సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు తీర్పు ఇచ్చే రోజు వచ్చేసింది. గురువారం ఉదయం నుంచే పోలింగ్ మొదలుకానుంది. ఈ మేరకు సర్వం సిద్ధం చేసినట్టు ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. వామపక్ష తీవ్రవాద ప్రభావమున్న 13 స్థానాల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు.. మిగతా 106 చోట్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ప్రకటిస్తారు. మిగతా ప్రక్రియల పూర్తి అనంతరం డిసెంబర్ 5తో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.
మూడు కోట్లకుపైగా ఓటర్లు
రాష్ట్రంలో 1,63,01,705 మంది మహిళలు, 1,62,98,418 మంది పురుషులు, 2,676 మంది మూడో జెండర్ ఓటర్లు కలిపి మొత్తంగా 3,26,18,205 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో కలిపి 2,067 మంది పురుష అభ్యర్థులు, 222 మంది మహిళా అభ్యర్థులు, మూడో జెండర్ అభ్యర్థి ఒకరు కలిపి మొత్తం 2,290 మంది ఎన్నికల్లో పోటీపడుతున్నారు.
ఏ పార్టీల నుంచి ఎంత మంది అభ్యర్థులు?
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో బీఆర్‌ఎస్ పోటీచేస్తోంది. కాంగ్రెస్ 118 సీట్లలో, ఆ పార్టీ పొత్తుతో సీపీఐ ఒకచోట బరిలో ఉన్నాయి. మరో కూటమిలో భాగంగా బీజేపీ 111, జనసేన 8 స్థానాల నుంచి పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ 107 చోట్ల, ఎంఐఎం 9 చోట్ల, సీపీఎం 19 చోట్ల, సీపీఐఎల్(న్యూడెమోక్రసీ) ఒకచోట తలపడుతున్నాయి.
– ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 41 మంది, ధర్మసమాజ్ పార్టీ నుంచి 101 మంది, జైమహాభారత్ పార్టీ నుంచి 13 మంది, రాష్ట్రీయ సామాన్య ప్రజాపార్టీ నుంచి నలుగురు, ఇతర పార్టీల నుంచి మరో 659 మంది, స్వతంత్రులు 989 మంది ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
– నియోజకవర్గాల వారీగా చూస్తే.. అత్యధికంగా ఎల్బీనగర్ నుంచి 48 మంది, గజ్వేల్ నుంచి 44 మంది, కామారెడ్డి, మునుగోడుల నుంచి 39 మంది చొప్పున పోటీపడుతుండగా.. అత్యల్పంగా నారాయణపేట, బాన్సువాడల్లో ఏడుగురు చొప్పున, బాల్కొండలో 8 మంది బరిలో ఉన్నారు.
35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
రాష్ట్రంలో 299 అనుబంధ పోలింగ్ కేంద్రాలు సహా మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 27,094 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు. ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న 7,571 ప్రాంతాల్లో బయటి పరిసరాలను సైతం వెబ్‌కాస్టింగ్ చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. మిగతా పోలింగ్ కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలు, వీడియోగ్రాఫర్లు, ఫోన్లు, ట్యాబ్స్, ల్యాప్‌ట్యాప్‌లతో విద్యార్థులు పోలింగ్ ప్రక్రియను రికార్డు చేయనున్నారు. రికార్డు చేసిన డేటాను ప్రిసైడింగ్ అధికారులు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి అప్పగిస్తారు.
పటిష్టంగా బందోబస్తు
పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 45వేల మంది రాష్ట్ర పోలీసులు, మరో 3వేల మంది అటవీ/ఆబ్కారీ సిబ్బంది, 50 కంపెనీల టీఎస్‌ఎస్పీ, 375 కంపెనీల కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వచ్చిన 23,500 మంది హోంగార్డులు కూడా బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు.
దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు
దివ్యాంగ ఓటర్లు సులువుగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బ్రెయిలీ లిపిలో 76,532 ఓటరు స్లిప్పులు, 40 వేల ఓటర్ గైడ్స్, 40 వేల డమ్మీ బ్యాలెట్ పేపర్లను ముద్రించి అంధ ఓటర్లకు పంపిణీ చేశారు. శారీరక వికలాంగులను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి తరలించడానికి ఆటోలను ఏర్పాటు చేయనున్నారు. వారికోసం పోలింగ్ కేంద్రాల వద్ద 21,686 ట్రై సైకిళ్లను అందుబాటులో ఉంచారు. ర్యాంపులను ఏర్పాటు చేశారు.
ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ నేతృత్వంలో దాదాపు ఏడాది నుంచీ ఏర్పాట్లు జరిగాయి. ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ, ఈవీఎంలను సంసిద్ధం చేయడం, ఎన్నికలు/ పోలింగ్ అధికారులు, సిబ్బంది నియామకం/శిక్షణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్లకు సదుపాయాల కల్పన, భద్రతా ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తిచేసింది.
మొత్తం 2,00,433 మంది అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. అన్నిజిల్లాల్లో పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామాగ్రిని తీసుకుని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని సీఈఓ కార్యాలయం బుధవారం అర్ధరాత్రి ప్రకటించింది. వారంతా రాత్రి పోలింగ్ కేంద్రాల్లోనే బస చేస్తారు. ప్రిసైడింగ్ అధికారులు గురువారం ఉదయం 5.30 గంటలకు పోల్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలతో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. తర్వాత కంట్రోల్ యూనిట్‌లోని మెమరీ డిలీట్ చేసి, వీవీ ప్యాట్ కంటైనర్ బాక్స్ నుంచి మాక్ ఓటింగ్ స్లిప్పులను తొలగిస్తారు.
పోలింగ్ శాతం మళ్లీ పెరగాలి
గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,80,64,684 మంది ఓటర్లకు గాను 2,05,80,470 (73.2 %) మంది ఓటేశారు. 1,41,56,182 మంది మొత్తం పురుష ఓటర్లకు గాను 1,03,17,064 (72.54%) మంది, 1,39,05,811 మంది మొత్తం మహిళా ఓటర్లకు గాను 1,02,63,214(73.88%) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2691 మంది మూడో జెండర్ ఓటర్లలో కేవలం 192 (8.99%) మంది మాత్రమే ఓటేశారు.
2014 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో కేవలం 69.5శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. 2014 ఎన్నికలతో పోల్చితే 2018 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. ప్రస్తుత ఎన్నికల్లో కూడా పోలింగ్ శాతం మరింతగా పెంచేందుకు ఓటర్లందరూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేయాలని ఎన్నికల యంత్రాంగం పిలుపునిచ్చింది.
తెలంగాణలో నేడు ఓట్ల పండుగ
Published Thu, Nov 30 2023 1:05 AM | Last Updated on Thu, Nov 30 2023 6:38 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment