాతకాలంలో స్త్రీలు మితిమీరిన సామాజిక నిబంధనలు, నియంత్రణల మధ్య ఉండేవాళ్లు. అప్పుడు (వివాహేతర సంబంధాలలో) తప్పు చేసినా, తప్పు చేయించినా పురుషుడే బాధ్యుడు అయివుండటానికి అవకాశం ఉంది కాబట్టి ఆ కాలానికి ఆ సెక్షన్ రైటే గానీ.. ఇప్పటి స్త్రీలకు కూడా చట్టం ఆ కాలం నాటి స్టేటస్‌నే ఇవ్వడం ఏంటి?’ అనే సందేహం రావడం సహజమే. అయితే నిబంధనలు ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా ఉండే తత్వం ఎందుచేతో పురుషులలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ‘అడల్టరీ’లోనైతే మరీ ఎక్కువ. అడల్టరీ అనేది అసలు స్త్రీ ఆలోచనల్లో కూడా ఉండని విషయం. పురుషుడు మాత్రమే.. కష్టపడి ఆమె చుట్టూ తిరిగి, ఆమె కాళ్లావేళ్లా పడి, ఆమె ముందు కన్నీరు పెట్టుకుని, ఆమె చేత కన్నీరు పెట్టించి సాధించుకునే ‘విజయం’! ఈ మాత్రపు విక్టోరియన్ ఎరా సెక్షన్లయినా లేకుంటే భారత ప్రభుత్వం వాదిస్తున్నట్లు వివాహ వ్యవస్థ, వివాహ విలువల్ని పురుషుడు ధ్వంసం చేసేస్తాడు. ఇంకా ముఖ్యమైన సంగతి.. అసలు జోసెఫ్ షైనీ వాదన సమర్థనీయమే కాదు. ఎందుకంటే ‘వేరొకరి భార్యను పొందడం నేరం’ అని చెప్పే సెక్షన్ ఇది. ప్రత్యేకించి అందుకోసమే ఉన్న సెక్షన్. కావాలంటే ‘పరపురుషుడికి లోబడటం నేరం’ అనే ఒక కొత్త సెక్షన్ కోసం జోసెఫ్ డిమాండ్ చేయవచ్చు. - మాధవ్ శింగరాజు -
ఆ సినిమాను థియేటర్లో ఫ్రీగా చూడొచ్చంటా?
అవును మీరు చదివింది నిజమే. రేపు విడుదల కానున్న ఓ సినిమాను మొదటి ఆటలో ఫ్రీగా చూడొచ్చంటా. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఫ్రీగా చూసి నచ్చితే ఓ పది మందికి చెప్పండని నిర్మాతలు తెలిపారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో చూద్దాం. భార్య భర్తలు, వారి మధ్య తగాదాల నేపథ్యంలో తెరకెక్కిన ‘ఐపీసీ సెక్షన్ భార్యా బంధు’ సినిమా రేపు (జూన్ 29) విడుదల కానంది. ఐపీసీలోని ఓ సెక్షన్ చుట్టూ తిరిగే ఈ సినిమాలో సీనియర్ నటి ఆమని ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆడవాళ్ల నుంచి మగవారిని రక్షించండి అంటూ సరికొత్తగా ప్రచారం చేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా మొదటి ఆటను ఉచితంగా చూడండి, మీకు నచ్చితే పది మందికి చెప్పండి.. ప్రేక్షకులే ప్రచారకర్తలు అంటూ నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాను ఆలూరి సాంబశివరావు నిర్మించగా, రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. తెలుగు సినీ చరిత్రలో తొలిసారి!! రేపు విడుదలవుతున్న "ఐపిసి సెక్షన్ భార్యాబంధు' ఉదయం ఆట ఉచితంగా చూడండి!! మీకు నచ్చితే పదిమందికి చెప్పండి!! ప్రేక్షకులే ప్రచారకర్తలు!! #IPCSection #BharyaBandhu pic.twitter.com/UmQn5VoR5c — BARaju (@baraju_SuperHit) June 28, 2018 -
విడుదల రోజు ఉదయం ఆట ఉచితం!
శరత్ చంద్ర, నేహా దేశ్ పాండే హీరోహీరోయిన్లుగా.. రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘ఐపిసి సెక్షన్ భార్యాబంధు’ ఆలూరి క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి ఆమని ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రం ఈనెల 29న విడుదలవుతోంది. రిలీజ్ సందర్భంగా చిత్రయూనిట్ విడుదల రోజు ఉదయం ఆటను అందరికీ ఉచితంగా ప్రదర్శించేందుకు నిర్ణయించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్టీ ప్లెక్స్ మినహా ఈ చిత్రం విడుదలవుతున్న అన్ని థియేటర్స్ (సింగిల్ స్క్రీన్స్)లో తొలి షోను ఉచితంగా ప్రదర్శించనున్నారు. దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ ఈ విషయాన్ని ప్రకటించారు. సినిమాపై నమ్మకంతో నిర్మాత ఆలూరి సాంబశివరావు ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారని.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పదిమందికి చెబుతారనే నమ్మకంతో ఈ ఆఫర్ ఇస్తున్నామని దర్శకుడు తెలిపారు. -
పద్ధతి మార్చుకోకపోతే జైలుకే...
ఈవ్‌టీజర్లకు డీసీపీ రమారాజేశ్వరి హెచ్చరిక 11 మంది ఈవ్‌టీజర్లకు కౌన్సెలింగ్ హైదరాబాద్: షీ-టీమ్స్‌కు పట్టుబడిన ఈవ్‌టీజర్లు కౌన్సెలింగ్ తర్వాత తమ పద్ధతి మార్చుకోకపోతే వారిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని మల్కాజిగిరి డీసీపీ, షీ-టీమ్స్ నోడల్ అధికారి రమారాజేశ్వరి హెచ్చరించారు. సోమవారం 11 మంది ఈవ్‌టీజర్లను అరెస్టు చేసిన సందర్భంగా సైబరాబాద్ పోలీసు కమినరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షీ-టీమ్స్ పని తీరును ఆమె వివరించారు. కేపీహెచ్‌బీ, ఉప్పల్, జీడిమెట్ల ప్రాంతాలలో ఈవ్‌టీజింగ్ ఎక్కువగా ఉందన్నారు. సైబరాబాద్‌లో ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు గతనెల 24న 60 షీ-టీమ్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు ఈస్ట్‌జోన్‌లో 5, వెస్ట్‌జోన్‌లో 11 ప్రాంతాలల్లో 45 మంది పట్టుబడ్డారన్నారు. వీరంద రిపై సిటీ పోలీసు యాక్ట్ కింద కేసు నమోదు చేసి క్రైమ్ ఎగనెస్ట్ ఉమెన్ (కావ్) సెల్లో నిపుణులతో వారి కుటుంబ సభ్యుల ముందే కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నామన్నారు. వీరు తమ పద్ధతి మార్చుకుని మంచిగా ఉంటే సరేనని, మరోసారి ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే మాత్రం ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. ముఖ్యంగా ఐటీ జోన్ అయిన మాదాపూర్, హైటెక్‌సిటీ, రాయదుర్గం, మియాపూర్, చందానగర్‌లలో 10 షీ-టీమ్స్ తిరుగుతున్నాయన్నారు. బస్టాపులు, షాపింగ్ మాల్స్, హాస్టళ్లు, సినిమా థియేటర్లు, రైల్వేస్టేషన్ల వద్ద ఈవ్‌టీజింగ్‌పై గట్టి నిఘా వేశామన్నారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన వారిని సాక్ష్యాలతో సహా వీడియో తీస్తున్నామన్నారు. మహిళా కానిస్టేబుళ్లతో డెకాయి ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఈవ్‌టీజింగ్‌ను ఎదుర్కొన్న బాధితులు 100 డయల్‌కు ఫోన్ చేస్తే.. పది నిమిషాల్లోనే షీ-టీమ్ అక్కడికి చేరుకొని పోకిరీల భరతం పడుతుందన్నారు. సమావేశంలో క్రైమ్స్ ఏసీపీ ఉష, సైబర్‌క్రైమ్స్ ఏసీపీ స్నేహిత పాల్గొన్నారు. తాజాగా పట్టుబడిన ఈవ్‌టీజర్లు షీ-టీమ్స్ ప్రచారంలో పాలు పంచుకుంటారని చెప్పారు. కళాశాలకు వెళ్లి ఈవ్‌టీజింగ్ దుష్ఫలితాలపై వివరిస్తారన్నారు. షీ-టీమ్స్ మహిళా కానిస్టేబుళ్లు విలేకరుల సమావేశానికి ‘షీ-టీమ్స్ సైబరాబాద్’ మాస్క్‌ను ధరించి వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.