‘అడల్టరీ’ అనేది స్త్రీ ఆలోచనలో కూడా ఉండని విషయం. పురుషుడు మాత్రమే.. కష్టపడి స్త్రీ చుట్టూ తిరిగి, స్త్రీ కళ్లబడి, స్త్రీ కాళ్లావేళ్లా పడి, స్త్రీ ముందు కన్నీరు పెట్టుకుని, స్త్రీ చేత కన్నీరు పెట్టించి సాధించుకునే ‘విజయం’!
‘‘స్త్రీ, పురుషులిద్దరూ కలిసి చేసే తప్పుకు పురుషుడొక్కడిపైనే నేరం మోపి, అతడికి మాత్రమే శిక్ష విధించడం ఏ కాలం నాటి న్యాయం?’’ అని జోసెఫ్ షైనీ అనే వ్యక్తి భారత ప్రభుత్వంపై వేసిన కేసొకటి కొన్నాళ్లుగా సుప్రీంకోర్టులో నలుగుతోంది. ఇండియన్ పీనల్ కోడ్‌లోని 497వ సెక్షన్‌ను రద్దు చెయ్యాలని ఆయన అభ్యర్థన. ఆ సెక్షన్ ప్రకారం.. పెళ్లయిన స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకున్న పురుషుడికి ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేక ఈ రెండూ గానీ ఉంటాయి. స్త్రీకి ఇవేమీ ఉండవు. ఆమె అసలు నేరస్తురాలే కాబోదు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం మతానికి, జాతికి, కులానికి, ప్రాంతానికి అతీతంగా స్త్రీ, పురుషులంతా చట్టం ముందు సమానమే అయినప్పుడు 497 సెక్షన్ ఆ ఆర్టికల్‌కు లోబడే ఉండాలి కదా అని జోసెఫ్ వాదన.
అలాగని స్త్రీని కూడా నిందితురాలిని, ముద్దాయినీ చేసి శిక్ష విధించమని ఆయనేమీ అడగడం లేదు. ఈ సెక్షన్‌ని అసలుకే ఎత్తేయమని విజ్ఞప్తి చేస్తున్నారు. వివాహిత స్త్రీతో ఆమె భర్త అనుమతి గానీ, సమ్మతిగానీ లేకుండా ఎవరైనా శారీరక సంబంధం పెట్టుకుంటే అది అత్యాచార స్థాయి నేరం కాకపోవచ్చు గానీ, అడల్టరీ (వ్యభిచారం) కింద నేరమే అవుతుందని అంటోంది సెక్షన్ ఫోర్ నైంటీ సెవన్. దీని పైన కూడా జోసెఫ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భర్త అనుమతి, సమ్మతి అన్నప్పుడు అందులో స్త్రీ అనే జీవి.. పురుషుడి ఆస్తి అన్న అర్థం ధ్వనిస్తోందని ఆయన తన వాదనల్లో వినిపించారు. అయితే ఈ కేసు విషయంలో భారత ప్రభుత్వం కాస్త గట్టిగానే ఉంది.
జోసెఫ్ ఆశిస్తున్నట్లుగా సెక్షన్ ఫోర్ నైంటీ సెవన్‌ను రద్దు చేసినట్లయితే వివాహ వ్యవస్థ మొత్తం ధ్వంసం అయిపోతుందని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ మాత్రం భయమైనా లేకపోతే పురుషులను నియంత్రించలేమని, ఎంతో ఉదాత్తమైన భారతీయ వైవాహిక వ్యవస్థలోని విలువలు మంటగలిసి పోతాయని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఐదుగురు జడ్జిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసు మీద వచ్చే రెండు మూడు వాయిదాల్లో తీర్పు ఇవ్వబోతోంది. ఇంతగా ఆలోచించేందుకు ఇందులో ఏమీ లేదని అనుకుంటే కనుక ఈ ఒకట్రెండు రోజుల్లోనే తీర్పు వచ్చేయొచ్చు.
ఐపీసీ లోని సెక్షన్ 497 నూటా యాభై ఏడేళ్ల నాటిది. అప్పటి సమాజానికీ, ఇప్పటి సమాజానికీ; అప్పటి స్త్రీల జీవన స్థితిగతులకు, ఇప్పటి స్త్రీల జీవన స్థితిగతులకు సుమారు ఒకటిన్నర శతాబ్దాల వ్యత్యాసం ఉంది కనుక, ఈ సెక్షన్‌ను రద్దు చేయడంలో తప్పు లేదని జోసెఫ్ షైనీ ఆలోచనను సమర్థించే వారు అంటున్నారు. ప్రముఖ ఆంగ్ల జాతీయ దిన పత్రిక కూడా తన ‘వ్యూ’ ఏమిటో ఒక్కమాటలో స్పష్టంగా చెప్పింది.
విక్టోరియా కాలం నాటి ఈ సెక్షన్‌ను ఇంకా కొనసాగించడంలో అర్థం లేదంది! స్త్రీ, పురుషులిద్దరూ చేసిన తప్పులో పురుషుడిని మాత్రమే దోషిని చెయ్యడం అంటే.. స్త్రీ అమాయకురాలు, నిర్దోషి అని పరోక్షంగా తీర్మానించడమే కదా.. పురుషుడిని మాత్రమే దోషిని చెయ్యడం ఎంత అర్థరహితమో, స్త్రీని నిర్దోషిని చెయ్యడం అంత అర్థరహితం అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చట్టాలు, సెక్షన్‌లు భారతీయ వివాహ వ్యవస్థను నిలబెట్టలేవు అంటూ.. భారత ప్రభుత్వ వాదనలో ఈ కాలపు ఆలోచన లేదు అని విమర్శించింది. అంటే.. సెక్షన్‌ను రద్దు చెయ్యాలని చెప్పడం!
157 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌ను క్వీన్ విక్టోరియా పాలిస్తున్న కాలంలో 1861లో భారతీయ శిక్షా స్మృతి ఆవిర్భవించి, అమల్లోకి వచ్చింది. విక్టోరియా మహారాణి పాలనలో విలువలతో కూడిన మానవ జీవితం ఉండేది. నీతి నియమాలు, భక్తి విశ్వాసాలతో పాటు స్వీయ నిగ్రహం, విధేయత, కష్టపడి పని చేసే తత్వం ఉండేది. తప్పు జరిగే ఇరుకు తోవల్లోకి ఎవరూ వెళ్లేవారు కాదు. విశాలమైన వెలుగు మైదానాల్లో ధర్మబద్ధంగా, ధైర్యంగా జీవించేవారు. ఆ విలువలు అంత బలమైనవి కనుకే.. ఇప్పటికీ ‘విక్టోరియన్ మోరల్స్..’ అనే మాట వినిపిస్తుంటుంది.
జోసెఫ్ షైనీని సమర్థించేవారు మాత్రం ‘ఇంకా ఆ మోరల్స్‌ని పట్టుకుని వేళ్లాడ్డం ఎందుకు? ఇప్పటి మహిళలు అప్పటి మహిళల్లా ఉన్నారా?’ అంటున్నారు! జోసెఫ్‌ని సమర్థించేవారు ఆ మాట అంటున్నారే కానీ, జోసెఫ్ ఆ మాట అనడం లేదు. స్త్రీలు గానీ, పురుషులుగానీ; అప్పుడు గానీ, ఇప్పుడుగానీ కలిసి ఒక తప్పు చేసినప్పుడు, వారిలో ఒకరికే శిక్ష విధించడం కన్నా.. అసలు ఆ సెక్షన్‌నే రద్దు చేయడమే న్యాయం కదా అంటున్నారు. అంతకు మించి డీప్‌గా ఆయనేమీ వెళ్లడం లేదు. తప్పు చేసినవాడు పురుషుడైతే, తప్పుకు తోడైన స్త్రీ సైతం నేరస్తురాలే అని కూడా ఆయనేమీ అనడం లేదు. పైగా రెండు మంచి విషయాల్ని (ఆర్టికల్ 14, స్త్రీని పురుషుడి ఆస్తిగా చేయడం) పైకి తీశారు. కానీ ఆయన తీసిన మంచి విషయాల కంటే, సెక్షన్‌ను రద్దు చేస్తే వివాహ వ్యవస్థకు జరిగే కీడే ఎక్కువ అని భారత ప్రభుత్వం భావిస్తోంది.
‘పాతకాలంలో స్త్రీలు మితిమీరిన సామాజిక నిబంధనలు, నియంత్రణల మధ్య ఉండేవాళ్లు. అప్పుడు (వివాహేతర సంబంధాలలో) తప్పు చేసినా, తప్పు చేయించినా పురుషుడే బాధ్యుడు అయివుండటానికి అవకాశం ఉంది కాబట్టి ఆ కాలానికి ఆ సెక్షన్ రైటే గానీ.. ఇప్పటి స్త్రీలకు కూడా చట్టం ఆ కాలం నాటి స్టేటస్‌నే ఇవ్వడం ఏంటి?’ అనే సందేహం రావడం సహజమే. అయితే నిబంధనలు ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా ఉండే తత్వం ఎందుచేతో పురుషులలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ‘అడల్టరీ’లోనైతే మరీ ఎక్కువ. అడల్టరీ అనేది అసలు స్త్రీ ఆలోచనల్లో కూడా ఉండని విషయం.
పురుషుడు మాత్రమే.. కష్టపడి ఆమె చుట్టూ తిరిగి, ఆమె కాళ్లావేళ్లా పడి, ఆమె ముందు కన్నీరు పెట్టుకుని, ఆమె చేత కన్నీరు పెట్టించి సాధించుకునే ‘విజయం’! ఈ మాత్రపు విక్టోరియన్ ఎరా సెక్షన్లయినా లేకుంటే భారత ప్రభుత్వం వాదిస్తున్నట్లు వివాహ వ్యవస్థ, వివాహ విలువల్ని పురుషుడు ధ్వంసం చేసేస్తాడు. ఇంకా ముఖ్యమైన సంగతి.. అసలు జోసెఫ్ షైనీ వాదన సమర్థనీయమే కాదు. ఎందుకంటే ‘వేరొకరి భార్యను పొందడం నేరం’ అని చెప్పే సెక్షన్ ఇది. ప్రత్యేకించి అందుకోసమే ఉన్న సెక్షన్. కావాలంటే ‘పరపురుషుడికి లోబడటం నేరం’ అనే ఒక కొత్త సెక్షన్ కోసం జోసెఫ్ డిమాండ్ చేయవచ్చు.
- మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment