- ఓటర్లకు నోట్ల పంపిణీలో టీడీపీ నేతలు తలమునకలు
- కుప్పంలో ఓటుకు ఐదు వందలు
- అత్యధికంగా తిరుపతి, చిత్తూరులో వెయ్యి నుంచి రెండు వేలు పంపిణీ
- పీలేరులో వెయ్యి రూపాయలు అందజేస్తున్న జై సమైక్యాంధ్ర అభ్యర్థి
- తంబళ్లపల్లె, నగరిలో టీడీపీ కార్యకర్తల నుంచి డబ్బు స్వాధీనం
సాక్షి, తిరుపతి: ప్రలోభాల పర్వానికి తెలుగుదేశం పార్టీ తెరలేపింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు 24 గంటలు మాత్రమే సమయం ఉండడంతో ఓట్ల కొనుగోలుకు సర్వశక్తులు వినియోగిస్తోంది. జిల్లాలో కీలకమైన కుప్పం, చంద్రగిరి, తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, నగరి, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో సోమవారం నుంచి పెద్ద మొత్తాల్లో డబ్బు పంపకాలు సాగిస్తోంది.
మద్యం ఏరులై ప్రవహింపజేస్తోంది. పలు చోట్ల టీడీపీ కార్యకర్తల నుంచి డబ్బు, మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పీలేరు నియోజకవర్గంలో జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి తరఫున విచ్చలవిడిగా ఓటర్లను కొనుగోలుచేసే పనిలో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఓటు రేటు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు నిర్ణయించారు.
ఇంటింటికి వెళుతున్న కార్యకర్తలు ఓటరు స్లిప్పులు చూపించిన వారికి డబ్బులు అందజేస్తున్నారు. ప్రమాదకరమైన మద్యం పంపిణీ జరుగుతోంది. కుప్పం ఎన్టీఆర్ కాలనీ సమీపంలో గుట్టల్లో దాచి ఉంచిన 132 క్వార్టర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనదిగా చెబుతున్నారు. ఈ మద్యాన్ని బాటిళ్లలో కాకుండా జ్యూస్ ప్యాకెట్లలో నిల్వ చేసి ఉంచడం గమనార్హం. శాంతిపురం మండలంలో ఒకరి నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం, కుప్పంలో లభ్యమైన మద్యం ఒకటేనని పోలీసులు తేల్చారు.
దీంతో నియోజకవర్గం మొత్తం మద్యం పంపిణీ జరిగినట్టు తెలుస్తోంది. మద్యం శాంపిళ్లను లేబొరేటరీకి పంపినట్టు అధికారులు వెల్లడించారు. పలమనేరు నియోజకవర్గం పరిధిలో సముద్రపల్లె గ్రామంలో టీడీ పీ యువనేత ఒకరి పొలంలో దాచిపెట్టిన 87 కేసుల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ యువనేత సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దపంజాణి మండలంలో 40 కేసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదే నియోజకవర్గంలోని భద్రాచలం వద్ద 1400 క్వార్టర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ కార్యకర్త షబ్బీర్ కర్ణాటక నుంచి ఇక్కడికి తీసుకొస్తుండగా పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోటలో టీడీపీ కార్యకర్త ఒకరు దాచిఉంచిన రూ. 39.5 లక్షలు పోలీసులకు పట్టుబడింది. ఈ నియోజకవర్గంలో ఓటుకు ఐదు వందల రూపాయల వంతున పంపిణీ చేస్తున్నారు.
మదనపల్లెలో బీజేపీ అభ్యర్థి తరఫున ఐదు వందలు అందజేస్తున్నట్టు సమాచారం. పీలేరు నియోజకవర్గంలో జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్ధి తరఫున ప్రాంతాలవారీగా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల పంపిణీ జరుగుతోంది. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు ఓటుకు మూడు వందలు పంపిణీ చేస్తూ పది కిలోల బియ్యం ప్యాకెట్ అందజేస్తామని హామీ ఇస్తున్నారు. చిత్తూరులో కొన్నిచోట్ల వెయ్యి, మరికొన్నిచోట్ల రెండు వేల రూపాయలు కూడా ఇస్తున్నారు.
చంద్రగిరి నియోజకవర్గంలో మద్యం బాటిల్‌తో పాటు వెయ్యి రూపాయలు వంతున అందజేస్తున్నారు. నగరి నియోజకవర్గంలోని వడమాలపేటలో టీడీపీ కార్యకర్త ఒకరి నుంచి లక్షా 80 వేల రూపాయలను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. సీతారామపురం గ్రామంలో దినకర్‌నాయుడు అనే కార్యకర్త నుంచి లక్ష రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు.
ఇక్కడ ఓటుకు ఐదు వందల వంతున పంపిణీ జరుగుతోంది. తిరుపతి టీడీపీ ఓటుకు వెయ్యి నుంచి రెండు వేల వరకు ధర నిర్ణయించింది. కొన్నిచోట్ల వెండి కుంకుమభరిణలు పంపిణీచేస్తోంది. సత్యవేడు నియోజకవర్గంలో మద్యం తీసుకువెళ్తున్న టీడీపీ సర్పంచ్ భర్త ఒకరి నుంచి ఐదు కేసుల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.