మాజీ సీఎం కిరణ్ దుకాణం మూసేశాడు!
మాజీ సీఎం కిరణ్ దుకాణం మూసేశాడు!
Published Tue, Jul 1 2014 1:15 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్ లో జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) దుకాణం మూసేసింది. ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న తర్వాత మాజీ సీఎం, ఆపార్టీ అధినేత ఎన్ కిరణ్ కుమార్ రెడ్డితోపాటు ఇతర నాయకులు జేఎస్పీ కార్యాలయం రావడమే మానేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన జరిగి రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత జైసమైక్యాంధ్ర ఉద్యమానికి, పార్టీకి కాలం చెల్లిపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో దుకాణాన్ని మూసేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత కూడా పార్టీ సమావేశాలు, భవిష్యత్ కార్యాచరణ కూడా ఏమి లేకపోవడంతో కిరణ్ కుమార్ కూడా జై సమైక్యాంధ్రపై ఎక్కడా మాట్లాడకపోవడం, జన జీవన స్రవంతిలో కనిపించడం మానేసిన సంగతి తెలిసిందే.
జై సమైక్యాంద్ర పార్టీని స్థాపించిన మూడు నెలల తర్వాత మాదాపూర్ లో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మూసివేయడం గమనార్హం. మాదాపూర్ లోని కృతికా లేఅవుట్ లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్న ఐదు అంతస్తుల భవనానికి ఉన్న పార్టీ పోస్టర్లు, బ్యానర్లను, జెండాలను రెండు రోజుల క్రితం తొలగించారు. దాంతో అద్దెకు తీసుకునేందుకు ఆ భవనానికి ఐటీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ల తాకిడి ఎక్కవైనట్టు సమాచారం.
జేఎస్పీ కార్యాలయాన్ని గుట్టు చప్పుడుకాకుండా మూసేసినట్టు ఆపార్టీకి చెందిన సీనియర్ నేతలకే తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రెండు రోజుల క్రితమే కార్యాలయం నుంచి ఫర్నిచర్, స్టేషనరీని తరలించినట్టు ఓ ఆంగ్ల దినపత్రిక తన కథనంలో వెల్డడించింది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారంటూ మీడియాలో వార్తలు రావడం, బీజేపీ నేత కిషన్ రెడ్డితో భేటి కావడం కూడా పార్టీకి మంగళం పెడుతున్నారనే వార్తలకు బలం చేకూర్చాయి. జై సమైక్యాంధ్ర అంటూ ప్రజల్లోకి వెళ్లిన కిరణ్ .. రాష్ట్ర విభజనకు కారణమైన బీజేపీలోనే చేరడానికి ప్రయత్నించడం కొసమెరుపు.
Advertisement
Advertisement