విజయోత్సవాల్లో టీడీపీ శ్రేణుల దాడులు | Attacks by TDP ranks during victory celebrations | Sakshi
Sakshi News home page

విజయోత్సవాల్లో టీడీపీ శ్రేణుల దాడులు

Published Wed, Jun 5 2024 5:21 AM | Last Updated on Wed, Jun 5 2024 6:09 AM

Attacks by TDP ranks during victory celebrations

‘ప్రకాశం’లో జెడ్పీ పాఠశాల ముఖ ద్వారం, గేట్‌ జేసీబీతో కూల్చివేత

బీసీ, ఎస్సీల ఇళ్లు కూల్చేందుకు ప్రయత్నం

∙విడదల రజిని, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కార్యాలయాలపై దాడులు

బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణమండపం ధ్వంసం

డా.వైఎస్సార్‌ హెల్త్‌ వర్సిటీ పేరులో ‘వైఎస్‌’ పేరు తొలగింపు

పలుచోట్ల ప్రభుత్వ కార్యాలయాలపై దాడి.. ఆస్తి నష్టం

మచిలీపట్నం, కొవ్వూరులో కవ్వింపు చర్యలు.. రాళ్ల దాడి.. కార్లు ధ్వంసం

ఎక్కడా పోలీసుల నిషేధాజ్ఞలను పట్టించుకోని టీడీపీ–జనసేన శ్రేణులు

సాక్షి నెట్‌వర్క్‌ : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో టీడీపీ–జనసేన శ్రేణులు మంగళవారం విజయోత్సాహంతో అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుల ఇళ్లపై దాడులు చేశారు. గుంటూరులోని మంత్రి విడదల రజిని కార్యాలయం, పల్నాడు జిల్లాలో ఓ సచివాలయంతోపాటు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చెందిన కళ్యాణమండపాన్ని ధ్వంసం చేశారు.

విజయవాడలోని వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరులోని వైఎస్‌ను తొలగించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి ఊరేగింపులు చేయరాదని, బాణాసంచా కాల్చరాదని రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఎంత ప్రచారం చేసినా టీడీపీ–జనసేన శ్రేణులు ఎక్కడా పట్టించుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ దాడులు జరిగాయంటే..

»  ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం విప్పగుంట గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ముఖ ద్వారం, గేట్‌ను టీడీపీ నేతలు జేసీబీతో కూల్చివేశారు. ఈ ముఖ ద్వారం, గేట్‌ను గ్రామానికి చెందిన దాత ముప్పా సుబ్బారావు కుటుంబ సభ్యులు ముప్పా రోశయ్య పేరు మీద 2010లో సుమారు రూ.5 లక్షలతో పాఠశాలకు వీటిని నిర్మించారు. అనంతరం టీడీపీ నేత­లు  గ్రామంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు, 

బీసీ కులా­నికి చెందిన పెరుగు మాల్యాద్రి ఇంటిని కూల్చ­డానికి జేసీబీని తీసుకొచ్చి గొడవకు దిగారు. దీంతో మాల్యా­ద్రితోపాటు అతని భార్య ఆదిలక్ష్మి అడ్డుకో­వడంతో టీడీపీ నేతలు వారిపై దాడికి ప్రయ­త్నించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. జెడ్పీ పాఠ­శాల ముఖ ద్వారాన్ని కూల్చివేసిన జేసీబీని పోలీస్‌­స్టేషన్‌కు తరలించారు. అయితే, తెలుగు తమ్ముళ్లు దాని నెంబర్‌ ప్లేట్‌ను తొలగించడం గమనార్హం.  

»  పల్నాడు జిల్లా కొండూరులో టీడీపీ శ్రేణులు నిబంధనలకు విరుద్ధంగా పార్టీ జెండాలతో గ్రామంలో ప్రదర్శనలు నిర్వహించారు. ఎస్సీ కాలనీలోకి వెళ్లగానే కొంతమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వచ్చి మీ ఓట్లు ఇక్కడలేవు కదా వెళ్లి గ్రామాల్లోనే ప్రదర్శనలు చేసుకోండి అనడంతో గొడవలు ప్రారంభమై ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. 

దీంతో వైఎస్సార్‌సీపీకి చెందిన పోతిపోగు సమాధానం, బండారు వందనం, బుర్రి పుల్లయ్య, పోతిపోగు దేవయ్య, పోతిపోగు యాకోబు, పోతిపోగు మణమ్మ తదితరులకు గాయాలయ్యాయి. బాధితులను అచ్చంపేట పీహెచ్‌సీకి తరలించారు. కోనూరులోను ఇదే పరిస్థితి నెలకొంది. విజయోత్సవం పేరుతో టీడీపీ నాయకులు ఎస్సీ కాలనీలో దాడులు నిర్వహించడంతో పలువురు గాయపడ్డారు. 

బందరులో రాళ్ల దాడి..
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో బందరు పార్లమెంట్‌ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, బందరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర కార్యకర్తలు పెద్దఎత్తున వాహనాలపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలుండే ప్రాంతాలకు వెళ్లి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద కూడా ఇలాగే రెచ్చగొట్టారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రతిఘటించేందుకు యత్నించారు. 

కొంతమంది సీనియర్‌ నేతలు కార్యకర్తలను సముదాయిస్తుండగా కూటమి కార్యకర్తలు కొడాలి నాని అనుచరుల కారు అద్దాలు పగులగొట్టారు. దీంతో కూటమి కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మద్య ఘర్షణ మొదలైంది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ల విసురుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలను చెల్లాచెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

కొవ్వూరులో విధ్వంసం..
ఎన్నికల్లో విజయం సాధించిన ఆనందంలో టీడీపీ కార్యకర్తలు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులోనూ విధ్వంసం సృష్టించారు. 144 సెక్షన్‌ ఉన్నప్పటికీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు కార్యాలయానికి మోటార్‌ సైకిళ్లపై ర్యాలీగా వెళ్లి అక్కడున్న రెండు కార్లను పూర్తిగా ధ్వంసం చేశారు. పోలీసులు వారిస్తున్నా వారిని గెంటేసి కార్యాలయంపై రాళ్లు రువ్వారు. వైఎస్సార్‌సీపీ ప్రచార రథంతో పాటు ఇన్నోవా కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు. 

సుమారు 50 మంది యువకులు పది ని­మిషాల పాటు భయానక వాతావరణం సృష్టించారు. ఆ స­మయంలో వెంకట్రావు కుటుంబ సభ్యులందరూ కార్యా­లయంలోనే ఉన్నారు. టీడీపీ దాడితో వారు తీవ్ర భయాందో­ళన చెందారు. అక్కడ నుంచి టీడీపీ శ్రేణులు బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకుని మెప్మా కార్యాలయం తాళాలు పగులగొట్టి అందులోని కంప్యూటర్లు, టేబుళ్లు, కుర్చీలు, ఇతర ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. 

కార్యాలయంలోని రికా­ర్డులన్నింటినీ బయటకు విసిరేశారు. టీడీపీ హయాంలో ఇదే కార్యా­లయంలో అన్న క్యాంటీన్‌ నడిచేది. తాను అ­న్ని పా­ర్టీల వారితో స్నేహ భావంతో ఉంటానని, ఇలాంటి వి«­టద్వంసం తానెన్నడూ చూడలేదని తలారి వెంకట్రావు అన్నారు.  

»  పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ, జనసేన కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్ల వద్ద బాణసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. మండలంలోని మండపాక గ్రామంలో వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు బోడపాటి వీర్రాజు ఇంటిముందు వీరు బాణసంచా కాల్చడంతో ఆ నిప్పురవ్వలు పడి ఇంట్లోని దుప్పట్లు, ఇతర సామగ్రి దగ్థమయ్యాయి. 

»   ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు భౌతిక దాడులకు దిగారు. దీంతో పల్లెల్లో భయానక వాతావరణం నెలకొంది. పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా దిమ్మెను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో పలు­వురు టీడీపీ కార్యకర్తలు ఫ్యాన్ల రెక్కలు విరిచి ద్విచక్ర వాహనాలకు కట్టి వీధుల్లో ఈడ్చుకుంటూ కేకలు వేస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. 

రాప్తాడు నియోజ­కవర్గం రామగిరి మండలంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పాపిరెడ్డిపల్లిలో వైఎస్సార్‌­సీపీ నేత జయచంద్రారెడ్డి కారును పరిటాల సునీత అనుచరులు ధ్వంసం చేశారు. మరికొన్ని గ్రామాల్లో కూడా వైఎస్సార్‌సీపీ నాయకులు, సానుభూతి­పరులను ఇళ్ల వద్దకెళ్లి కవ్వించి కొందరిని గాయపరిచారు. టపాసులు పేల్చి ఇళ్లపైకి వేశారు. జిల్లా వ్యాప్తంగా ఇలా ఎన్నో ఘటనలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. 

లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయం ధ్వంసం..
గుంటూరు ఎన్టీఆర్‌ స్టేడియం సమీపంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ‘మండలి’ విప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయాన్ని టీడీపీ కార్యకర్తలు పూర్తిగా ధ్వంసం చేశారు. పెద్ద సంఖ్యలో ర్యాలీగా వెళ్తూ లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయంలోకి చొరబడ్డారు. ఫర్నిచర్, కంప్యూటర్‌ సామాగ్రి ధ్వంసం చేశారు. అక్కడున్న సిబ్బందిని చంపేస్తామంటూ బెదిరించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బూతులు తిడుతూ కార్యాలయంలోని మొత్తం సామగ్రి పగులగొట్టారు. 

»  చిత్తూరు నగరంలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ కార్యాలయాన్ని ధ్వంసంచేసి, పెట్రోలు పోసి నిప్పంటించారు. మార్కెట్‌ హరి అనే వ్యక్తికి చెందిన రూ.కోటి విలువైన సిగరెట్‌ స్టాకు గోదాముకు నిప్పంటించారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులుగా ఉన్న కన్నన్‌ నాయకర్, మండీ ప్రభాకర్‌రెడ్డి, ప్రసన్నకు చెందిన హోటళ్లను, బేకరీలను నేలమట్టం చేశారు. పూతలపట్టులోని పాలకూరులో వైఎస్‌ విగ్రహాన్ని కూలదోశారు. 

ఎగువ పాలకూరు, బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లెలో దళితుల ఇళ్లలోకి చొరబడి వారిపై దాడులు చేయగా పలువురు గాయపడ్డారు. పూతలపట్టు నయనంపల్లెలో కిరణ్‌ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్త ట్రాక్టర్‌కు నిప్పుపెట్టారు. తవణంపల్లెలోని తెల్లగుండ్లపల్లెలో కృష్ణమూర్తి యాదవ్‌ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్త జేసీబీను అపహరించి, అతని ఇంటి ప్రహరీనే కూల్చేశారు.

»  పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎండుగుంపాలెం బీసీ కాలనీలోని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని గడ్డపారలు, గొడ్డళ్ళలో ధ్వంసం చేశారు. విగ్రహాన్ని పెకిలించి ట్రాక్టర్‌కు కట్టి ఎన్‌ఎస్‌పి కాలువ వద్దకు ఈడ్చుకెళ్లారు. పోలీసులు ధ్వంసమైన విగ్రహా­న్ని యథాస్థానానికి చేర్చారు. అలాగే, మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ వర్గీయులు మద్యం సేవించి ద్విచక్ర వాహనాలకు ఫ్యాన్లు కట్టి ఈడ్చుకెళ్లారు. పోలీసుల ఆంక్షలున్నా బాణాసంచా కాల్చి భయభ్రాంతులకు గురిచేశారు. తూబాడు గ్రామంలో టీడీపీ వర్గీయులు రోడ్ల మీద పసుపు నీళ్లు చల్లారు. 

» గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామంలో తెలుగు తమ్ముళ్లు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని కూల్చేశారు. గ్రామానికి చెందిన దుర్గారావు అనే నేత ట్రాక్టరుతో గుద్దించి విగ్రహాన్ని కూల­గొట్టాడు. అతని కోసం వెతుకుతున్నారు. గ్రామస్తులు అక్కడకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. 

»  గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్‌ ముస్తఫా సోదరుడు కర్నుమా ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు అద్దాలను టీడీపీ శ్రేణులు పగలగొట్టి దాడికి యత్నించారు. కౌంటింగ్‌ సందర్భంగా కర్నుమా నాగార్జున యూనివర్శిటీకి వచ్చి అనంతరం కుటుంబ సభ్యులతో కారులో గుంటూరు బయల్దేరారు. టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దూసు­కొచ్చి రాళ్లు, కర్రలతో కారుపై అద్దాలు పగలగొట్టి దాడికి యత్నించారు. కారులో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. కర్నుమా కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

»  పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో జరిగిన విజయోత్సవ ర్యాలీ వైఎస్సార్‌సీపీ నాయకురాలు,  గ్రామ సర్పంచ్‌ చికిలే మంగతాయారు ఇంటి సమీపంలోకి రాగానే కూటమి అభిమానులు తారాజువ్వలు వేస్తూ, మోటార్‌ సైకిళ్ల సైలెన్సర్లను తొలగించి భీకర శబ్దాలతో నానా హంగామా చేశారు. ఇదే సమయంలో పెదపేటకు చెందిన యువకులతో టీడీపీ–జనసేన కార్యకర్తలు  వాగ్వాదానికి దిగి ఘర్షణలకు పాల్పడ్డా­రు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. 

»  అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పాలచెర్ల గ్రామ సచివాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దాదాపు పదిమంది గ్రామ సచివాలయానికి చేరుకుని విధుల్లో ఉన్న సిబ్బందిని బెదిరించారు. కిటికీ అద్దాలను పగలగొట్టారు. కంప్యూటర్‌పై నీళ్లు పోశారు. ప్రింటర్‌ను, బాత్‌రూమ్‌ డోర్లను పగలగొట్టారు. సచివాలయంపైన ఉన్న సింథటిక్‌ ట్యాంకు పైపులను ధ్వంసం చేశారు. సుమారు రూ.50 వేల మేర నష్టపరిచారు. ఇదే గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రాళ్ల దాడిచేశారు.

»  ఏలూరు జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడులో ఓ పెట్రోలు బంకుతోపాటు దాని యజమాని ఇంటిపై కొందరు టీడీపీ కార్యకర్తలు దాడిచేసి రాళ్లు రువ్వారు. దీంతో ఆ యజమాని, మండల వైస్‌ ఎంపీపీ అయిన వేమూరి జితేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

» ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని దొరసానిపాడులో ఒక కూల్‌డ్రింక్‌ షాపు వద్ద వైఎస్సార్‌­సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఎన్నికల ఫలితాలపై వాగ్వి­వాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు కూల్‌డ్రింక్‌ సీసాలతో దాడి చేసుకున్నారు.

ఈ దాడిలో వైఎస్సార్‌సీపీకి చెందిన గ్రామ సర్పంచ్‌ లక్కాబత్తుల సిద్ధిరాజు, లక్కాబత్తుల సురేష్, బిరుదుగడ్డ కిరణ్, అల్లాడ సురేష్, లక్కాబత్తుల జాన్‌బాబు, బిరుదుగుడ్డ కల్యాణ్, డీజే రాజు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను కవర్‌ చేస్తున్న ఒక విలేకరి సెల్‌ఫోన్‌ను లాక్కుని అతడిని గాయపరిచారు. మరోవైపు.. ఇక్కడి కూటమి కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిమిత్తం ఎస్సై సతీష్‌తో ఘర్షణకు దిగారు.

»  ఇదే జిల్లా భీమడోలు మండలంలోని పోలసానిపల్లి, అంబర్‌పేట, సూరప్పగూడెం, కురెళ్లగూడెం, భీమడో­లు తదితర గ్రామాల్లోనూ గొడవలు చోటుచేసు­కు­న్నా­యి. పోలసానిపల్లిలో జనసేన కార్యకర్తలు విజయో­త్సవ ర్యాలీ చేసుకుంటూ ఎంపీటీసీ అంబటి దేవీ నాగేంద్రప్రసాద్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలకు, ఎంపీటీసీ కుమా­రుడు, కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. 

అధిక సంఖ్యలో ఉన్న జనసేన కార్యకర్తలు ఎంపీటీసీ కుమారుడితో పాటు కుటుంబ సభ్యులపై దాడిచేశారు. వారి దుస్తులను చించివేశారు. అలాగే, అంబర్‌పేట రైతుభరోసా కేంద్రంలోకి చొరబడిన టీడీపీ కార్యకర్తలు రూ.1.50 లక్షల విలువైన కంప్యూటర్, íప్రింటర్లు, ర్యాక్‌లు, కుర్చీలను ధ్వంసం చేశారు. సిబ్బంది ఎంత వారించినా టీడీపీ కార్యకర్తలు వినలేదు.


విడదల రజిని కార్యాలయం అద్దాలు ధ్వంసం..
గుంటూరులో టీడీపీ శ్రేణులు ఎన్నికల విజయోత్సవంలో భాగంగా పెద్దఎత్తున ర్యాలీగా బయల్దేరి వైఎస్సార్‌సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడదల రజిని కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ కొంతసేపు నినాదాలు చేసి కార్యాలయంపై రాళ్లు విసిరారు.

 అక్కడున్న పోలీసు సిబ్బంది వారిని వారించినా లెక్కచేయకుండా కార్యాలయం అద్దాలను పగులగొ­ట్టారు. కార్యాలయం షట్టర్లు బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసు అదనపు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని కార్యకర్తలను చెదర­గొట్టారు. అయినా టీడీపీ కార్యకర్తలు పోలీసులను లెక్కచేయకుండా కార్యాలయంపై రాళ్లు విసిరారు. 

»  పల్నాడు జిల్లా కొచ్చర్ల సచివాలయంపై మంగళవారం తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలు దాడిచేశారు. ఇరు పార్టీలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు కర్రలు, గడ్డపార్లతో సచివాలయంపై దాడిచేసి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అనంతరం లోపల ఉన్న ఫర్నిచర్‌ను ధ్వంసంచేసి సర్పంచ్‌ కుర్చీని బయటపడేసి తగల­బెట్టారు. 

లోపలున్న కంప్యూటర్‌ను, ఇతర సామ­గ్రిని ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయం పైకెక్కి టీడీపీ జెండాను ఏర్పాటుచేశారు. దీంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కార్యాలయంపైకి రావడంతో సచివాలయ సిబ్బంది పరుగులు తీశారు.  పోలీసులు వీరిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. 

»   ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరులోని వైఎస్సార్‌ పేరును టీడీపీ నేతలు తొలగించారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో టీడీపీకి సానుకూలంగా ఫలితాలు రావడంతో కొందరు టీడీపీ కార్యకర్తలు యూనివర్శిటీ వద్దకు వెళ్లి, మెయిన్‌ గేటు వద్ద ఉన్న పేరును కాళ్లతో తన్ని ఊడగొట్టడంతో పాటు, భవనం పైకెళ్లి పేరులోని వైఎస్‌ అక్షరాలను తొలగించారు. ఆ స్థానంలో ఎన్‌టీ అక్షరాలను పెట్టారు.  

»    పల్నాడు జిల్లా వినుకొండ కారంపూడి రోడ్డులోని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చెందిన కళ్యాణ మండపాన్ని మంగళవారం కొంతమంది అల్లరి మూకలు రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. కళ్యాణ మండపంలోని అద్దాలను పగలగొట్టడమే కాకుండా అక్కడున్న కారును కూడా కాళ్లతో తన్నుతూ సుమారు అరగంటసేపు విధ్వంసం సృష్టించారు. టీడీపీ జెండాలను పట్టుకుని ద్విచక్ర వాహనాలపై కల్యాణ మండపంలోకి ప్రవేశించి ప్రధాన ద్వారం వద్ద అద్దాలు పగలగొట్టి వెళ్లిపోయారు. దీంతో అక్కడ సిబ్బంది కూడా భయభ్రాంతులకు గురయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement