ఇష్టమైన పార్టీనో, నేతలనో పైకి ఎత్తడం, పాఠకు లను పక్కదారి పట్టించడం యెల్లో మీడియాకు పెన్నుతో పెట్టిన విద్య అని చెప్పాలి. వార్తల వెనుక ఉండే నిజాలతో వారికి పనిలేదు. వార్తల ప్రయో జనాలు వారికి అవసరం లేదు. స్వలాభాపేక్ష ఒక్కటే లక్ష్యం.
ఇసుక తవ్వకాలు, విక్రయాలపై కొందరు నాయకుల అక్రమాలు ప్రచురిస్తున్నట్లు కనిపించినా... ఆ వంకతో, తమకు అనుకూలమైన వారికి ‘ఈనాడు’ ఎటువంటి ప్రయోజనాలు కల్పించిందో రాస్తే అదో భారతం అవుతుంది. ఆ మధ్య మిచ్న్ తుఫాను వచ్చినప్పుడు... ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురియడంతో పల్లపు ప్రాంతాలలో కొంత మేర ముంపునకు గురయ్యాయి.
కానీ ప్రభుత్వమే ఆ పంటలను ముంచేసినట్లు చిత్రీకరిస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై ఎన్నో అభాండాలను ప్రచురించింది. గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా ఆధునీకరణ నిధులు ఏమయ్యాయి? వాటిని గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం ఎటు మళ్ళించింది అనే వాస్తవాలను పక్కన పెట్టి పంటల ముంపు బాధ్యత ప్రభుత్వానిదే అన్నట్లు ప్రచురించింది.
కృష్ణా డెల్టా ఆధునీకరణకు కేటాయించిన రూ. 175 కోట్లు కృష్ణ కరకట్టపై తాను అక్రమంగా నివాసం ఉంటున్న భవనం ప్రాంతాన్ని సుందరీకరణకు చంద్రబాబు వినియోగించారనే వాస్తవాన్ని యెల్లో పత్రికలు ఎందుకు ప్రచురించవు? గోదావరి ఆధునీకరణ నిధులను కూడా దాదాపు రూ.150 కోట్లు పుష్కరాల నెపంతో ‘పచ్చ’ కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు. ఈ వాస్తవాన్ని ఈ పత్రికలు కాదనగలవా?
ఒక ప్రభుత్వం చేస్తే సామాజిక న్యాయం, మరో ప్రభుత్వం చేస్తే సమాజ వ్యతిరేకం అవుతుందా? చంద్రబాబు పాలనలో బీసీలకు ఎనిమిది మంత్రి పదవులివ్వగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 11 మంత్రి పదవులు బీసీలకు లభించాయి? మరి ఏది సామాజిక న్యాయం అని చెప్పాలి! చంద్రబాబు ఎస్సీలకు రెండు మాత్రమే మంత్రి పదవులు ఇస్తే జగన్ ఐదుగురికి ఇచ్చారు. మరి ఎవరిది సామాజిక న్యాయం? రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన మోషేన్ రాజును కౌన్సిల్ ఛైర్మన్‌గా జగన్ చేశారు. టీడీపీ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 18 ఎమ్మెల్సీ పదవులు ఇవ్వగా, జగన్ 29 పదవులు (69 శాతం) ఇచ్చి సామాజిక న్యాయానికి బ్రహ్మరథం పట్టారు.
ఈ వాస్తవాలు కనబడవా? చంద్రబాబు హయాంలో ఏటా సగటున 324 మండలాల్లో కరువు తాండవించినా రైతులను కనికరించిన దాఖలాలు లేవు. జరిగిన పంట నష్టానికి సంబంధించి పరిహారాన్ని ఆ సీజన్ కాదుకదా, కనీసం ఆ ఏడాది ముగిసేలోగానైనా ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ వాస్తవాన్ని వదిలేసి జగన్ ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించలేదంటూ వార్తలు ప్రచురించడాన్ని ఏమనుకోవాలి? ప్రాథమిక పంట నష్టం అంచనాలు, తుది లెక్కలకు వ్యత్యాసం ఉంటుంది. దానిని వదిలేసి, పంట నష్టం లెక్కలను ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తున్నదంటూ అన్నదాతలను పక్కదారి పట్టించడం జర్నలిజంలో నైతిక ప్రమాణాలను మింగివేయడం కాదా?
బడి పిల్లలకు తగిన విద్యా బుద్ధులతో పాటు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది వైసీసీ ప్రభుత్వం. నిత్యం సగటున 34.90 లక్షల మంది బడి పిల్లలకు ‘గోరుముద్ద’ అందుతుండగా, దానిలో ఆరు రోజులకు 16 రకాల వంటకాలను విద్యార్థులు రుచి చూస్తున్నారు. ఈ భోజనానికి బాబు హయాంలో ఏటా రూ.450 కోట్లు ఖర్చు చేయగా, జగన్ ప్రభుత్వంలో ఏటా సగటున రూ.1,450 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయినా బడిపిల్లలకు సరైన పౌష్టికాహారమే లభించడం లేదంటూ వార్తలు ప్రచురించడాన్ని ఏమనాలి?
చంద్రబాబు హయాంలో 1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు వామికొండ వద్ద, 1999 ఎన్నికలకు ముందు గండికోట వద్ద మరోసారి గాలేరు–నగరికి శంకు స్థాపన చేశారు. కానీ ఆ తొమ్మిదేళ్ళలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయిన తరువాత గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని జల యజ్ఞంలో భాగంగా చేపట్టి 2009 నాటికే చాలావరకు పూర్తి చేశారు.
గండికోట రిజ ర్వాయర్, పైడిపాలెం, వామికొండ, సర్వారాయ సాగర్ జలాశయాలతోపాటు ఈ ప్రాజెక్టు పనులు చాలావరకు 2009 నాటికి పూర్తి చేశారు. తర్వాత చంద్రబాబు వచ్చాక ప్రాజెక్టు మిగిలిన పనులు పడకేశాయి. అటుపై జగన్ అధికారంలోకి వచ్చాకే పెండింగ్ పనులకు కదలిక వచ్చింది. 2020–21 నుండి గండికోటలో ఏటా పూర్తి సామర్థ్యం మేరకు 28.85 టీఎంసీలను నిలువ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందించి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు 5 లక్షల రూపాయల పరిహారం ఇవ్వగా, దానిలో 1.5 లక్షలు అప్పుల కింద జమవేసుకొనేవారు. మిగిలిన మొత్తాన్ని డిపాజిట్ చేసి దాని వడ్డీని మాత్రమే ఆ రైతు కుటుంబానికి ఇచ్చేవారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ పరిహారాన్ని 7 లక్షల రూపాయలకు పెంచడమే కాక, ఎలాంటి సమస్య లేకుండా ఆ రైతు ఖాతాలోనే నేరుగా పరిహారం మొత్తాన్ని జమచేస్తున్నారు.
విద్యార్థుల చేతుల్లో ట్యాబులు కళకళలాడుతుంటే, వారి వద్ద పలకలు కూడా లేవంటూ ప్రచారం! విద్యార్థుల ఫీజులు రీయింబర్స్ చేస్తూ రకరకాల సంక్షేమ పథకాల కింద వారి ఖాతాలకే జమ చేస్తుంటే బడి మానేసే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందంటూ ఇంకో యెల్లో పత్రిక కథనాలు! 2022– 23లో జగన్ ప్రభుత్వం 3.32 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సమీకరించిందని ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వెల్లడించగా ఆ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించడానికి మనసురాక అప్పులు పెరిగి పోతున్నాయంటూ గగ్గోలు! వార్తల్ని మింగేస్తున్న పత్రికలు ఇక సమాజాన్ని ఏం ఉద్ధరిస్తాయి?
అడుసుమిల్లి జయప్రకాశ్
వ్యాసకర్త మాజీ ఎమ్మెల్యే ‘ 98481 28844
అవాకులు చవాకులే వారికి వార్తలా?
Published Fri, Feb 2 2024 12:16 AM | Last Updated on Fri, Feb 2 2024 12:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment