విభజనపై నా వైఖరి మారలేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో తాను కన్విన్స్ కాలేదని, తన వైఖరిని మార్చుకోలేదని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. విభజనతో అనేక సమస్యలున్నాయని, మున్ముందు ఇంకా వస్తాయని, అందుకే పునరాలోచన కోరుతున్నామని చెప్పారు. అయినా ‘‘ఈ సబ్జెక్ట్ ఇక క్లోజ్డ్... దీనిపై ఇంకేం ప్రస్తావించొద్దు’’ అని ఆయన మీడియాకు సూచించారు. కిరణ్ శనివారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘విభజనకు మీరు అంగీకరించారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పార’ంటూ విలేకరులు ప్రస్తావించగా.. ‘‘అది ఆయన వెర్షన్ ఏమో... నేనైతే కన్విన్స్ కాలేదు. మొదటినుంచీ నా వైఖరి ఎక్కడా మారలేదు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే తెలుగు ప్రజలకు మేలు జరుగుతుంది, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని నమ్మిన వాళ్లలో మేమందరం ఉన్నాం. ఇదొక సున్నిత అంశం. దయచేసి దాన్ని లేవనెత్తొద్దు. ఇది సమయం కాదు. నా భావన కానీ, అభిప్రాయం కానీ మార్చుకోలేదు. అలా మాట కూడా చెప్పలేదు’’ అని ఆయన బదులిచ్చారు.
‘పదే పదే సమైక్యవాదన వినిపించడంతో తెలంగాణ ప్రజలను కించపరిచినట్టు మీరు భావించడం లేదా?’ అని అడగగా.. ‘‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేది ప్రజల ఆకాంక్ష. దాన్ని మేం ఎక్కడా కించపరచటం లేదు.
కానీ విభజిస్తే తెలంగాణకు, ఆంధ్ర రాష్ట్రం కంటే ఎక్కువ నష్టం వస్తుందనే చెబుతున్నాం. మళ్లీ పునరాలోచన చేసుకోవాలని మాత్రమే కోరుతున్నాం. ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మీ ముందుకు వస్తాయ్. ఏమేం సమస్యలొస్తాయనేది తెలుస్తుంది. ఈ సబ్జెక్ట్ ఇక క్లోజ్డ్... దీనిపై ఇంకేం ప్రస్తావించొద్దు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో ఆంటోనీ కమిటీ నివేదిక అంశాలు చూశాక మీరు కన్విన్స్ అయ్యారంటున్నారని అనగా.. ‘‘ఆ సమావేశం మీ భాషలో అయితే ఇన్‌కెమెరా మీటింగ్. మేం బయట మాట్లాడకూడదు’’ అని సీఎం బదులిచ్చారు. ఇతర ప్రశ్నలకు స్పందిస్తూ, ఉద్యమం జరుగుతున్నపుడు తామేం మాట్లాడినా కించపరిచినట్టు ఉంటుంది కనుక దానికి వ్యతిరేకంగా మాట్లాడదల్చుకోలేదన్నారు. ‘‘ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా మేం మాట్లాడటం లేదు.
కానీ రాబోయే సమస్యలు, పరి ష్కారం కాని సమస్యలు ఎన్నో మనముందున్నాయి. అవి పరిష్కారం అయ్యాక మనం విభజన చేయాలి. భారతదేశంలో ఎక్కడైనా కానీ 300 కిలోమీటర్ల మేరకు నదీ జలాల్ని రెండు రాష్ట్రాల మధ్య విభజించే పరిస్థితి లేదు. అలా ప్రాజెక్టులను విభజించే పరిస్థితి లేదు. రెండు ప్రాంతాలకు నష్టం జరుగుతుంది. సమన్వయం ఉండకపోతే ఒకవేళ 2009 మాదిరిగా వరదలు వస్తే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే ఆస్కారం ఉంది. ఒక ప్రాజెక్టును కేంద్రం పరిధిలో పెట్టి, ఒక జిల్లాను ఒక రాష్ట్రంలో, మరో జిల్లాని ఇంకో రాష్ట్రంలో పెడితే చాలా ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ పరిశీలించి పరిష్కారం కనుగొన్నాకే ముందుకెళ్లాలి. ఉద్యోగులది పెద్ద సమస్య ఉంది. 371డీ ఉంది. విద్య... పెద్ద సమస్య ఉంది. వైద్య సౌకర్యాలు.. పెద్ద సమస్య ఉంది. హైదరాబాద్‌లో, చుట్టుపక్కల ఉంటున్నవారి సమస్య ఉంది. వీటన్నింటినీ కూడా పరిష్కరించాకే ముందుకెళ్లాలి’’ అని ఆయనన్నారు. తెలంగాణ బిల్లుపై ప్రశ్నలకు ఆయన బదులివ్వలేదు. విభజనపై ప్రశ్నలు వరుసగా అడుగుతుండటంతో ఆయన విలేకరుల సమావేశాన్ని అర్థాంతరంగా ముగించేసి బయటకు నడిచారు.
పాత్రికేయులపై బొత్స అనుచిత వ్యాఖ్యలు
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పాత్రికేయులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏపీ భవన్‌లో విలేకరుల సమావేశం ముగించి తన అధికార నివాసంలోకి వెళుతున్నప్పుడు.. కొంత మంది విలేకరులు కూడా సీఎంతో వెళ్లారు. వారితో పాటే లోనికి వెళ్లిన బొత్స సత్యనారాయణ విలేకరులను ఉద్దేశించి.. ‘వేస్ట్ ఫెలోస్‌ను లోపలకు ఎందుకు రానిచ్చారు?’ అని సీఎంతో అన్నారు. దానికి సీఎం నవ్వి ఊరుకున్నారు. కాసేపటికి సీఎం విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న బొత్సతో.. తమను ఉద్దేశించి సంస్కారం లేకుండా మాట్లాడారంటూ పాత్రికేయులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘నాఇష్టం.. అంటాను. ముఖ్యమంత్రికి నేను ఏమైనా చెప్పుకుంటా. అడగడానికి మీరెవరు?’ అంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత్రికేయులు, బొత్స మధ్య వాగ్వాదం జరిగింది. బొత్స వ్యాఖ్యలను పాత్రికేయులు ఖండించారు.