మెకార్తీయిజం–ఎల్లో జర్నలిజం | Sakshi Guest Column On Yellow Journalism | Sakshi
Sakshi News home page

మెకార్తీయిజం–ఎల్లో జర్నలిజం

Published Thu, Mar 7 2024 12:35 AM | Last Updated on Thu, Mar 7 2024 12:35 AM

Sakshi Guest Column On Yellow Journalism

అభిప్రాయం

హిట్లర్‌ ప్రభుత్వంలో ప్రసార మంత్రిత్వశాఖను నిర్వహించిన ‘జోసెఫ్‌ గోబెల్స్‌’ పేరు అబద్ధపు ప్రచారాలకు పర్యాయ పదమై నిలిచింది. జనంలో ప్రచార మాధ్యమం ఎంత బలమైనదో అర్థం చేసు కున్నాడు జోసెఫ్‌ గోబెల్స్‌. వ్యక్తి (హిట్లర్‌) ఆరాధన పెంపొందించడానికీ, ప్రజా భిప్రాయాన్ని తారుమారు చేయడానికీ, తప్పుడు వార్తలను నిజాలుగా నమ్మించడానికీ ప్రచార, ప్రసార మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగించాడు గోబెల్స్‌. తదనంతర కాలంలో దారుణంగా అపఖ్యాతి పాలయ్యాడు. అప్పటినుంచి ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే దానిని ‘గోబెల్స్‌’ ప్రచారంగా అభివర్ణించడం పరిపాటి అయింది.

తెలుగు నాట గోబెల్స్‌ వారసులు బయల్దేరి అచ్చం గోబెల్స్‌ వలె చంద్రబాబు, లోకేష్‌ బాబుల ఇమేజ్‌ పెంచడానికి, జగన్‌ మోహన్‌ రెడ్డిపై విష ప్రచారం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. 

అయితే ఇప్పుడు ఈ దిగజారుడు జర్నలిజంలో గోబెల్స్‌ను మించి, కొత్త అంకానికి తెరతీశారు. అదే ‘మెకార్తీయిజం’. అర్థంలేని భయాలను సృష్టించి జనాల్ని కలవరపాటుకు గురి చేయడం, తమ ప్రత్యర్థులను జనాలకు భూతద్దంలో చూపి భయ పెట్టడం, తాము నమ్ముకున్న వాళ్లను రక్షకులుగా చూపించడం మెకార్తీ జర్నలిజం.

అసలేమిటీ ‘మెకార్తీ జర్నలిజం’ అని రేఖా మాత్రంగా పరిశీలిస్తే చంద్రబాబు అను‘కుల’ మీడియా ప్రచారాల తంతు అర్థం అవుతుంది. 1950వ దశకంలో అమెరికా సెనేటర్‌ జోసెఫ్‌ మెకార్తి కమ్యూనిజాన్ని బూచిగా చూపిస్తూ, కమ్యూని స్టులపై పోరాడే అలుపెరుగని వీరుడిగా ఆదిలో పేరుగాంచాడు. అయితే ఆ తర్వాత జనం చీత్కారాలకు గురై రాజకీయాల నుంచి బహిష్కృతుడయ్యాడు.

అమెరికా–రష్యాల మధ్య ఆధిపత్య పోరు నడి చిన రోజులవి. ఆ సమయంలో మెకార్తి మీడియాలో కమ్యూనిస్టులు దేశంలోకి చొరబడ్డారని భయపెట్టి వార్తలు విస్తృతంగా ప్రచారం చేసేవాడు. తనకు గిట్టని వాళ్లను ‘అన్‌ అమెరికన్‌’ అని ముద్ర వేశాడు. అతడి శాడిజానికి నిజాయితీగా పనిచేసే జర్నలి స్టులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అతడు పని చేసిన కాలాన్ని ‘రెడ్‌ స్కేర్‌’ అని పిలిచేవారు. లేని దాన్ని ఉన్నట్టు బీభత్సంగా ప్రచారం చేసే జర్నలిజం ‘మెకార్తీ యిజం’గా పేరుపడింది. ఇప్పుడు మన తెలుగు నాట చంద్రబాబునాయుడి మీడియా బృందం చేస్తున్నది అదే!

‘కామెంట్‌ ఈజ్‌ ఫ్రీ’ బట్‌ ట్రూత్‌ షుడ్‌ బీ శాక్రెడ్‌’ అంటాడు సంపాదకీయాలకు ఓంప్రథమంగా శ్రీకారం చుట్టిన ప్రఖ్యాత సంపాదకుడు థామస్‌ బార్జ్‌. కానీ ఈ సూత్రానికి తెలుగునాట ఒక వర్గం మీడియా ఎప్పుడో తిలో దకాలు ఇచ్చింది. వ్యాఖ్య ఏదైనా చేయవచ్చు. అందులో సత్యం ముత్యం అంత స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండాలి అని బార్జ్‌ చెప్తే, ‘వ్యాఖ్య ఏదైనా చేసెయ్‌! అందులో వాస్తవాలతో పని లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనం ఉండాలి.

మాంచి మసాలా దట్టించిన గుత్తి వంకాయ కూరలాగా, ఇంకా ఘాటుగా ఉండాలంటే చికెన్‌ 65 లాగా స్టోరీ వండాలి. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్‌ శెహ బాష్‌! అనే విధంగా ఉండాలి. వార్త వేరు వ్యాఖ్య వేరు అనుకోవద్దు. ఇప్పుడు మన పాలసీలో వ్యాఖ్యే వార్త’ అనే ఆదేశాలు ఇచ్చే స్థితికి దిగజారాయి బాబు భజన బృందాలు. వేయవల సిన వార్తలు ఉంటే లోపలి పేజీలో సింగిల్‌ కాలమో, డబుల్‌ కాలమో వేయాలి. ‘కిక్‌ ఇచ్చే వంటకాలే బ్యానర్‌ స్టోరీలు’... ఇదే నయా జర్నలిజం.

అయితే ప్రజలకు ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఎప్పుడో అర్థమై పోయింది. అందుకే చంద్ర బాబు నాయుడుని 23 సీట్లకు పరిమితం చేశారు. అర్థం కానిదల్లా చంద్రబాబు నాయుడికీ, ఆయన తనయుడు లోకేష్‌కే!

అసత్య ప్రచారాలకు మోసపోయే అపరిణత మనస్కులు కారు మన ఆంధ్రులు అని మరొకసారి చాటి చెప్పే సమయం ఆసన్నమైంది. అందుచేత నయా గోబెల్స్‌లను, మెకార్తీలను తరిమికొట్టడానికి ‘సిద్ధం’ కండి! టీడీపీ దోపిడీకి శాశ్వతంగా వీడ్కోలు పలకండి.

పి. విజయబాబు 
వ్యాసకర్త పూర్వ సంపాదకులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement