Central Govt Introduced New Indian Criminal Laws - Sakshi
Sakshi News home page

బ్రిటీష్‌ కాలం చట్టాలకు ప్రక్షాళన.. IPC, CRPC స్థానంలో కొత్త చట్టాలు

Published Fri, Aug 11 2023 1:58 PM | Last Updated on Fri, Aug 11 2023 2:50 PM

Central Govt Introduced New Indian Criminal Laws - Sakshi

ఢిల్లీ: బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలను ప్రక్షాళన చేస్తూ కొత్త చట్టాలు తీసుకొచ్చే క్రమంలో కేంద్రం ముందడుగు వేసింది. 1860 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(భారత శిక్షా స్మృతి)తో పాటు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌(CRPC), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌(IEA) చట్టాలను భర్తీ చేసేలా కొత్త చట్టాలను తెరపైకి తెచ్చింది. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, సీఆర్‌పీసీ ప్లేస్‌లో భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో భారతీయ సాక్ష్యా చట్టాలను తెచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా చివరిరోజైన శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రతిపాదనలను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 

ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానాల్లో కొత్త చట్టాల్ని.. భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు- 2023లను తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిస్తామని చెప్పారు. ‘‘బ్రిటీష్‌ కాలం నాటి కాలం చెల్లిన చట్టాలను ప్రక్షాళన చేస్తున్నాం. కొత్త చట్టాలతో 90 శాతంపైగా నేరగాళ్లకు శిక్షలు ఖాయం’’ అని వెల్లడించారు. కొత్త చట్టాలు మహిళలు, పిల్లలపై నేరాలతో పాటు హత్యా నేరాలు, దేశానికి వ్యతిరేకంగా చేసే నేరాల కట్టడిని ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని సవరణలు చేసినట్లు వెల్లడించారు.

కొత్త చట్టాల ప్రతిపాదన ప్రకారం.. ఏడేళ్లకు పైగా శిక్షపడే కేసుల్లో ఫోరెన్సిక్‌ తనిఖీ తప్పనిసరి చేశారు. రాజద్రోహం(Sedition) వంటి చట్టాన్ని తొలగించారు. ఉద్దేశపూర్వకంగా (ఏదైనా రూపంలో సరే).. సాయుధ తిరుగుబాటుకు ఉసిగొల్పడం,  విధ్వంసక కార్యకలాపాలను ప్రేరేపించే ప్రయత్నాలు,  వేర్పాటువాద కార్యకలాపాల భావాలను ప్రోత్సహించడం నేరం.  అది భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతాసమగ్రతలను ప్రమాదంలో పడేస్తుంది. ఇలాంటి చర్యలకు పాల్పడినా.. పాలుపంచుకున్నా జీవిత ఖైదు, లేదంటే ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది అలాగే జరిమానా కూడా. ఇక మూక హత్యలకు మరణశిక్ష విధించేలా ప్రొవిజన్‌ను ప్రవేశపెట్టారు. గ్యాంగ్‌ రేప్‌లకు 20 ఏళ్ల జైలు శిక్ష నుంచి జీవితఖైదు, మైనర్‌లపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధిస్తారు.

ఇక క్రిమినల్‌ ప్రొసీజర్‌లో 300పైకి మార్పులు చేశారు. ఎక్కడ నుంచైనా ఈ-ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయొచ్చు. కేసుల సత్వర పరిష్కారం కోసమేనని కేంద్రం వెల్లడించింది. మరణశిక్షను మాత్రం అలాగే ఉంచారు. వివిధ నేరాలకు జరిమానాలు, శిక్షలను కూడా పెంచారు. చిన్న చిన్న నేరాలకు సమాజ సేవలాంటి శిక్షలను సైతం విధిస్తారు. 

అమిత్‌  షా లోక్‌సభలో మాట్లాడుతూ.. ‘1860 నుండి 2023 వరకు, దేశంలోని నేర న్యాయ వ్యవస్థ బ్రిటిష్ వారు చేసిన చట్టాల ప్రకారం పనిచేసింది. వాటిని ఈ మూడు చట్టాలు భర్తీ చేస్తాయన్నారు.  దేశంలో నేర న్యాయ వ్యవస్థలో పెనుమార్పు వస్తుందన్నారు. కొత్త మూడు చట్టాలు.. భారత పౌరుల హక్కులను పరిరక్షిస్తాయి. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌లు బ్రిటిష్‌ కాలంనాటి చట్టాలు. ఆంగ్లేయుల పాలనను రక్షించడం, బలోపేతం చేయడంతోపాటు శిక్షించడమే లక్ష్యంగా వాటిని ప్రవేశపెట్టారు. బాధితులకు న్యాయం చేయడం వాటి ఉద్దేశం కాదు. కానీ, శిక్ష వేయడం కాదు.. న్యాయం అందించడం ఈ కొత్త చట్టాల లక్ష్యం. అలాగే నేరాలను అరికట్టేందుకు శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement