Prajwal Revanna: ప్రజ్వల్‌ రేవణ్ణకు ఊహించని షాక్‌ | Rape Case Filed Against JDS MP Prajwal Revanna | Sakshi
Sakshi News home page

Prajwal Revanna: ప్రజ్వల్‌ రేవణ్ణకు ఊహించని షాక్‌

Published Fri, May 3 2024 10:49 AM | Last Updated on Fri, May 3 2024 4:23 PM

Rape Case Filed Against JDS MP Prajwal Revanna

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్‌ రేవణ్ణకు మరో షాక్‌ తగిలింది. తాజాగా అతడిపై అత్యాచారం కేసు నమోదైంది.

వివరాల ప్రకారం.. కర్ణాటకలో సంచనలంగా మారిన ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు విషయంలో పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ప్రజ్వల్‌పై అత్యాచారం కేసు నమోదైంది. లైంగిక వేధింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌పై సిట్‌ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు బుక్‌ చేశారు. ఐపీసీ సెక్షన్‌ 376 (బీ) (ఎన్‌), 506, 354(ఏ)(2), 354(బీ), 354(సీ), ఐటీ చట్టం కింద కేసు ఫైల్‌ చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌లో ప్రజ్వల్‌ రేవణ్ణను ఏకైక నిందితుడిగా చేర్చారు. కాగా, ఇది ప్రజ్వల్‌పై నమోదైన రెండో కేసు.

ఇదిలా ఉండగా.. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్‌ దర్యాప్తు చేపడుతోంది. ఇందులో భాగంగా విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా ఎస్పీ సీమా లాట్కార్‌ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, తనకు సమయం కావాలని ప్రజ్వల్‌ రేవణ్ణ సిట్‌ అధికారులను కోరారు.

 

 

ఈ నేపథ్యంలో ప్రజ్వల్‌ ట్విట్టర్‌ వేదికగా‘సిట్‌ ముందు హాజరుకావడానికి ఏడు రోజుల సమయం కావాలి. ఇప్పుడు నేను బెంగళూరులో లేను’ అంటూ ఒక పోస్టు చేశాడు. కాగా, ప్రజ్వల్‌ అభ్యర్థనను సిట్‌ తిరస్కరించింది. ఈ మేరకు గురువారం ఉదయం మరోసారి సమన్లు పంపింది. అనంతరం కొద్దిసేపటికే ఆయనపై లుక్‌ అవుట్‌ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనపై అత్యాచారం కేసు కూడా నమోదు చేసింది.

ప్రస్తుతం ప్రజ్వల్‌ జర్మనీలో ఉన్నట్లు తేలింది. లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రజ్వల్‌.. డిప్లొమాటిక్‌ పాస్‌పోర్ట్‌ ఉపయోగించి ఏప్రిల్‌ 28న జర్మనీ పారిపోయారు. ఈ క్రమంలో మరోవైపు అతడి పాస్‌పోర్ట్‌ రద్దు చేసి, ప్రజ్వల్‌ను భారత్‌కు రప్పించటంలో సాయం చేయాలని ప్రధాని మోదీని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కోరారు. మరోవైపు విచారణకు హాజరు కాకపోతే దేశానికి తిరిగి వచ్చిన వెంటనే ప్రజ్వల్‌ను అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement