సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సార్వత్రిక సమరంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఎదురీదుతోంది. రాష్ర్ట విభజన అనంతరం దూకుడు మీదున్న ఆ పార్టీ ఇతర పార్టీలనుంచి వచ్చి చేరిన నేతలకు టిక్కెట్లు ఇవ్వడంతో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇతర పార్టీల సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా స్థానికంగా వారిపై ఉన్న వ్యతిరేకత పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపేలా కనిపిస్తోంది. ముఖ్యంగా జిల్లా గ్రామీణ నియోజకవర్గాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇది పార్టీ ఎంపీ అభ్యర్ధికి సంకటంగా మారుతోంది.
తెలంగాణ సెంటిమెంటే గట్టెక్కిస్తుందనే అంచనాలో ఉన్న నేతలకు తాజా పరిణామాలు మింగుడుపడడంలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలైన వారిని సమస్యల పరిష్కారంలో చొరవ చూపలేదంటూ ఓటర్లు అడుగడుగునా నిలదీస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల ఓటర్లపై గంపెడాశలు పెట్టుకున్న గులాబీ నాయకత్వానికి ఈ పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. పార్టీ పట్ల ఓటర్లు సానుకూలంగానే ఉన్నా.. అభ్యర్థుల మీదున్న ప్రజా వ్యతిరేకత తమ పుట్టిని ఎక్కడ ముంచుతుందోననే ఆందోళన టీఆర్‌ఎస్‌లో వ్యక్తమవుతోంది. వరుస విజయాలతో రికార్డు సృష్టించిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డికి నియోజకవర్గంలో తాజా పరిణామాలు మింగుడుపడడం లేదు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనకు గండీడ్ మండలంలో చుక్కెదురైంది. సమస్యలను ఏకరువు పెడుతూ కొందరు నిలదీయడంతో హరీశ్వర్ కంగుతిన్నారు. అలాగే గురువారం దోమ మండలంలో పర్యటించిన ఆయన కుటుంబసభ్యులకు ఇదే తరహా పరాభవం ఎదురైంది.
కాంగ్రెస్, టీడీపీ-బీజేపీ అభ్యర్థులను ఓడించడం ద్వారా రాష్ట్ర మంత్రివర్గంలో బెర్త్ ఖాయమనే ఆశతో ఉన్న హరీశ్వర్ అనుచరగణానికి తాజా పరిస్థితులు అర్థం కావడంలేదు. మరోవైపు తాండూరు అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డి పరిస్థితి కూడా దారుణంగా మారింది. ఎన్నికలకు ముందు టీడీపీని వీడి కారెక్కిన ఆయనను టీజేఏసీ టార్గెట్ చేసుకుంది. తెలంగాణవాదులపై దాడులు చేయించిన మహేందర్ తెలంగాణ ద్రోహి అంటూ విమర్శలు ఎక్కుపెట్టింది. ఈ పరిణామాన్ని ఊహించని గులాబీ దళం నష్టనివారణ చర్యలకు దిగినా ఫలితం కనిపించడంలేదు. స్థానికంగా టీజేఏసీ నేతలను సానుకూలంగా మార్చుకొనేందుకు మహేందర్ చేస్తున్న ప్రయత్నాలకు స్పందన కనిపించడం లేదు. సాక్షాత్తూ టీజేఏసీ చైర్మన్ కోదండరామే ఈయన చేరికను తప్పుబట్టిన నేపథ్యంలో టీఆర్‌ఎస్ నాయకత్వం ఆత్మరక్షణలో పడింది. ఇదే క్రమంలో స్థానికంగా ఆయనకు ఎదురుగాలి వీస్తుండడం అధిష్టానానికి ఆందోళన కలిగిస్తోంది. ఇంకోవైపు చేవెళ్లలో కేఎస్ రత్నం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ రెబల్ అభ్యర్థిగా సీనియర్ నేత ఆంజనేయులు బరిలో దిగారు.
టీఆర్‌ఎస్‌లోని ఒక వర్గం ఆయనకు మద్దతుగా నిలిచింది. ఇది రత్నం విజయంపై ప్రభావం చూపనుందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రత్నం వెంట కొంతమంది చోటామోటా లీడర్లు మినహా కిందిస్థాయి శ్రేణి కార్యకర్తలెవరూ వెళ్లలేదు. ఈ పరిణామాలతో రత్నం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వికారాబాద్ అభ్యర్థి సంజీవరావుకు సొంత పార్టీలో సహాయ నిరాకరణ ఎదురవుతోంది. రాత్రికి రాత్రే పార్టీ మారిన సంజీవరావుకు టికెట్టు కేటాయించారని ఆరోపిస్తూ ఆ పార్టీలోని ఒక వర్గం.. ప్రచారపర్వంలో పాల్గొనడంలేదు. కీలకమైన గ్రామీణ నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్ధులపై వ్యతిరేక పవనాలు వీస్తుండడం, మరోవైపు పట్టణ నియోజకవర్గాల్లో పార్టీ ఇంకా పుంజుకోకపోవడం లోక్‌సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఇబ్బందిగా మారింది.
పట్టణ అసెంబ్లీ సెగ్మెంట్లయిన శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరంలలో గులాబీ వికాసం అంతంతమాత్రంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులపై ప్రజా వ్యతిరేకత తమ విజయానికి ఎక్కడ ప్రతిబంధకంగా మారుతుందోనని టీఆర్‌ఎస్ వర్గాల్లో ఆందోళన కనిపిస్తోంది. లోక్‌సభ స్థానం పరిధిలో ఈ వ్యతిరేక ప్రభావా న్ని తగ్గించుకొనే మార్గాలపై విశ్వేశ్వరరెడ్డి దృష్టి సారించారు. పట్టణ, గ్రామీణ నియోజకవర్గ ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకొని ఆయన ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలను ప్రకటిస్తున్నారు. ప్రజల మౌలిక అవసరాలతో కూడుకున్నవి కావడంతో ఆ ప్రణాళికలు ఓటర్లను ఆకర్షిస్తాయని పార్టీవర్గాలు వివరిస్తున్నాయి.
కారుకు ఎదురుగాలి!
Published Thu, Apr 17 2014 11:57 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement