‘వరకట్నమరణ’ నేరాన్ని మెకాలే కనిపెట్టలేదు. భారతదేశ భర్తలు, అత్తమామలు, ఆడపడచుల అనేక ఘోరనేరాల వల్ల భారత సమాజమే స్వతంత్రదేశంలో దీన్ని కొత్త నేరంగా నిర్వచించింది. సాక్ష్యాలు లేని నాలుగు గోడల మధ్య కుటుంబ సభ్యులే, అంటే పాత నేరగాళ్లు కాదు, సాగించే దారుణమైన హత్యలకు సరైన శిక్షలు విధించడానికి కావలసిన నియమాలు, విధానాలు పార్లమెంటు రూపొందించింది.
మనం గొప్పగా చెప్పుకునే అద్భుతమైన వారసత్వ సంస్కృతి, మనమంతా పిలుచుకునే గొప్ప నాగరికత, అంతరిస్తున్న ప్రేమలు, విజృంభిస్తున్న ద్వేషాలు, ధనాశ, క్రౌర్యం నుంచి పుట్టిన కుటుంబ నేరం ఈ ఘోరం. సిగ్గుపడవలసిన సరికొత్త భారత జాతీయనేరం. (చదవండి: తప్పు చేసినా శిక్షకు అతీతులా?)
జార్ఖండ్ రాష్ట్రంలో ఒక భర్త రామ్‌సహాయ్ మహతో, అత్త పార్వతీదేవి, మామ నేమా మహతో కలిసి కోడలు ఫుల్వాదేవిని వరకట్నం తేలేదని చంపిన సంఘటన ఇది. రాజ్‌దూత్ మోటార్ సైకిల్, 20 వేలరూపాయల వరకట్నం కోసం వధువును హింసించారు. వేరే అమ్మాయితో పెళ్లి చేస్తామని బెదిరించారు. తండ్రి అంత డబ్బు తేలేడని కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. 1997లో పెళ్లి అయిన కొద్ది నెలలకే ఆమె జీవితం ముగించారు. ఆమెను నదీ తీరానికి తీసుకువచ్చి నదిలోకి తోసి చంపేశారు. కూతురు కనిపించడం లేదని తండ్రి బోధి మహతో ఫిర్యాదు చేశారు. (చదవండి: ‘ట్యాక్స్ పేయర్స్ మనీ’ అంటూ ‘సోషల్ ఆడిట్’!)
1997లో వధువును చంపేశారు. కేసు రిజిస్టర్ అయింది. 20వ తేదీ సెప్టెంబర్ 1999 గిరిడిత్ అడిషనల్ సెషన్‌జడ్జి నేరం రుజువైందని పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. మరో నేరంలో మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమలు కావాలని తీర్పులో పేర్కొన్నారు. అంటే కేవలం పదేళ్లే శిక్ష అని అర్థం. 2007లో అంటే ఏడేళ్ల తరువాత హైకోర్టు శిక్షలను నిర్ధారించింది. 14 సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు శిక్షలను సమర్థించింది. ఈలోగా నేమా మహతో (మామ) 2009 సుప్రీం కోర్టులో అప్పీలు కోసం ఎస్‌ఎల్‌పీ వేశాడు. కానీ అంతలో మరణించాడు. కనుక ఆయనపై కేసులేవీ ఉండవు. అత్తమీద ఆరోపణలు స్పష్టంగా లేకపోవడం, రుజువులు సరైనన్ని లేకపోవడం వల్ల ఆమెను విడుదల చేశారు. 21 సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు తీర్పుతో ఈ సుదీర్ఘ అన్యాయాలస్యం తరువాత న్యాయం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కొహ్లి ఈ అప్పీలు విచారించారు. కొన్ని దేశాల్లో అయితే ఒక శిక్ష తరవాత మరొక శిక్ష అమలవుతుంది. అంటే ఇదే అమెరికాలో అయితే కోడలిని చంపిన ఈ హంతకులకు 13 ఏళ్ల జైలు శిక్ష పడేది.
నేర విచారణ దశలో తమ ఇంట్లోంచి వధువు ఏ విధంగా మాయమైపోయిందో చెప్పలేకపోయారు అత్త మామలు, భర్త. ఆమె తనతో నివసించడం లేదని వారు చెప్పినవన్నీ అబద్ధాలని కోర్టు భావించింది. తమతో కాకుండా తన బావతో ఆమె నివసించేదని చెప్పడానికి వారు విఫల ప్రయత్నం చేశారు. ఇంట్లోంచి వెళ్లిపోయిందనీ తరువాత దొరకలేదనే మాటలు కూడా నమ్మశక్యంగా లేవు. వెతకడానికి ఏం ప్రయత్నాలు చేశారో చెప్పలేకపోయారు. నిజంగా ఆమె ఇంటినుంచి మాయమైపోతే ఆమె తల్లిదండ్రులకు చెప్పకపోవడం, పోలీసులకు ఫిర్యాదు చేయక పోవడం చూస్తే వారి ప్రవర్తనపై అనుమానాలు ధృవపడుతున్నాయి.
వరకట్న హత్యలకు ప్రత్యక్ష సాక్షులు ఉండరు. నేరగాళ్లే సాక్షులు. వారి ప్రవర్తన, పరిస్థితులు, ముందు వెనుక వారి వ్యవహారాలు, అంతకుముందు జరిగిన సంగతులు వారి నేరాన్ని పట్టి ఇస్తాయి. మామూలు హత్యలకు ఈ హత్య లకు ఇదీ తేడా. హత్య జరిగిందని చెప్పే సాక్షులు ఉండని పరిస్థితులలో, వీరే హత్య చేసి ఉంటారు అని భావించడానికి తగిన పరిసర సాక్ష్యాలు కోర్టు ముందుంచడం ఒక సవాల్. దీనికిగానూ ప్రాసిక్యూషన్ వారు నీతిమంతంగా, న్యాయంగా, చాలాశ్రద్ధతో కృషి చేయవలసి వస్తున్నది.
సెక్షన్ 304 బి ఇండియన్ పీనల్ కోడ్ కింద, నిందితులే నేరం చేసి ఉంటారని భావించడానికి కొన్ని సూత్రాలను ఈ తాజా తీర్పు వివరిస్తున్నది. 1. సాధారణ పరిస్థితుల్లో కాకుండా మరోరకంగా మరణం సంభవించి ఉండటం, కాలిన గాయాలో మరోరకం శారీరక గాయాలో అయి ఉండాలి. 2. పెళ్లయిన ఏడేళ్లలోగా అసాధారణ మరణం జరిగి ఉండాలి. 3. మరణానికి ముందు అప్పుడప్పుడే ఆమె హింసకు గురై ఉండాలి. 4. ఆ హింస, క్రౌర్యం వరకట్నం కోసమో లేక దానికి సంబంధించినదై ఉండాలి. ఇందులో వధువు తండ్రి ఒక్కడే ప్రత్యక్ష సాక్షి. నిందితుడు తన కూతురికి హాని చేస్తానని బెదిరించినట్టు సాక్ష్యం చెప్పాడు. తండ్రి, తమ్ముడు, బావ చేసిన ప్రయత్నాల వల్ల ఆమె శరీర భాగాలు లభించాయి గానీ పోలీసులేమీ చేయలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ కేసులో దర్యాప్తు అంత పకడ్బందీగా లేదు. కానీ 304బి కింద పరిస్థితుల సాక్ష్యం నిందితుల నేరాన్ని రుజువు చేస్తోంది. ఫుల్వాదేవి పెళ్లయిన కొద్ది నెలలకే కట్నం కోసం హింసకు గురికావడం, కొద్దిరోజులకే అత్తవారింటి నుంచి మాయం కావడం (ఆరోపణ స్థాయిలో కూడా నమ్మలేని మాట), తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం, వధువు సోదరుడు వచ్చినపుడు ఇంటిల్లిపాదీ లేకపోవడం, ఇంటికి తాళం వేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయక పోవడం, ఆమె అస్తిపంజరం నదీ తీరంలో దొరకడం, భర్త, అత్త మామల మాటలు పొంతనలేకుండా ఉండటం వంటి వన్నీ నేరాన్ని పట్టి ఇస్తున్నాయి. ఇది హత్య. సాక్ష్యాలు దొరికితే హత్య అని నిరూపించి సెక్షన్ 302 కింద శిక్షించే వీలుంది. సెక్షన్ 304బి హత్యల వర్గంలోనే ఒక కొత్తరకం నేరం.
దీన్ని చట్టం హత్య అనకుండా వరకట్న మరణం అని పేరుపెట్టినంత మాత్రాన ఇది హత్య కాకుండా పోదు. వివాహ వ్యవస్థను నాశనం చేస్తున్నది కుటుంబపెద్దల క్రూర స్వార్థ మనస్తత్వం. (చదవండి: వధువు కంటే వరుడు పెద్దవాడయి వుండాలా!)
- మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment