తనపై సంవత్సరాలుగా అత్యాచారం సాగిస్తూ వచ్చిన వ్యక్తిని పెళ్లాడటం ద్వారా బాధితురాలికి కాస్త ఉపశమనం కలుగుతుందని చీఫ్ జస్టిస్ భావించారా లేక జైలు శిక్షను అనుభవించడం కంటే పెళ్లి అనేది మరింత శిక్షగా ఆయన భావించారా లేక పెళ్లి ద్వారా శిక్షను తగ్గించుకోవచ్చని బాధితుడికి సూచించారా అనేది స్పష్టం కావడం లేదు. ఒక మహిళ శరీరంపై ఆమెకున్న హక్కును భగ్నపర్చిన వ్యక్తితో జీవితకాలం సంబంధంలో ఉండాలని, అందుకోసం చట్టపరంగా కూడా అతగాడికి పవిత్రతను చేకూరుస్తామని అర్థం వచ్చేలా ప్రధాన న్యాయమూర్తి సూచించడం నైతికంగా అత్యంత అసహ్యకరమైనదిగానే భావించాల్సి ఉంటుంది.
సాక్షాత్తూ అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనమే అత్యాచార నేర చర్యను చట్టవిరుద్ధంగా మాఫీ చేయవచ్చని, రాజీ కుదుర్చవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు, తాము అత్యాచారం చేసిన మహిళలను పెళ్లి చేసుకుంటే చాలు తమకు క్షమాభిక్ష లభిస్తుందనే ప్రమాదకర సంకేతాలు లైంగిక నేరస్తులకు అందటం ఖాయం. మైనారిటీ తీరని బాలికపై అత్యాచారం చేసిన సీరియల్ రేపిస్టుకు ఆమెను పెళ్లాడతావా అంటూ సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే ప్రతిపాదించిన క్షణంలో మన దేశంలో కొనసాగుతున్న పితృస్వామిక దురభిప్రాయాలు, స్త్రీ ద్వేషం పూర్తి స్థాయిలో ప్రదర్శితమయ్యాయనే చెప్పాలి.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించింది ఎవరినో కాదు.. లైంగిక దాడుల నుంచి పిల్లల పరిరక్షణ చట్టం 2012, భారతీయ శిక్షా స్మృతిలోని 376, 417, 506 సెక్షన్ల కింద అత్యాచారం, నేరపూరితంగా బెదిరించడం వంటి ఆరోపణలపై కేసులున్న నిందితుడికి సుప్రీం చీఫ్ జస్టిస్ ఈ విధమైన ప్రతిపాదన చేశారు. తన సమీప బంధువైన బాధితురాలి ఇంట్లోకి ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ప్రవేశించిన నేరస్థుడు ఆమె కాళ్లు చేతులను కట్టివేసి తర్వాత అత్యాచారానికి ఒడిగట్టాడు. అప్పుడు ఆ అమ్మాయి 9వ తరగతి చదువుతూ ఉండింది. ఆమె 12వ తరగతిలోకి వచ్చేంతవరకు ఆమెను అతగాడు పదేపదే అత్యాచారం చేస్తూ వచ్చాడు. తనకు, తన కుటుంబానికి హాని కలిగిస్తానని బెది రించి మరీ ఈ పనికి పాల్పడ్డాడు.
పైగా ఈ ముష్కరుడు మోటార్ సైకిల్‌లో పెట్రోల్ క్యాన్ పెట్టుకుని మరీ ఆమెను అనుసరిస్తూ సజీవ దహనం చేస్తానంటూ బెదిరిస్తూ వచ్చాడు. ఈ భయానక నేరం ఆ అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు గానీ ఆమె తల్లిదండ్రులకు తెలీలేదు. చదువులేని ఆ బాధితురాలి తల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని వెళితే, ఆమె నుంచి ఫిర్యాదు తీసుకోవడానికి బదులుగా ఆమె కుమార్తెకు, నిందితుడికి మధ్య పరస్పర సమ్మతితోనే శారీరక సంబంధం పెట్టుకున్నట్లు స్టాంప్ పేపర్‌పై కన్నతల్లి చేత సంతకం పెట్టించుకున్నారు. పైగా ఆ అమ్మాయికి మైనారిటీ తీరాక తన కొడుకు ఆమెను పెళ్లాడతాడని నిందితుడి తల్లి హామీ ఇచ్చింది. కానీ హామీని నింది తుడు భంగపరిచిన తర్వాతే పోక్సో చట్టం కింద అతగాడిపై ఫిర్యాదు నమోదు చేశారు.
అదనపు సెషన్స్ జడ్జి మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్‌ని బాంబే హైకోర్టు కొట్టివేశాక నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్లాడు. సెషన్స్ జడ్జి అహేతుకంగా, యథేచ్ఛగా, చంచలత్వంతో నిందితుడికి బెయిల్ మంజూరు చేశారని బాంబే హైకోర్టు పేర్కొనడమే కాకుండా, న్యాయవ్యవస్థ తనపై పెట్టిన బాధ్యతను విస్మరించారంటూ సెషన్స్ జడ్జిని అభిశంసించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యంలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సమక్షంలో నిందితుడితో చీఫ్ జస్టిస్ చేసిన సంభాషణను పరిశీలించవలసి ఉంటుంది. ఈ కేసులో నిందితుడి తరపు లాయర్‌తో మాట్లాడిన చీఫ్ జస్టిస్ ‘బాధితురాలిని పెళ్లాడాలనుకుంటే మేము నీకు సాయం చేస్తాం. అలా కాకుంటే నీ ఉద్యోగాన్ని పోగొట్టుకుని జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే నీవు ఆ అమ్మాయిని వేధించావు, అత్యాచారం చేశావు’ అని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆమెపై అత్యాచారం చేయడానికి ముందు నీవొక ప్రభుత్వ ఉద్యోగివి అనే విషయం ఆలోచించాల్సి ఉండిందని కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. దానికి నిందితుడు స్పందిస్తూ, ప్రారంభంలోనే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ ఆమె వ్యతిరేకించిందని, ఇప్పుడు తనకు పెళ్లయింది కాబట్టి ఆమెను పెళ్లాడలేనని సమాధానమిచ్చాడు. అప్పుడు సుప్రీంకోర్టు నిందితుడు తన పిటిషన్ ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తూ, రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు హైకోర్టు అతడిపై విధించిన అరెస్టు ఆదేశంపై నాలుగువారాల పాటు స్టే విధించింది.
పెళ్లి-సాంత్వన, శిక్ష, మినహాయింపు
తనపై సంవత్సరాలుగా అత్యాచారం సల్పిన వ్యక్తిని పెళ్లాడటం ద్వారా బాధితురాలికి కాస్త ఉపశమనం కలుగుతుందని చీఫ్ జస్టిస్ భావించారా లేక జైలు శిక్షను అనుభవించడం కంటే పెళ్లి అనేది మరింత శిక్షగా ఆయన భావించారా లేక పెళ్లి ద్వారా శిక్షను తగ్గించుకోవచ్చని బాధితుడికి సూచించారా అనేది స్పష్టం కావడం లేదు. ఒక మహిళ శరీరంపై ఆమెకున్న హక్కును భగ్నపర్చడమే కాకుండా, ఆ వ్యక్తితో జీవితకాలం సంబంధంలో ఉండాలని, అందుకోసం చట్టపరంగా కూడా అతగాడికి పవిత్రతను చేకూరుస్తామని అర్థం వచ్చేలా రాజ్యాంగంపై, లైంగిక సమానత్వం అనే మానవ విలువపై విశ్వాసం ఉంచుకున్న ప్రధాన న్యాయమూర్తి సూచించడం నైతికంగా అసహ్యకరమైనది.
తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని పెళ్లాడటం ద్వారా బాధితురాలు అంతకాలం అనుభవించిన బాధ, మానసిక అఘాతం, అవమానం, ఆగ్రహం వంటివన్ని మంత్రించినట్లుగా మాయమైపోతాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భావిస్తున్నారా? నిందితుడి తల్లి తన కుమారుడితో పెళ్లికి ఒప్పుకోవాలని బాధితురాలి తల్లికి చేసిన ప్రతిపాదనను ఆమె ఆమోదించాల్సి వచ్చింది అంటేనే దాన్ని మహిళను నియంత్రిం చడానికి పితృస్వామిక ఆధిపత్యపు విషాద వ్యక్తీకరణగానే చూడాల్సి ఉంటుంది. దెబ్బతిన్న మహిళను లొంగదీయడానికి పరువు, అవమానాలను మన సమాజం నేటికీ ఆయుధాలుగా ఉపయోగి స్తోంది. ఈ కేసులో బాధితురాలు ఆనాటికి మైనర్‌గా ఉంటున్నందున ఆమె సమ్మతి తీసుకోవడం అనేది సమస్యే కాదు. కన్నకూతురిని బలాత్కరించిన వ్యక్తితో పెళ్లికి కన్నతల్లి ఆమోదం తెలపడం మన దేశ అమ్మాయిలపై తల్లిదండ్రులకు ఉన్న ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తుంది.
మహిళ శరీరంపై అధికారం ఎవరిది?
తనపై అత్యాచారం చేసిన నిందితుడిని పెళ్లాడాల్సిందిగా బాధితురాలిని తాను బలవంతపెట్టలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. బాధితురాలి మానసిక స్థితిని అంచనా వేయడానికి ముందే నిందితుడికి ఇలాంటి ప్రతిపాదన చేయడమే వింత. ఒకవేళ నిందితుడు బాధితురాలిని పెళ్లాడటానికి అంగీకరించి ఉంటే, తర్వాతైనా బాధితురాలి అభిప్రాయాలను, సమ్మతిని న్యాయస్థానం తెలుసుకుని ఉండేదా? తనపై లైంగిక దాడి చేసిన వ్యక్తితో సంబంధంలోకి వెళ్లడం అనే భావననే బాధితురాలు సహించలేదని, తిరగబడుతుందని న్యాయమూర్తులకు తెలీదా? అందులోనూ శారీరకంగా, భావోద్వేగపరంగా తనపై దాడిచేసిన వ్యక్తికి సంబంధించిన విషయం ఇది.
బాధితురాలికి రేపిస్టుతోనే పెళ్లి చేయడం ద్వారా ఆమెకు కనీస ప్రమాణాలతో కూడిన పవిత్రతను కలిపించడం అంటే తనపై లైంగిక దాడిచేసిన వ్యక్తితో జీవితకాల సంబంధాన్ని వ్యవస్థాగతంగా ఏర్పర్చడంలోని భయానకమైన స్థితిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కాదా? దెబ్బతిన్న మహిళలకు ఉత్తమ ప్రయోజనాలు కలిగించడానికే తాను పనిచేస్తున్నానని ఉన్నత న్యాయస్థానం నిజంగా నమ్ముతోందా? దీన్ని మరోలా చూద్దాం. నీ శరీరంపై నీ హక్కును ఉల్లంఘించారు. కానీ నీ సొంత ప్రయోజనం కోసమే నీ శరీరాన్ని నీ సమ్మతి లేకుండా పాశవికంగా, బలవంతంగా తాకి బలాత్కరించిన వ్యక్తే నీ గౌరవాన్ని పునరుద్ధరించగలడని నేను హామీ ఇవ్వగలను, నిన్ను తన భార్యగా స్వీకరించి దయదల్చడం ద్వారా నిందితుడు నీకు కలిగిన నష్టాన్ని పూడ్చగలడు అనే అంశాన్ని న్యాయస్థానం ఈ కేసులో సూచిస్తోందా?
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకటనపై తీవ్ర ఆగ్రహం ప్రకటించిన వేలాదిమంది లైంగిక సమానత్వ ఉద్యమకారులు చీఫ్ జస్టిస్ బాబ్డేకి బహిరంగ లేఖ రాస్తూ తన ప్రకటనను ఉపసంహరించుకోవాలని, దేశంలోని మహిళలందరికీ ఆయన క్షమాపణ చెప్పాలని, అంతేకాకుండా ఆయన వెంటనే తన పదవినుంచి దిగిపోవాలని కూడా డిమాండ్ చేశారు. న్యాయస్థానాల్లో తమ విధులను నిర్వర్తిస్తున్న సమయంలో జడ్జీలు స్వేచ్ఛగా ఇలాంటి అసంబద్ధ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నప్పుడు, లైంగిక న్యాయం, సమానత్వానికి సంబంధించి రాజ్యాంగపరమైన విలువలను పాటించే, అమలు చేసే శక్తి మన న్యాయమూర్తులకు ఉందా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.
ఎస్. దేవిక, న్యాయవాది, చెన్నై
(ది వైర్ సౌజన్యంతో)
చట్ట పరిమితులు దాటిన ‘న్యాయం’
Published Sat, Mar 6 2021 12:26 AM | Last Updated on Sat, Mar 6 2021 5:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment