కిరణ్‌కు ‘పితాని’ షాక్ | kiran kumar reddy get shock from pitani satyanarayana | Sakshi
Sakshi News home page

కిరణ్‌కు ‘పితాని’ షాక్

Published Sun, Mar 23 2014 12:37 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

kiran kumar reddy get shock from pitani satyanarayana

సాక్షి, ఏలూరు,/పోడూరు, న్యూస్‌లైన్ :
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడికి అనేక నిదర్శనాలు కనిపిస్తుంటాయి. ప్రస్తుత ఎన్నికల సీజన్‌లో ఊహకందని మలుపులు, క్షణానికోలా మారుతున్న సమీకరణలు పార్టీల అధ్యక్షులకు దడ పుట్టిస్తున్నాయి. తాజాగా జై సమైక్యాంధ్ర పార్టీ రాష్ర్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆ పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి షాక్ ఇవ్వటానికి సిద్ధమవుతున్నారు.  
 
కిరణ్ జిల్లాలో రోడ్‌షో నిర్వహించటానికి ఆదివారం వస్తుండగా, నిన్నటి వరకూ ఆయనకు నీడలా ఉన్న పితాని పంధా మార్చుకుంటున్నారనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి. జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపన నుంచి రాజమండ్రి సభ వరకు పితాని కిరణ్ వెంటే ఉన్నారు. ఆ పార్టీ విధివిధానాలు రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వినిపించింది. ఇంతలోనే ఆయన టర్న్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.
 
 పెనుగొండ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన పితాని వైఎస్ ప్రభంజనంలో 2004 ఎన్నికల్లో మొదటి సారి అసెంబ్లీ మెట్టు ఎక్కారు. 2009లో ఆచంట నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తాయితీగా  కిరణ్‌తోపాటు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. జై సమైక్యాంధ్ర పార్టీలో భాగమయ్యారు. ఆ  పార్టీని జిల్లా ప్రజలు కనీసం పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేదని గ్రహించిన ఆయన, ఆ పార్టీలో ఉంటే తనకు రాజకీయ భవిష్యత్ ఉండదని గ్రహించి జారుకోవటానికి మార్గం వేసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.  
 
 ఈ నేపధ్యంలో టీడీపీ నేత యర్రా నారాయణస్వామిని పితాని అనుచరులు  కలిసి, ఆ పార్టీలోకి పితాని రాకను వ్యతిరేకించే వారికి సర్దిచెప్పాల్సిందిగా కోరినట్టు సమాచారం. ఆచంట నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ గుబ్బల తమ్మయ్య, పితాని స్వయానా బావా బావమరుదులు. పితాని కావాలనే ముందు జాగ్రత్త చర్యగా తమ్మయ్యను ఆచంట పంపించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆచంట అసెంబ్లీ లేదా నరసాపురం లోక్‌సభ స్థానాల్లో ఏదో ఓ చోట నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో పితాని ఉన్నట్లు తెలుస్తోంది.
 
 ఈ పరిణామాలకు బలం చేకూర్చే దిశగా శనివారం కొమ్ము చిక్కాలలో పితాని ఇంటి ముందు ఆయన అనుచరులు బైఠాయించి పార్టీ మారాలంటూ ఒత్తిడి చేశారు. జై సమైక్యాంధ్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన కార్యకర్తల ఎదుట పార్టీ మారనని చెప్పలేకపోయారు. రెండు రోజుల్లో నిర్ణయం చెబుతానని ప్రకటించారు. ఆయన ఏ పార్టీలో చేరతారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటన్నిటికీ రెండ్రోజుల్లో ఆయన తెరదించే అవకాశం ఉంది. పార్టీ స్థాపించిన కొద్ది రోజులకే ఆ పార్టీ ఉపాధ్యక్షుడు బయటకు వెళ్లిపోతే పార్టీ వ్యవస్థాపకుడైన కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద షాకే.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement